ప్రాణాలు తీస్తున్న రక్తహీనత | Anemia kills | Sakshi
Sakshi News home page

ప్రాణాలు తీస్తున్న రక్తహీనత

Published Mon, Sep 7 2015 2:28 AM | Last Updated on Sun, Sep 3 2017 8:52 AM

Anemia kills

మహిళలకు మాతృత్వం దేవుడిచ్చిన గొప్ప వరం. వివాహ బంధంలోకి అడుగుపెట్టిన వారు మాతృత్వం కోసం పరి తపిస్తుంటారు. అమ్మతనంలోని మాధుర్యాన్ని అనుభవించాలని ఆరాటపడుతారు. అలాంటి మాతృత్వం జిల్లా ఏజెన్సీలోని మహిళలకు శాపంగా మారుతోంది. గిరి సీమలో సరైన పోషకాహారం లభించక రక్తహీనతతో గర్భిణులు, బాలింతలు మృత్యు ఒడికి చేరుతున్నారు. కొంతకాలంగా ఏజెన్సీలో ఎక్కడో ఓ చోట గర్భిణులు, బాలింతలు పౌష్టికాహారం లోపించి రక్తహీనతతో చనిపోతూనే ఉన్నారు. గత నెలలో సమస్యాత్మక మండలాల్లో ముగ్గురు బాలింతలు రక్తహీనతతో మృతిచెందడం ఆందోళన కలిగిస్తోంది.
 
ఉట్నూర్ :
సాధారణంగా మనిషి శరీరంలో 14 గ్రాముల హిమోగ్లోబిన్ ఉండాలి. 12 నుంచి 16 గ్రాముల వరకు ఉంటే ఆరోగ్యవంతులుగా భావిస్తారు. ఏజెన్సీలోని గర్భిణి, బాలింతల్లో 15 నుంచి 18 గ్రాముల వరకు, చిన్నారుల్లో 9 నుంచి 12 గ్రాముల వరకు ఉంటేనే ఆరోగ్యంగా ఉంటారు. దీనికితోడు ఏజెన్సీలోని బాలింతలు, గర్భిణుల్లో ఏడు గ్రాముల కంటే తక్కువగా హిమోగ్లోబిన్ ఉంటోంది. ఏజెన్సీలోని పీహెచ్‌సీల పరిధిలో ఆగస్టు నెల వరకు 4,999 మంది గిరిజన గర్భిణులు ఉన్నట్లు వైద్యాధికారులు గుర్తించారు. వీరిలో 75 శాతం గర్భిణులు రక్తహీనతతో బాధపడుతున్న వారే కావడం గమనార్హం. వీరికి సరైన పోషకాహారం దొరక్క పరిస్థితి ఇలా ఉంది. వీరిలో చాలామంది నెలనెలా వైద్య పరీక్షలు చేయించుకోకుండా దూరంగా ఉంటున్నారు. దీంతో చాలామందిలో రక్తహీనత సమస్య రావడంతో ప్రసవ సమయంలో రక్తస్రావం అధికమై చనిపోతున్నారు.  
 
శాపంగా పోషకాహారం లోపం..  
ఏజెన్సీలో పోషకాహార లేమి గిరిజనుల పాలిట శాపంగా మారుతోంది. సరిపడా ఆహారం దొరక్క.. దొరికిన దాంట్లో పోషక విలువలు కొరవడడంతో శ రీరంలో హిమోగ్లోబిన్ శాతం వేగంగా తగ్గుతోంది. ఎర్ర రక్తకణాల సంఖ్య పడి పోతూ రక్తహీనతకు గురవుతున్నారు. రక్తహీనతను నివారించడానికి గర్భిణి, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందించేందుకు ఉట్నూర్‌లో 2008లో ఏర్పాటుచేసిన పోషక ఆహార పునరావాస కేంద్రం మూతపడింది. సమస్యాత్మక మండలాలైన నార్నూర్, జైనూర్, ఇంద్రవెల్లి, ఉట్నూర్, సిర్పూర్(యు)లోని గ్రామాల్లో ఏర్పాటు చేసిన 170 సంపూర్ణ గ్రామ ఆరోగ్య కేంద్రాల్లో సగానికి పైగా మూతపడ్డాయి. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఆశయం నీరుగారుతోంది. ఏజెన్సీలోని మహిళల మరణాలను నిరోధించేందుకు ప్రభుత్వం ఐటీడీఏ ద్వారా ఆహార భద్రత కార్యక్రమం చేపట్టినా.. ఐటీడీఏ మధ్యలోనే చేతులెత్తేసింది. ఏజెన్సీలో 2007లో 35,402 గిరిజన కుటుంబాలు, 2008లో 28,217 కుటుంబాలు, 2009లో 11,667 కుటుంబాలు, 2011లో 13,269 కుటుంబాలకు ఈ పథకం ద్వారా పోషకాహారం అందించారు. తదుపరి నాలుగేళ్లుగా ఆ ఊసే లేదు.
 
అవగాహన కరువు..
ఏజెన్సీలో మహిళలు గర్భం దాల్చిన నాటి నుంచి తీసుకోవాల్సిన పౌష్టికాహారం, జాగ్రత్తలపై అవగాహన కల్పించాల్సిన వైద్య సిబ్బంది ఆ దిశగా చర్యలు చేపట్ట డం లేదు. ఫలితంగా క్రమం తప్పకుండా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలకు వారు దూరంగా ఉంటున్నారు. ప్రసూతి సమయంలో ఆస్పత్రికి వెళ్లకుండా ఇంట్లోనే సాధారణ ప్రసూతి చేసుకోవాలని ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. గర్భిణులుగా ఉన్న సమయంలో పేర్లు నమోదు చేసుకునే సిబ్బంది.. తర్వాత వారిని విస్మరిస్తున్నారు.

ఏజెన్సీ వాసులు వైద్యం కోసం డివిజన్ కేం ద్రంలోని ఉట్నూర్‌లో ఉన్న సామాజిక ఆరోగ్య కేంద్రానికి వస్తుంటారు. ప్రసూతి సమయంలో గర్భిణులను ఈ కేంద్రానికి తీసుకువద్దామంటే సీహెచ్‌సీలో రెండు గైనకాలజిస్టు పోస్టులు, అనస్థీషియా, ప్రిడియాస్ట్రీషన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గతంలో ఐటీడీఏ ద్వారా నెలసరి వేతనం రూ.లక్షన్నర ఇస్తామని ప్రకటనలు ఇచ్చినా.. ఇక్కడ విధులు నిర్వర్తించేందుకు ఎవ రూ రా లేదు. దీంతో సీహెచ్‌సీలో గైనకాలజిస్టులు లేక ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్ వంటి ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. కొందరు అక్కడికి వెళ్లలేక.. ఆర్థిక స్థోమతకు నోచుకోక ప్రాణాలు కోల్పోతున్నారు.
 
చర్యలు తీసుకుంటున్నాం..
రక్తహీనతతో గర్భిణులు, బాలింతలు మృతిచెందకుండా చర్యలు తీసుకుంటుంన్నాం. వీరిపై ప్రత్యేక దృష్టి సారించాలని సిబ్బందిని ఆదేశించాం. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవం అయ్యేలా అవగాహన కల్పిస్తూ ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలను వివరిస్తున్నాం.
 - ప్రభాకర్ రెడ్డి, ఏజెన్సీ అదనపు వైద్యాధికారి
 
గత నెలలో మృత్యువాత పడిన బాలింతలు..
- జైనూర్ మండలం పుల్లారాకు చెందిన ఆత్రం లలిత(48). నెలలు నిండడంతో నెల రోజుల ముందుగానే ప్రసవం కోసం తల్లిగారిళ్లు గూడమామడకు వచ్చింది. ఆగస్టు 17న పురిటి నొప్పులు రావడంతో ప్రసవం కోసం ఉట్నూర్ సీహెచ్‌సీకి ఆటోలో తరలిస్తుండగా రక్తహీనతకు తోడు తీవ్ర రక్తస్రావమైంది. దీంతో తల్లి, పుట్టిన బిడ్డ మృతిచెందారు.
- నార్నూర్ మండలం శివనారాకు చెందిన సిడాం రాంబాయి(22) గత నెల 25న రక్తహీనతతో మృతిచెందింది. 20 రోజుల క్రితం మగశిశువుకు జన్మనిచ్చిన రాంబాయి రక్తహీనతతో బాధపడుతోంది. దీనికి తోడు జ్వరం రావడంతో గాదిగూడ పీహెచ్‌సీకి వైద్యం కోసం తీసుకెళ్లారు. వైద్య సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో గ్రామంలోని ఆర్‌ఎంపీకి చూపించారు. పరిస్థితి విషమించిందని.. రిమ్స్‌కు తీసుకెళ్లాలని సూచించారు. దీంతో రిమ్స్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయింది.
- కెరమెరి మండలం కోలాంగూడ(డి)కు చెందిన ఆత్రం మారుబాయి(25) గత నెల 21న ఆడ శిశువుకు జన్మనిచ్చింది. మరుసటి రోజు వైద్యం కోసం ఆమెను ఉట్నూర్ సీహెచ్‌సీకి, అక్కడి నుంచి రిమ్స్‌కు తరలించారు. మూడు రోజులు చికిత్స పొంది మృతిచెందింది. రక్తహీనతతో బాధపడుతూ మృతి చెందిందని కుటుంబీకులు పెర్కొన్నారు.
 - వాంకిడి మండలం ఖిర్ది గ్రామానికి చెందిన ఈశ్వరిబాయి గత నెల 25న ఇంట్లో ఆడ శిశువుకు జన్మనిచ్చింది. ప్రసవం తర్వాత తీవ్ర రక్తస్రావం జరగడంతో కొద్ది గంటల్లోనే మృత్యువాత పడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement