రూ.693 కోట్ల ఎన్‌హెచ్‌ఎం బకాయిలు ఇవ్వండి: సీఎం రేవంత్‌రెడ్డి | CM Revanth Reddy appeal to Union Minister Nadda | Sakshi
Sakshi News home page

రూ.693 కోట్ల ఎన్‌హెచ్‌ఎం బకాయిలు ఇవ్వండి: సీఎం రేవంత్‌రెడ్డి

Published Wed, Jun 26 2024 3:57 AM | Last Updated on Wed, Jun 26 2024 12:00 PM

CM Revanth Reddy appeal to Union Minister Nadda

కేంద్ర మంత్రి నడ్డాకు సీఎం రేవంత్‌రెడ్డి వినతి

సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ ఆరోగ్య మిషన్‌ (ఎన్‌హెచ్‌ఎం)లో భాగంగా కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన రూ.693.13 కోట్ల బకాయి లను వెంటనే విడుదల చేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాకు సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఢిల్లీలో కేంద్ర మంత్రిని ఆయన కలిశారు. ఈ సందర్భంగా వైద్యారోగ్య రంగంపై తెలంగాణ ప్రభుత్వం చూపుతున్న శ్రద్ధ గురించి నడ్డాకు రేవంత్‌ వివరించారు. ఆయుష్మాన్‌ భారత్‌ నిబంధనలన్నీ ఈ ఏడాది జనవరి నుంచి అమలు చేస్తున్నట్లు వివరించారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు 5,159 బస్తీ దవాఖానాలు (ఆయుష్మాన్‌ ఆరోగ్య మందిరాలు) నిర్వహిస్తున్నామని చెప్పారు.

కేంద్రం వాటా ఆలస్యంతో మేమే చెల్లిస్తున్నాం..: రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నందున కేంద్రం సహకరించాలని, ఎన్‌హెచ్‌ఎం బకాయిలు విడుదల చేయాలని నడ్డాను రేవంత్‌ కోరారు. 2023–24 ఆర్థిక సంవత్సరంలోని మూడు, నాలుగు త్రైమాసికాల కింద రూ. 323.73 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని.. 2024–25 మొదటి త్రైమాసిక గ్రాంట్‌ రూ. 138 కోట్లు మంజురు చేయాల్సి ఉందన్నారు. ఆ మొత్తాన్ని వెంటనే విడుదల చేయాలని కేంద్ర మంత్రిని ముఖ్యమంత్రి కోరారు. 

ఎన్‌హెచ్‌ఎం కింద చేపట్టిన మౌలికవసతులు, నిర్వహణ కాంపొనెంట్‌ కింద 2023–2024 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రావల్సిన రూ. 231.40 కోట్లను తక్షణమే రీయింబర్స్‌ చేయాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఎన్‌హెచ్‌ఎంకు సంబంధించి కేంద్రం నుంచి రావల్సిన నిధులు ఆలస్యం కావడంతో అత్యవసర వైద్య సేవలకు అంతరాయం, సిబ్బందికి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు రాష్ట్ర వాటాతోపాటు కేంద్రం వాటా మొత్తాన్ని 2023 అక్టోబర్‌ నుంచి తామే విడుదల చేస్తున్నామని నడ్డా దృష్టికి రేవంత్‌ రెడ్డి తీసుకెళ్లారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement