సీతంపేట: గిరిజన ఆశ్రమపాఠశాలల్లో గతంలో జరిపిన హిమోగ్లోబిన్ పరీక్షల్లో సికిల్‌సెల్ ఎనిమియా పాజిటివ్‌గా వచ్చిన 106 మంది గిరిజన విద్యార్థులకు రక్తం ఎక్కించి వైద్యసేవలు అందేలా చర్యలు తీసుకోవాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి లోతేటి శివశంకర్ ఆదేశించారు. స్థానిక ఐటీడీఏలో విద్యార్థుల ఆరోగ్య విషయమై ఏటీడబ్ల్యూవోలు, పీఎంఆర్‌సీ, గిరిజన సంక్షేమశాఖ, వైద్యసిబ్బందితో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శివశంకర్ మాట్లాడుతూ కొద్దిరోజుల్లో రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహిస్తున్నామని తెలిపారు.
ఆ రక్తాన్ని విద్యార్థులకే వినియోగించేలా చర్యలు తీసుకుంటామన్నారు. విద్యార్థులకు ఎప్పటికప్పుడు హిమోగ్లోబిన్ పరీక్షలు హెల్త్ వలంటీర్ల ద్వారా నిర్వహించాలన్నారు. పాఠశాలల్లో తాగునీటి కోసం 25 ఆర్వో ప్లాంట్లు మంజూరయ్యాయన్నారు. ప్రాథమిక పాఠశాలలకు అవసరమైన ప్రాథమిక చికిత్స కిట్లు ఇవ్వాలని సూచించారు. అక్టోబర్ 15నాటికి విద్యార్థులకు హెల్త్ కార్డులు మంజూరు చేయాలన్నారు. ఈనెల 7,8 తేదీల్లో హెల్త్‌వలంటీర్‌లకు విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శిక్షణ ఇస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్‌బీఎస్‌కే జిల్లా కో–ఆర్డినేటర్ మెండ ప్రవీణ్, న్యూనెట్ సంస్థ జిల్లా కో–ఆర్డినేటర్ రాజు, ఏటీడబ్ల్యూవోలు బల్ల అప్పారావు, మల్లికార్జునరావు, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment