గైనిక్ కౌన్సెలింగ్
నా వయసు 25 ఏళ్లు. నాకు పెళ్లయి ఆర్నెల్లు అయ్యింది. ప్రెగ్నెన్సీ నిర్ధారణ అయ్యింది. ఇప్పుడు మూడో నెల. నాకు బాగా వికారంగా, నీరసంగా ఉంటోంది. నిద్ర సరిగా పట్టడం లేదు. వాంతులు ఎక్కువగా అవుతున్నాయి. ఆకలి లేదు. పదిహేను రోజుల్లో రెండు కేజీల బరువు తగ్గాను. ఇలా అయితే లోపల బిడ్డ ఎలా పెరుగుతుందో అని ఆందోళనగా ఉంది. నా సమస్యకు సరైన పరిష్కారం చెప్పండి.
- సౌమ్య, కర్నూలు
ప్రెగ్నెన్సీ మొదలైన తర్వాత హెచ్‌సీజీ అనే హార్మోన్ విడుదల అవుతుంది. ఇది కొంతమందిలో చాలా తక్కువ పాళ్లలోనూ, మరికొంతమందిలో చాలా ఎక్కువగానూ విడుదల అవుతుంది. దీన్ని బట్టి... వారి వారి శరీర తత్వాన్ని బట్టి కొందరిలో తక్కువగానూ, మరికొందరిలో ఎక్కువగానూ వాంతులు అవుతుంటాయి. మరికొందరిలో ఎలాంటి లక్షణాలూ ఉండవు. కాబట్టి వాంతులు అవుతున్నాయని ఆందోళనపడాల్సిన అవసరం లేదు. కొద్ది కొద్ది మోతాదుల్లో ఎక్కువసార్లు సులువుగా జీర్ణమయ్యే ఆహారం తీసుకుంటూ ఉండండి. ద్రవపదార్థాలు అంటే... కొబ్బరినీళ్లు, మజ్జిగ, పండ్లరసాలు, ఎలక్ట్రాల్ ద్రవాలు, గ్లూకోజు నీళ్లు ఎక్కువగా తీసుకుంటూ ఉండండి.
పండ్లు కూడా ఎక్కువగా తింటూ ఉండాలి. ఇక పచ్చళ్లు, నూనె వస్తువులు, మసాలాలు ఎక్కువగా ఉండే పదార్థాలు ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది. వాంతులు అవుతున్నా ఫర్వాలేదు, ఏదో ఒకటి తింటూ ఉండండి. అసలేవీ తినకపోతే అసిడిటీ వల్ల కడుపులో యాసిడ్ పేరుకొని పసరు వాంతులు, రక్తపు వాంతులు అయ్యే ప్రమాదం ఉంది. అవసరమైతే డాక్టర్ పర్యవేక్షణలో యాంటాసిడ్ మందులు లేదా వాంతులను, వికారాన్ని తగ్గించేందుకు యాంటీ ఎమెటిక్ మందులను వాడవచ్చు. మరీ నీరసంగా ఉంటే నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్‌ను కలిసి చికిత్స చేయించుకోండి. అవసరాన్ని బట్టి సెలైన్ ఎక్కించుకోవడం/గ్లూకోజ్ పెట్టించుకోవడం చేయాల్సి రావచ్చు. అయితే మీరు ఆందోళపడాల్సిన అవసరం ఎంత మాత్రమూ లేదు.
డాక్టర్ వేనాటి శోభ
సీనియర్ గైనకాలజిస్ట్
లీలా హాస్పిటల్, మోతీనగర్, హైదరాబాద్.