సాక్షి, అమరావతి: రక్త హీనతను పూర్తి స్థాయిలో అరికట్టి ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు గర్భిణిలు, బాలింతలు, పిల్లలకు ప్రతి నెలా హిమోగ్లోబిన్ పరీక్షలు చేయాలని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. జీవన శైలిలో మార్పుల కారణంగా వస్తున్న వ్యాధులు, వాటి నివారణకు తీసుకోవాల్సిన చర్యలు, వ్యాయామాల ఆవశ్యకతను వివరిస్తూ క్యాంపులు నిర్వహించాలని సూచించారు. ఇందుకోసం ప్రతి నెలా ఒకసారి క్యాంపు నిర్వహించేలా చూడాలన్నారు. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖపై ముఖ్యమంత్రి జగన్ బుధవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు.
ప్రతి ఇంటిని జల్లెడ పడుతూ..
జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపుల ద్వారా ప్రతి ఇంటిని జల్లెడ పట్టి రక్తహీనత, పౌష్టికాహార లోపం బాధితులను గుర్తిస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. వారందరికీ పౌష్టికాహారాన్ని అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మందులు ఇచ్చే బాధ్యతను ఆరోగ్యశాఖ తీసుకుంటుందని, పౌష్టికాహారం బాధ్యతను మహిళా, శిశు సంక్షేమ శాఖ చేపట్టాలని నిర్దేశించారు. ఈ విషయంలో ఆయా సచివాలయాల పరిధిలో వైద్య శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ మధ్య సమన్వయం ఉండాలని స్పష్టం చేశారు. తద్వారా గ్రామ స్థాయిలో రక్త హీనతను పూర్తిస్థాయిలో నివారించగలుగుతామన్నారు.
తగ్గిందో లేదో పర్యవేక్షించాలి
పౌష్టికాహారాన్ని తీసుకున్నాక బాధితుల్లో రక్తహీనత తగ్గుతోందా లేదా? అనే అంశంపై కూడా దృష్టి పెట్టాలి. ఇచ్చిన పౌష్టికాహారాన్ని వారు తీసుకుంటున్నారా? లేదా? అనే విషయాన్ని నిర్థారించుకోవాలి. సంపూర్ణ పోషణ కింద పౌష్టికాహారాన్ని అందిస్తున్న సమయంలోనే గర్భిణిలు, పిల్లలకు టీకాలు అందించారా? లేదా? అనే అంశాలను కూడా పర్యవేక్షించాలని సీఎం జగన్ ఆదేశించారు. ఒకవేళ టీకాలు మిస్ అయితే వెంటనే ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ మేరకు సంబంధిత గ్రామానికి చెందిన ఏఎన్‌ఎం ఆ సమయంలో అక్కడే ఉండేలా చూడాలని స్పష్టం చేశారు.
యాప్‌లో వివరాలు నమోదు
పిల్లలు తమ వయసుకు తగ్గట్టుగా బరువు ఉన్నారా? లేదా? అన్నదానిపై కూడా అక్కడే పరిశీలన చేయాలని ముఖ్యమంత్రి జగన్ సూచించారు. ఎవరైనా పిల్లల్లో పౌష్టికాహారం లోపం ఉంటే వారిపై ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాలని స్పష్టం చేశారు. ఈ వివరాలన్నీ ఎప్పటికప్పుడు యాప్‌లో నమోదు అయ్యేలా చూడాలన్నారు. రక్తహీనత, పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న పిల్లలను గుర్తించిన వెంటనే ఆ వివరాలను మహిళా శిశు సంక్షేమ శాఖ సిబ్బంది దృష్టికి తెచ్చి పౌష్టికాహారం అందేలా చూడాలన్నారు. ఈ విషయంలో సచివాలయాల వారీగా వైద్య ఆరోగ్య శాఖతో సమన్వయం చేసుకోవాలని సీఎం సూచించారు.
డ్రై రేషన్‌పై ప్రత్యేక దృష్టి
వైఎస్సార్ సంపూర్ణ పోషణ అమలుపై సమీక్షించిన ముఖ్యమంత్రి జగన్ ఈ కార్యక్రమాన్ని అత్యంత నిశితంగా పర్యవేక్షించాలని నిర్దేశించారు. అంగన్‌వాడీలలో సూపర్ వైజరీ వ్యవస్ధ ఎలా పని చేస్తోందన్న దానిపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని, ఇందుకోసం బలమైన ఎస్‌వోపీని రూపొందించాలని సూచించారు. డ్రై రేషన్ పంపిణీపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలన్నారు. ఇప్పుడు అమలవుతున్న విధానంపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని, రేషన్ నాణ్యత విషయంలో ఎక్కడా లోపాలు ఉండకూడదని స్పష్టం చేశారు.
ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఆదేశించారు. సమీక్షలో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ మంత్రి కేవీ ఉషశ్రీ చరణ్, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి జి.జయలక్ష్మి, ఆర్ధికశాఖ కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ, ఏపీడీడీసీఎఫ్ ఎండీ అహ్మద్ బాబు, పాఠశాల విద్యాశాఖ (మౌలిక వసతుల కల్పన) కమిషనర్ కాటమనేని భాస్కర్, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ కమిషనర్ ఎం.జానకి, పౌరసరఫరాలశాఖ ఎండీ జి.వీరపాండియన్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ జె.నివాస్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment