ఏపీఎంఎస్‌ఐడీసీకి కమీషన్ల జబ్బు | Commissions sick to APMSIDC | Sakshi
Sakshi News home page

ఏపీఎంఎస్‌ఐడీసీకి కమీషన్ల జబ్బు

Published Mon, Jun 24 2019 4:50 AM | Last Updated on Mon, Jun 24 2019 4:50 AM

Commissions sick to APMSIDC  - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్ర మౌలిక వైద్య సదుపాయాల అభివృద్ధి సంస్థలో (ఏపీఎంఎస్‌ఐడీసీ) తవ్వేకొద్దీ అవినీతి వ్యవహారాలు బయట పడుతున్నాయి. మందుల కొనుగోలు నుంచి సివిల్‌ నిర్మాణాల వరకూ ఆన్‌లైన్‌ టెండర్లకు వేదికైన ఈ సంస్థలో గత నాలుగున్నరేళ్లలో ఎన్నో అక్రమాలు చోటు చేసుకున్నాయి. రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో గర్భిణులు, బాలింతల్లో రక్తహీనతను గుర్తించి, చికిత్స అందించేందుకు ఎనీమియా స్క్రీనింగ్‌ యంత్రాల (హిమోగ్లోబిన్‌ డిజిటల్‌ మెషీన్లు) కొనుగోలుకు జాతీయ ఆరోగ్య మిషన్‌ ఉత్తర్వులు జారీ చేసింది. కమీషన్లకు కక్కుర్తి పడిన ఏపీఎంఎస్‌ఐడీసీ గత ఆరు నెలలుగా 164 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు హిమోగ్లోబిన్‌ డిజిటల్‌ మీటర్లను సరఫరా చేయలేదు. గర్భిణులు, బాలింతలకు ఉపయోగపడే యంత్రాలను రాకుండా అడ్డుకున్నారంటే ఏపీఎంఎస్‌ఐడీసీ అధికారులు ఎంత దారుణంగా వ్యవహరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. 

3,150 యంత్రాల కొనుగోలుకు టెండర్లు 
రాష్ట్రంలో ఏటా 7.50 లక్షలకు పైగా ప్రసవాలు జరుగుతున్నాయి. గర్భిణుల్లో 60 శాతం మంది రక్తహీనత బాధితులే. పదేపదే సూదితో గుచ్చి రక్తం తీయడం వారికి ఇబ్బందికరంగా ఉంటుంది. అందుకే జాతీయ ఆరోగ్య మిషన్‌ ప్రాథమికంగా 164 పీహెచ్‌సీలకు అత్యాధునిక హిమోగ్లోబిన్‌ డిజిటల్‌ మీటర్లను సరఫరా చేయాలని నిర్ణయించింది. ఈ మెషీన్లు ఉంటే గర్భిణులు, బాలింతలకు సూది గుచ్చాల్సిన అవసరం ఉండదు. కనురెప్పలు తెరిచి, ఆ మెషీన్‌తో చూస్తే శరీరంలో ఎంతమేరకు రక్త శాతం ఉందో క్షణాల్లో తెలిసిపోతుంది. ఈ మెషీన్‌కు బ్లూటూత్‌ పరికరం ఉంటుంది.

వైద్యుడు సుదూర ప్రాంతంలో ఉన్నా అతడి సెల్‌ఫోన్‌కు ఈ హిమోగ్లోబిన్‌ సమాచారాన్ని పంపించి, సలహాలు సూచనలు పొందవచ్చు. మొత్తం 3,150 మెషీన్ల కొనుగోలుకు ఏపీఎంఎస్‌ఐడీసీ 2018 అక్టోబర్‌ 9న టెండర్లు పిలిచింది. సాంకేతిక, ఆర్థిక బిడ్‌ల పరిశీలన తరువాత డెమో కూడా పూర్తయ్యింది. బయోసైన్స్‌ అనే సంస్థ ఒక్కో మెషీన్‌ను రూ.21 వేలకు కోట్‌ చేసి, టెండర్లలో ఎల్‌1గా నిలిచింది. ఎల్‌2గా నిలిచిన మాసిమో అనే సంస్థ ఒక్కో యంత్రానికి రూ.80 వేలు కోట్‌ చేసింది. దీంతో ఎల్‌1గా తేలిన బయోసైన్స్‌ సంస్థకు టెండర్‌ అప్పగించాల్సిన ఏపీఎంఎస్‌ఐడీసీ ఆ పని చేయలేదు. కమీషన్ల బేరం కుదరకపోవడమే ఇందుకు కారణమన్న ఆరోపణలు ఉన్నాయి. అధికారుల అవినీతి వల్ల 2019 జనవరి నుంచి ఇప్పటివరకూ ఆ మెషీన్లు సరఫరా కాలేదు.

బయోసైన్స్‌కు ప్రొడక్ట్‌ లైసెన్స్‌ లేదు 
‘‘హిమోగ్లోబిన్‌ డిజిటల్‌ మీటర్ల కొనుగోళ్లకు సంబంధించి టెండర్లలో ఎల్‌1గా తేలిన బయోసైన్స్‌ సంస్థకు ప్రొడక్ట్‌ లైసెన్స్‌ లేదని మాసిమో సంస్థ ఫిర్యాదు చేసింది. దీనిపై వెరిఫికేషన్‌ చేశాం. ఫైల్‌ను ఉన్నతాధికారులకు పంపించాం. ఈ టెండర్ల ప్రక్రియ నుంచి తప్పుకున్నాం. టెండర్‌ రద్దయ్యింది’’ 
– సీహెచ్‌ గోపీనాథ్, ఎండీ, ఏపీఎంఎస్‌ఐడీసీ

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement