హార్మోన్‌ల సమతౌల్యం... హోమియోతో సుసాధ్యం! | ... Homeopathic amenable to hormonal balance! | Sakshi
Sakshi News home page

హార్మోన్‌ల సమతౌల్యం... హోమియోతో సుసాధ్యం!

Published Mon, Oct 27 2014 11:23 PM | Last Updated on Sat, Sep 2 2017 3:28 PM

... Homeopathic amenable to hormonal balance!

ఇటీవలి కాలంలో హైపో థైరాయిడ్, పి.సి.ఓ.డి, సంతానలేమి, డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల గురించి తరచూ వింటున్నాం. ఇవన్నీ హార్మోన్ అసమతుల్యతల వలన వచ్చే జబ్బులే. ఇవి మాత్రమే కాకుండా మన దేహక్రియలు సక్రమంగా జరగడానికి అనేక హార్మోన్‌లు దోహదం చేస్తుంటాయి. వాటి పనితీరులో తేడా వచ్చినప్పుడు దేహానికి ఎదురయ్యే సమస్యలు అనేకం. వాటిలో ముఖ్యమైన సమస్యలపై అవగాహన కోసం ఈ  కథనం.
 
హార్మోన్‌లు అంటే..?

హార్మోన్‌లు పాలీపెప్టైడ్స్‌తో నిర్మితమైన రసాయన వాహకాలు. ఇవి శరీరంలోనే ఉత్పత్తి అవుతాయి. ఉత్పత్తి అయిన  కణజాలం లేదా గ్రంథుల నుంచి దేహభాగాలకు రక్తం ద్వారా ప్రవహిస్తూ నిర్దిష్ట అవయవాలను ప్రభావితం చేస్తాయి. ఇవి సమతౌల్యంతో పని చేస్తేనే జీవక్రియలు సక్రమంగా జరుగుతాయి. ఈ ప్రక్రియలో ఒడుదొడుకులు ఎదురైతే ఆ ప్రభావం జీవక్రియల మీద పడుతుంది. ఈ హార్మోన్లు ఎండోక్రైన్, ఎక్సోక్రైన్ గ్రంథుల నుంచి ఉత్పత్తి అవుతాయి.
 
ఇవి ఉత్పత్తి అయ్యే మోతాదు చాలా తక్కువే. అయినప్పటికీ వీటి ప్రభావం శరీరంలోని అనేక జీవక్రియల మీద చాలా కీలకంగా ఉంటుంది. సాధారణంగా జీవక్రియలైన జీర్ణక్రియ, శారీరక-మానసిక ఎదుగుదల, ప్రత్యుత్పత్తి, మానసిక సమతుల్యత వంటి ప్రధానమైన పనులను ప్రభావితం చేస్తాయి. ఈ హార్మోన్ల విడుదల అసమతుల్యతకు లోనయినప్పుడు అది జీవక్రియల మీద ప్రభావం చూపి క్రమంగా తీవ్రమైన దీర్ఘకాలిక జబ్బులకు దారి తీసే ప్రమాదం ఉంటుంది.
 
థైరాయిడ్ సమస్యలు
 
థైరాయిడ్ గ్రంథి ఉత్పత్తి చేసే (టి3, టి4) హార్మోన్లను థైరాయిడ్ హార్మోన్లు అంటారు. వీటి ఉత్పత్తిలో, పనితీరులో సమతుల్యత లోపించినప్పుడు ఎదురయ్యే సమస్యలను థైరాయిడ్ సమస్యలుగా పరిగణిస్తారు. థైరాయిడ్ హార్మోన్లు రక్తప్రవాహంలో కలిసి శారీరక ఎదుగుదల, జీవక్రియలను నిర్వహణకు తోడ్పడతాయి. థైరాయిడ్ గ్రంథిని మెదడులోని పిట్యూటరీ గ్రంథి నియంత్రిస్తుంది. దేహంలో థైరాయిడ్ హార్మోన్ల స్థాయులు తగినంతగా లేనప్పుడు పిట్యూటరీ గ్రంథి అవసరాన్ని గ్రహించి టిఎస్‌హెచ్ (థైరాయిడ్ స్టిములేటింగ్ హార్మోన్) హార్మోన్‌ని విడుదల చేస్తుంది. టిఎస్‌హెచ్ సంకేతంతో థైరాయిడ్ గ్రంథి టి3, టి4 హార్మోన్లను విడుదల చేసి రక్త ప్రవాహంలోకి పంపుతుంది. ఈ వ్యవస్థ విఫలమై థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తి ఎక్కువైతే హైపర్ థైరాయిడిజమ్, తక్కువైతే హైపో థైరాయిడిజమ్ సమస్యలు తలెత్తుతాయి. వీటితోపాటు గాయిటర్ అనే దీర్ఘకాలిక సమస్య కూడా వస్తుంది.
 
 హైపోథైరాయిడిజమ్: ఇది పిల్లలు, స్త్రీలలో ఎక్కువగా కనిపిస్తుంది. దీని లక్షణాలు ఇలా ఉంటాయి.
     
 నిస్సత్తువ, చర్మం పొడిబారడం, చెమట తక్కువ, కొద్దిగా బరువు పెరగడం, నెలసరి సరిగ్గా రాకపోవడం, జుట్టు రాలడం, మతిమరుపు, మలబద్ధకం, అజీర్ణం, చలికి తట్టుకోలేకపోవడం, పిల్లల్లో ఎదుగుదల తగ్గడం, ఆడపిల్లల్లో రజస్వల ఆలస్యం కావడం లేదా త్వరగా జరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
     
 వృద్ధుల్లో...  కుంగుబాటు, మతిమరపునకు దారి తీస్తుంది.
     
 గర్భిణుల్లో... జీవక్రియల వేగం పెరుగుతుంది. కాబట్టి థైరాయిడ్ హార్మోన్ అవసరం పెరుగుతుంది. ఆ పెరిగిన అవసరానికి తగినంత ఉత్పత్తి కాకపోయినట్లయితే హైపో థైరాయిడిజమ్ కండిషన్‌కి దారి తీస్తుంది. నిర్ణీత కాలపరిమితిలో పరీక్షలు చేయించుకుంటూ సరైన చికిత్స తీసుకుంటే పుట్టే పిల్లల్లో మానసిక ఎదుగుదల సరిగ్గా ఉంటుంది.
 
 హైపర్ థైరాయిడిజమ్: హైపో థైరాయిడిజమ్‌లాగానే ఇది కూడా ఏ వయసులోనైనా రావచ్చు. అయితే ఇది 20-40 సంవత్సరాల మధ్య వయసులోనే ఎక్కువగా కనిపిస్తుంటుంది. దీనిని త్వరగా గుర్తించకపోయినా, నిర్లక్ష్యం చేసినా దుష్ర్పభావాలు తీవ్రంగా ఉంటాయి. హైపర్ థైరాయిడిజమ్ లక్షణాలు హైపో థైరాయిడిజమ్ లక్షణాలకు భిన్నంగా ఉంటాయి.
     
ఆహారం సరైన మోతాదులో తీసుకున్నప్పటికీ బరువు గణనీయంగా తగ్గిపోవడం, నిద్రలేమి, గుండెదడ, వేడిని తట్టుకోలేకపోవడం, చెమట అధికంగా ఉండడం, చిరాకు, అస్థిమితం, విరేచనాలు, చేతులు వణకడం, నీరసంగా ఉండడం, నెలసరి త్వరగా రావడంతోపాటు రక్తస్రావం అధికంగా ఉండడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
 
గాయిటర్ అంటే..? థైరాయిడ్ గ్రంథి అసహజంగా వాపుకు గురికావడాన్ని గాయిటర్ అంటారు. ఇది అయోడిన్ లోపం వలన వస్తుంది.
 
 స్త్రీలలో ఉండే హార్మోన్లు
 
ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరోన్, ప్రొలాక్టిన్, ఆక్సిటోసిన్ వంటి హార్మోన్లు స్త్రీలలో రజస్వల, రుతుచక్రం, ద్వితీయ లైంగిక లక్షణాలు, సంతానోత్పత్తి, ప్రసవానికి ఉపకరిస్తాయి. ఈ హార్మోన్ల అసమతుల్యత వల్ల స్త్రీలలో రుతుచక్ర సమస్యలు, పిసిఓడి (పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్), హిర్సుటిజం (అవాంఛిత రోమాలు), సంతానలేమి సమస్యలు వస్తాయి.
 
ఈ హార్మోన్ల ప్రభావం యుక్తవయస్సులో స్పష్టంగా కనిపించినప్పటికీ బాల్యం నుంచే మొదలవుతుంది. నవజాత శిశువులలో రొమ్ములు పెరగడం, కొన్నిసార్లు పాలు కూడా రావడం వంటివి జరుగుతాయి. సాధారణంగా తల్లి శరీరంలో ఉత్పత్తి అయ్యే ఈస్ట్రోజెన్ హార్మోన్ మాయ ద్వారా బిడ్డకు చేరడం వలన ఇలా జరుగుతుంది. ఇది కొన్ని నెలలు లేదా కొన్నేళ్లలో పూర్తిగా తగ్గిపోతుంది.
 
 యుక్తవయసులో: ఎల్‌హెచ్, ఎఫ్‌ఎస్‌హెచ్, ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరోన్ వంటి హార్మోన్లు స్త్రీలలో రజస్వల కావడానికి కీలక పాత్ర వహిస్తాయి. అండాశయం నుంచి విడుదలయ్యే స్త్రీబీజం పరిపక్వం చెంది గర్భాశయంలోకి చేరుతుంది. ఈ పరిపక్వత చెందిన స్త్రీ బీజం (అండం) ఫలదీకరణ చెందకపోతే అండాశయం నుంచి ఈస్ట్రోజెన్ మరియు ప్రొజెస్టిరోన్ హార్మోన్ల ఉత్పత్తి తగ్గి రుతుస్రావం జరుగుతుంది.
 
 గర్భధారణ:
పరిపక్వం చెందిన అండం ఫలదీకరణ చెందితే గర్భధారణ జరుగుతుంది. గర్భధారణ సమయంలో స్త్రీ హార్మోన్లు క్రమంగా మార్పు చెందుతూ ఉంటాయి. హెచ్‌సిజి అనే హార్మోన్ మాయ ద్వారా ఉత్పత్తి అవుతుంది. ఇది అండాశయాన్ని ప్రేరేపించి అధికమొత్తంలో ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్ హార్మోన్లు విడుదలయ్యేలా చేస్తుంది. ఇది గర్భం కొనసాగించేందుకు సహాయపడుతుంది. ప్రసవం అనంతరం ఈ హార్మోన్ల మోతాదు క్రమంగా తగ్గిపోవడం జరుగుతుంది.
 
 మెనోపాజ్: రుతుక్రమం ఆగిపోయిన తర్వాత స్త్రీలలో హార్మోన్ల స్థాయులు పడిపోతాయి. దీంతో దేహం నుంచి వేడి
 
 ఆవిర్లు, నిద్రలేమి, మానసిక అశాంతి, నీరసం, కీళ్లు, కండరాల నొప్పుల వంటి సమస్యలు వస్తాయి.
 
పిసిఓడి: స్త్రీలలో సాధారణంగా 20 శాతం మంది పిసిఓడి సమస్యతో బాధపడుతున్నారు. ఈ వ్యాధితో బాధపడే స్త్రీలలో అండాశయం నుంచి పురుష హార్మోన్లయిన టెస్టోస్టిరాన్ అధికంగా విడుదలవుతుంది. దీంతో సంతానలేమి, నెలసరి సమస్యలు (సరిగ్గా రాకపోవడం), అవాంఛిత రోమాల పెరుగుదల వంటి సమస్యలు
 ఏర్పడతాయి.
 
ఇన్సులిన్ అసమతుల్యత

మధుమేహం లేదా చక్కెరవ్యాధిగా వ్యవహరించే ఈ పరిస్థితిని వైద్యపరిభాషలో డయాబెటిస్ మెలిటస్ అంటారు. డయాబెటిస్ అనేది ఇన్సులిన్ హార్మోన్ స్థాయులు తగ్గడం వల్ల కలిగే అనియంత్రిత జీవక్రియలు (మెటబాలిజమ్), రక్తంలో గ్లూకోజ్ స్థాయులు పెరగడం వంటి లక్షణాలతో కూడిన రుగ్మత. ఇందులో రెండు రకాలు ఉన్నాయి. అవి డయాబెటిస్ మిలిటస్ టైప్1, టైప్2.
 
 టైప్ 1 డయాబెటిస్: ఇది క్లోమ గ్రంథిలోని ఐలెట్స్ ఆఫ్ లాంగర్‌హ్యాన్స్‌లో ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేసే బీటా కణాల సంఖ్య తగ్గిపోవడం లేదా పూర్తిగా నశించిపోవడం వల్ల కలుగుతుంది. ఆటోఇమ్యూనిటీ వల్ల టి- కణాలు బీటా కణాలపై దాడి చేయడం ముఖ్యకారణం.
 
 ఈ వ్యాధిని చిన్నపిల్లల్లో ఎక్కువగా చూస్తుంటాం. కాబట్టి దీనిని ‘జువైనల్ డయాబెటిస్’ అంటారు.
 
 టైప్ 2 డయాబెటిస్: ఇది ఇన్సులిన్ నిరోధకత లేదా ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గడం వలన వస్తుంది.
 
 కారణాలు: మధుమేహం వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉంది. శారీరక శ్రమ లోపించడం, గంటల తరబడి కూర్చుని ఉండడం, కొవ్వు అధికంగా ఉండే ఆహారపదార్థాలను తీసుకోవడం, తీపి పదార్థాలు, కొన్ని రకాల మందుల వాడకం వల్ల ఎదురయ్యే దుష్పరిణామాలు ఈ వ్యాధికి కారణం. స్టిరాయిడ్స్, కొన్ని రకాల వైరస్ ఇన్ఫెక్షన్‌లు, హార్మోన్ల అసమతుల్యత, మానసిక ఒత్తిడి వల్ల కూడా మధుమేహం వస్తుంది.
 
 లక్షణాలు: అతిమూత్రం, అతి ఆకలి, అతి దాహం ప్రధానంగా కనిపించే లక్షణాలు. ఆహారం బాగానే తీసుకుంటున్నప్పటికీ బరువు తగ్గిపోవడం, నీరసం, అలసట కూడా ఉంటాయి. కొందరిలో ఈ లక్షణాలేవీ పైకి కనిపించకపోవచ్చు. కొందరిలో చేతులు, పాదాలు తిమ్మిర్లు లేదా మంట, జననేంద్రియాల వద్ద దురద, ఒళ్లంతా దురదలు, దెబ్బలు గాయాలు త్వరగా మానకపోవడం, తరచూ దంతాల సమస్యలు, చిగుళ్ల వ్యాధులు కనిపిస్తుంటాయి.
 
డయాబెటిస్‌తో అనర్థాలు:
  డయాబెటిస్‌తో బాధపడే వారిలో రక్తంలోని చక్కెర పాళ్లను సరిగ్గా నియంత్రణ చేయకపోవడం వలన దీర్ఘకాలంలో డయాబెటిక్ నెఫ్రోపతి, డయాబెటిక్ న్యూరోపతి, డయాబెటిక్ రెటినోపతి, గుండె సమస్యలు వంటి అనుబంధ సమస్యలు వస్తాయి.
 
డయాబెటిస్ ఇన్‌సిపిడస్: ఇది ఎడిహెచ్ (యాంటీ డైయూరిటిక్ హార్మోన్) లోపం వలన వస్తుంది. దీనినే అతిమూత్ర వ్యాధి అని కూడా అంటారు.
 
పారాథార్మోన్
థైరాయిడ్ గ్రంథికి ఇరుపార్వ్శాలలో పారా థైరాయిడ్‌గ్రంథులు ఉంటాయి. ఈ గ్రంథుల నుంచి ఉత్పత్తి అయిన పారాథార్మోన్ దేహంలో కాల్షియం మెటబాలిజమ్‌ను నియంత్రణలో ఉంచుతుంది. దీని అసమతుల్యత వలన హైపో మరియు హైపర్ పారా థైరాయిడిజమ్ పరిస్థితులు తలెత్తుతాయి. ఈ లక్షణాలు...
     
ఎముకలు ఆస్టియోపోరోసిస్‌కు గురి కావడం చేత బలహీన పడి త్వరగా విరిగే ప్రమాదం ఉంటుంది. కొన్నిసందర్భాలలో కీళ్ల నొప్పులకు దారి తీస్తుంది. మూత్రపిండాల్లో రాళ్లు, కండరాలు పట్టివేయడం, నీరసం, అలసట కూడా కలగవచ్చు.
 
 టెస్టోస్టిరాన్ హార్మోన్
 ఇది పురుషులలో ఉండే హార్మోన్. దీని అసమతుల్యత వలన శీఘ్రస్కలనం, అంగస్తంభన సమస్యలు, శుక్రకణ సమస్యలు, సంతానలేమి సమస్యలు తలెత్తుతాయి.
 
కార్టికో స్టిరాయిడ్స్
ఇవి అన్ని ముఖ్యమైన జీవక్రియల్లోనూ, రోగనిరోధక వ్యవస్థలోనూ ప్రముఖ పాత్ర పోషిస్తాయి. దీని అసమతుల్యతల వలన కుషింగ్స్, అడిసన్స్ వ్యాధులు వస్తాయి.
 
అపోహలు - వాస్తవాలు

అపోహ: హోమియోపతి మందులు వాడుతున్నప్పుడు కఠినమైన పథ్యాన్ని పాటించాలి.
వాస్తవం: హోమియో మందులకు ఎటువంటి పథ్యం అవసరం లేదు. అయితే మందు తీసుకునే ముందు తర్వాత కొద్ది నిమిషాల పాటు ఏమీ తీసుకోకపోతే మందు చక్కగా పనిచేస్తుంది.
     
అపోహ: హోమియో మందులు తీసుకుంటున్న సమయంలో అల్లోపతి మందులు వాడితే అప్పటి వరకు వాడిన హోమియో మందుల ప్రభావం పోతుంది.
వాస్తవం: అత్యవసరాలకు అల్లోపతి మందులు వాడవచ్చు. అయితే హోమియో మందులు వేసుకోవాల్సిన సమయంలోనే రెండూ కలిపి తీసుకోకుండా కనీసం 15 నిమిషాల విరామం ఉండాలి.
 
 - నిర్వహణ: యాసీన్ - మంజులారెడ్డి
 
నిర్ధారణ పరీక్షలు
హైపోథైరాయిడిజమ్, పి.సి.ఓ.డి, సంతానలేమి
     
 మధుమేహం... రక్తపరీక్ష, మూత్రపరీక్ష, ఎఫ్‌బిఎస్, పిఎల్‌బిఎస్, మూత్రంలో చక్కెరస్థాయులు వంటి పరీక్షలు
     
 థైరాయిడ్ సమస్యలు... టి3, టి4, టిఎస్‌హెచ్, అల్ట్రాసౌండ్ నెక్, ఎమ్‌ఆర్‌ఐ వంటి పరీక్షలు
     
 స్త్రీలలో రుతుచక్ర సమస్యలు, సంతానలేమి, హార్మోన్ సమస్యలకు... ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్, డిహెచ్‌ఇఎ, ఎల్‌హెచ్, ఎఫ్‌ఎస్‌హెచ్, ప్రొలాక్టిన్, ఎస్‌హెచ్‌బిజి వంటి పరీక్షలు
 
హోమియో మందులు
సెపియా: ఇది హైపోథైరాయిడిజమ్‌తోపాటు స్త్రీలలో కలిగే హార్మోన్ సమస్యలకు ప్రధానంగా పనిచేస్తుంది. రుతుక్రమ సమస్యలతోపాటు గర్భాశయం జారిపోవడం వంటి అనేక జననేంద్రియ సమస్యలకు వాడదగిన ఔషధం. ఈ సమయంలో చిరాకుగా ఉండడం, కుటంబసభ్యులతో భిన్నంగా ప్రవర్తించడం, ఒంటరిగా ఉండాలనిపించడం వంటి సమస్యలు కలిగి ఉంటారు. వీటన్నింటికీ సెపియా మంచి ఔషధం.
     
 కాల్కేరియా కార్బ్: లావుగా ఉండి చలిని తట్టుకోలేకపోవడం, తల మీద ఎక్కువగా చెమట పట్టడం, రుతుక్రమ సమస్యలతోపాటు మలబద్ధకం ఉన్న వారికి చక్కటి ఔషధం
     
 ఫాస్ఫారిక్ యాసిడ్: మధుమేహ వ్యాధిగ్రస్తులకు వాడదగిన మందు. మూత్రంలో చక్కెర స్థాయులు ఎక్కువగా ఉండడం, ఫాస్ఫేట్ నిల్వలు ఎక్కువగా ఉండడం, శారీరక బలహీనత, ఆకలి లేకపోవడం, అతిదాహం, మానసికంగా శోకం, ఆందోళన, ఉదాసీనత వంటి లక్షణాలు ఉంటే ఈ మందు వాడాల్సి ఉంటుంది.
     
 లాకెసిస్: ఇది మెనోపాజ్ దశలో ఉన్న వారికి మంచి ఔషధం.
 
 హోమియో వైద్యంలో ప్రతి వ్యక్తికీ శరీర లక్షణాలను బట్టి మందులు ఇస్తారు. ఇద్దరు వ్యక్తులు మధుమేహంతో వ్యాధితో బాధపడుతున్నప్పటికీ ఇద్దరిలోనూ లక్షణాలు వేరుగా ఉండవచ్చు. మధుమేహంతోపాటు ఎవరికి వారికి విడిగా మరికొన్ని ఇతర వ్యాధులు కలిగి ఉండవచ్చు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని మందులను వాడాల్సి ఉంటుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement