పిల్లలు స్వీట్ అయిపోతున్నారు! | November 14 World Diabetic Day | Sakshi
Sakshi News home page

పిల్లలు స్వీట్ అయిపోతున్నారు!

Published Thu, Nov 9 2017 12:01 AM | Last Updated on Thu, Nov 9 2017 5:31 AM

November 14 World Diabetic Day - Sakshi

పిల్లలకు స్వీట్స్‌ ఇష్టం.పిల్లలు స్వీట్‌గా ఉంటారు.వాళ్ల పంచదార చిలకపలుకులుమన జీవితాన్ని స్వీట్‌గా చేస్తాయి.కానీ ఇప్పుడు పసికందుల్లోనే టైప్‌–1 డయాబెటిస్‌ కనిపిస్తోంది.భయపడాల్సిన అవసరం లేదు.కానీ... తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.


డయాబెటిస్‌ వ్యాధి రోగులను ఎంతటి యాతనలకు గురిచేస్తుంటుందో తెలియనిది కాదు. దీనిపై అవగాహన కోసం ప్రతి ఏడాది నవంబర్‌ 14న ‘వరల్డ్‌ డయాబెటిస్‌ డే’గా నిర్వహించాలని ఇంటర్నేషనల్‌ డయాబెటిస్‌ ఫౌండేషన్‌ నిర్ణయించింది. అలా దీన్ని 1991 నుంచి నిర్వహిస్తున్నారు. డయాబెటిస్‌ మిల్లిటస్‌ అనేది ఒక దీర్ఘకాలిక వ్యాధి. ఇది సోకినవాళ్ల రక్తంలోని చక్కెరపాళ్లు నార్మల్‌గా కాకుండా చాలా ఎక్కువగా ఉంటాయి. దాంతో కొన్ని సమస్యలు రావచ్చు. అవేవీ రాకుండా పిల్లలను కాపాడుకునేందుకు అవసరమైన అవగాహన కోసం ఈ కథనం...

పిల్లల్లోనూ డయాబెటిస్‌ కనిపిస్తుందన్నది చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేసే విషయం. పిల్లల్లో వచ్చే డయాబెటిస్‌ను టైప్‌–1 డయాబెటిస్‌ అంటారు. ఇది పెద్దల్లో కనిపించే డయాబెటిస్‌కు భిన్నంగా ఉంటుంది. మనం టైప్‌–1 డయాబెటిస్‌ అని పిలిచే పిల్లలకు వచ్చే వ్యాధిని ‘ఇన్సులిన్‌ డిపెండెంట్‌ డయాబెటిస్‌’ అని కూడా అంటారు. ఈ వ్యాధి ఉన్న పిల్లల్లో రక్తంలోని చక్కెరను తగినన్ని పాళ్లలో ఉంచాల్సిన హార్మోన్‌ అయిన ‘ఇన్సులిన్‌’ స్రవించదు. దాంతో పిల్లలు వ్యాధికి గురవుతారు. మన శరీరంలో ప్యాంక్రియాస్‌ గ్రంథి ఇన్సులిన్‌ను స్రవిస్తుంది. ఈ స్రావమే చక్కెర పాళ్లను అదుపులో ఉంచుతుంది. మనకు హాని చేసే వ్యాధి కారకాలు, వైరస్‌ లేదా బ్యాక్టీరియా మన ఒంట్లోకి ప్రవేశించినప్పుడు మన రోగనిరోధక శక్తి వాటితో పోరాడి బయటకు తరిమేస్తుంది. అయితే ఈ ‘టైప్‌–1 డయాబెటిస్‌’ వచ్చిన పిల్లల్లోని వ్యాధి నిరోధక శక్తి వారిలోని ఇన్సులిన్‌ హార్మోన్‌ స్రవించేందుకు ఉపయోగపడే ప్యాంక్రియాస్‌ గ్రంథిలోని కణాలను దెబ్బతీస్తుంది. దీనికి జన్యుపరమైన, వైరస్‌లు, పర్యావరణ అంశాలు కారణాలుగా చెప్పవచ్చు. ఆ అంశాల ప్రభావం వల్ల ప్యాంక్రియాస్‌ నుంచి ఇన్సులిన్‌ హార్మోన్‌ స్రావం తగ్గుతూపోయి ఒక దశలో పూర్తిగా ఆగిపోతుంది.

మనం తిన్న ఆహారం శక్తిగా మారే ప్రక్రియలో గ్లూకోజ్‌గా మారుతుంది. కార్లు నడవటానికి అవసరమైన ఇంధనమైన పెట్రోల్‌ లాగే మన రోజువారీ కార్యకలాపాలు సజావుగా సాగడానికి ఇంధనం అవసరం. గ్లూకోజ్‌ మనకు ఇంధనంలా ఉపయోగపడేలా మన శరీరంలోని కణాల్లోకి చేరాలంటే ఈ ఇన్సులిన్‌ అవసరం. ఒకవేళ మన శరీరంలో ఇన్సులిన్‌ ఉత్పత్తి కాకపోతే గ్లూకోజ్‌ కణంలోకి ప్రవేశించలేదు. కేవలం రక్తంలోనే ఉండిపోతుంది. దాంతో రక్తంలో గ్లూకోజ్‌/చక్కెర పాళ్లు పెరిగిపోతాయి. ఒక దశ దాటిన తర్వాత ఇలా రక్తంలో ఎక్కువైపోయిన చక్కెర మూత్రంలో బయటకు వెళ్తుంది. దాంతో పిల్లలకు మాటిమాటికీ మూత్రవిసర్జన అవుతుండటం, ఎక్కువగా దాహం అవుతుండటం జరుగుతుంటుంది.

పిల్లల్లో డయాబెటిస్‌ ఉందని గుర్తించడం ఎలా?
పిల్లల్లో డయాబెటిస్‌ రావడం అనేది క్రమంగా జరిగే ప్రక్రియ. అందుకే డయాబెటిస్‌ ఉన్నవారిలో కనిపించే వివిధ లక్షణాలు అందరు పిల్లల్లోనూ ఒకేలా ఉండకపోవచ్చు. డయాబెటిస్‌ ఉన్న పిల్లల్లో కనిపించే లక్షణాల్లో ప్రధానమైనవి...
చాలా ఎక్కువ నీరు తాగుతూ ఉండటంతో పాటు మాటిమాటికీ మూత్ర విసర్జనకు వెళ్తుండటం ∙రాత్రిళ్లు నిద్రలో పక్క తడిపే అలవాటును అప్పటికే మానేసిన పిల్లలు అకస్మాత్తుగా మళ్లీ పక్క తడపటం మొదలుపెడుతుంటే ∙మంచి ఆహారం తీసుకుంటున్నప్పటికీ బరువు తగ్గుతుండటం ∙చాలా తేలిగ్గా వెంటవెంటనే అలసి పోతుండటం, చాలా నిస్సత్తువగా, నీరసంగా ఉండటం   జననేంద్రియాల దగ్గర మాటిమాటికీ ఫంగల్‌ ఇన్ఫెక్షన్లు (క్యాండిడియాస్‌) కనిపిస్తుండటం.
ఈ లక్షణాలు కనిపించినప్పుడు పిల్లల్లో డయాబెటిస్‌ను వెంటనే గుర్తించి, వెంటనే ఇన్సులిన్‌తో వైద్యం మొదలుపెట్టకపోతే ప్రమాదకరమైన పరిణామాలు సంభవించవచ్చు. అధిక గ్లూకోజ్‌ వల్ల కీటోన్స్‌ అనే విషపూరితమైన పదార్థాలు రక్తంలో పేరుకుపోతాయి. దీనివల్ల ఈ కింది లక్షణాలు కనిపిస్తాయి.  
తీవ్రమైన కడుపునొప్పి ∙వాంతులు, ∙మత్తుగా ఉండటం (చురుకుదనం లోపించడం)  శ్వాసతీసుకోవడం కష్టం కావడం ∙స్పృహతప్పి పడిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలా స్పృహతప్పిపడిపోయే పరిస్థితిని కీటో అసిడోసిస్‌ అంటారు. ఇలాంటి కండిషన్‌ చాలా ప్రమాదకరం. పిల్లలను తప్పనిసరిగా హాస్పిటల్‌కు తరలించి తక్షణ వైద్య సహాయం అందించాల్సిన మెడికల్‌ ఎమర్జెన్సీ పరిస్థితి ఇది.

టైప్‌–1 డయాబెటిస్‌ను ఎదుర్కొనే తీరు (మేనేజింగ్‌ టైప్‌–1 డయాబెటిస్‌)

పిల్లల్లో టైప్‌–1 డయాబెటిస్‌ వ్యాధి కనిపించినప్పుడు దాన్ని ఎదుర్కోవడం అన్నది సమతౌల్యంగా జరగాల్సిన ప్రక్రియ. ఒక బల్లకు నాలుగు కాళ్ల ఉన్నప్పుడు కలిగే స్థిరత్వం లాగే... టైప్‌–1 డయాబెటిస్‌ ఉన్న పిల్లల్లో నాలుగు అంశాల నిర్వహణ ద్వారా దీన్ని సమర్థంగా ఎదుర్కోవచ్చు. ఒక బల్లలోని ఏ కాలు లోపించినా దాని స్థిరత్వం దెబ్బతిన్నట్లుగానే టైప్‌–1 డయాబెటిస్‌ వ్యాధిగ్రస్తులను మేనేజ్‌ చేసే ప్రక్రియలో ఈ కింద పేర్కొన్న నాలుగు అంశాల్లో ఏది జరగకపోయినా దీని నిర్వహణ సమతౌల్యం దెబ్బతింటుంది. ఆ నాలుగు అంశాలివి...
1. ఇన్సులిన్‌ : డయాబెటిస్‌తో బాధపడే పిల్లల విషయంలో ప్రస్తుతానికి ఇన్సులిన్‌ ఇవ్వడం మాత్రమే రక్తంలో పెరిగే చక్కెరను అదుపు చేస్తుంది. అందుకే ఇప్పటికైతే ఇది మాత్రమే అందుబాటులో ఉన్న చికిత్స ప్రక్రియ అని భావించవచ్చు. దురదృష్టవశాత్తు ఇలా ఇన్సులిన్‌ ఇవ్వడం అన్నది ఇంజెక్షన్‌ ద్వారానే జరగాల్సిన ప్రక్రియ. అందునా ఈ ఇంజెక్షన్‌ను కండలోకి కాకుండా చర్మంలోని ‘సబ్‌క్యుటేనియస్‌ పొర’లో ఇవ్వాలి. ఇలా ఇన్సులిన్‌ను ఒంట్లోకి పంపేందుకు సిరంజీలు, పెన్‌ వంటి ఉపకరణాలు (పెన్‌ డివైజెస్‌), ఇన్సులిన్‌ పంప్స్‌ వంటి చాలా రకాల ఉపకరణాలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లోని ఏదో ఒక ఉపకరణం సహాయంతో డాక్టర్లు చెప్పిన మోతాదులో క్రమం తప్పకుండా ఇన్సులిన్‌ ఇచ్చినంత కాలం డయాబెటిస్‌ ఉన్న పిల్లల రక్తంలోని చక్కెర పాళ్లు నియంత్రణలో ఉంటాయి. ఇక్కడ ఇన్సులిన్‌ చేసే పని గురించి కాస్త తెలుసుకోవడం మేలు చేస్తుంది. మనం ఏదైనా పదార్థాన్ని తిన్నవెంటనే... ఆరోగ్యవంతులైన వ్యక్తుల్లో ఇన్సులిన్‌ రక్తంలోకి స్రవిస్తుంది. అది స్వాభావికంగా గ్లూకోజ్‌ను శక్తివనరుగా మార్చుతుంది. ఇది మనం తిన్నప్పుడల్లా చాలా నేచురల్‌గా జరిగే ప్రక్రియ. ఇలా స్వాభావికంగా మన ఒంట్లో పాంక్రియాస్‌ నిర్వహించే ప్రక్రియలాంటిదాన్ని మనం కూడా అనుసరిస్తూ రక్తంలోని చక్కెరను మాటిమాటికీ నియంత్రణలో ఉంచేందుకు వీలుగా రోజులో చాలాసార్లు ఇంజెక్షన్‌లు ఇవ్వాలి. పిల్లల్లోని తినే అలవాటు (ఫుడ్‌ హ్యాబిట్స్‌)ను బట్టి ఈ ఇంజెక్షన్లు ఇవ్వాల్సిన తీరు ఆధారపడి ఉంటుంది.  

2. పర్యవేక్షణ (మానిటరింగ్‌) : పిల్లల్లో కేవలం ఇన్సులిన్‌ ఇస్తుండటం మాత్రమే  సరిపోదు. వారు తిన్న దాన్ని బట్టి ఎంత మోతాదులో ఇన్సులిన్‌ ఇస్తుండాలన్న అంశాన్ని నిత్యం పర్యవేక్షించుకుంటూ ఉండాలి. రక్తంలోని చక్కెర పాళ్లను ప్రతిరోజూ ఎప్పటికప్పుడు తెలుసుకోడానికి ‘గ్లూకోమీటర్‌’ అనే పరికరం ఉపయోగ పడుతుంది.

3. ఆహారం :  పిల్లల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు అనుగుణంగా వారి ఆహారం ఉండటం అవసరం. అదే సమయంలో వారు తాము తీసుకునే ఆహారం కారణంగా స్కూల్లో వివక్షకు గురికాకూడదు. ఇతరులు తీసుకునే ఆహారాలు వారు తీసుకోకూడదన్న ఆంక్షల కారణంగా వారు స్కూల్లోని ఇతర పిల్లల నుంచి భిన్నంగా కనిపించకుండా చూసుకోవాల్సిన అవసరం కూడా తల్లిదండ్రుల బాధ్యత.

4. శారీరక శ్రమ : ఇటీవలి రోజుల్లో పిల్లలు ఆరుబయట ఆడుకోవడం, ఒంటికి పనిచెప్పడం చాలా తక్కువగా జరుగుతోంది. పిల్లలు ఒళ్లు అలిసేలా ఆడుకోవడం వల్ల వారి ఒంట్లోని చక్కెర పాళ్లు స్వాభావికంగానే నియంత్రితమయ్యే అవకాశం ఎక్కువ. అంతేకాదు వారు ఆరోగ్యకరంగా ఎదగడం కూడా జరుగుతుంది. శారీరక, మానసిక వికాసమూ జరుగుతుంది. అందుకే పిల్లలందరూ బాగా ఆడుకోవడం అవసరమే అయినా మరీ ముఖ్యంగా ఇలాంటి పిల్లల్లో ఆరుబయట ఒళ్లు అలిసేలా ఆడుకోవడం మరింత అవసరం. ఇక ఇన్సులిన్‌ మోతాదును నిర్ణయించడంలో వారు తీసుకునే ఆహారంతో పాటు వారి శారీరక శ్రమను పరిగణనలోకి తీసుకోవడం కూడా చాలా ముఖ్యం.

ఇంత జాగ్రత్తగా రక్తంలోని చక్కెరను నియంత్రించాల్సిన అవసరమేమిటి?
పిల్లల రక్తంలో చాలాకాలం పాటు చక్కెర పాళ్లు అలాగే నియంత్రణలో లేకపోతే వాళ్లలో దీర్ఘకాలం తర్వాత చాలా రకాల అనర్థాలు సంభవించే అవకాశం ఉంది. అలా అనియంత్రితమైన చక్కెర వల్ల పిల్లల మూత్రపిండాలు, గుండె, రక్తనాళాలు, కళ్లు వంటి కీలకమైన అవయవాలు దెబ్బతినవచ్చు. వారి నాడీవ్యవస్థపై తీవ్రమైన దుష్ప్రభావాలు పడవచ్చు. అయితే ఇవన్నీ బాల్యంలోనే కనిపించకపోవచ్చు. వారు పెరిగి పెద్దయ్యే క్రమంలో చక్కెరవ్యాధి తాలూకు దుష్ప్రభావాలు కనిపించవచ్చు. దాంతో భవిష్యత్తులో పెరిగి పెద్దయ్యాక అది వారి జీవన నాణ్యతను దెబ్బతీయవచ్చు. అందుకే రక్తంలో చక్కెర పాళ్లను నియంత్రణలో ఉంచుకోవడం అవసరం.

ఇటీవలి పురోగతి :
టైప్‌–1 డయాబెటిస్‌ ఉన్న పిల్లల్లో ఆ వ్యాధిని నయం చేసేలా ఇప్పటికిప్పుడు చికిత్స ఏదీ అందుబాటులో లేదు. కానీ రక్తంలోని చక్కెరపాళ్లను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వీలుంది. అలాగే సెన్సర్‌ ఆగ్యుమెంటెడ్‌ పంపులు, క్లోజ్‌డ్‌ లూప్‌ సిస్టమ్‌ వంటి పద్ధతులతో కొన్ని దేశాల్లో పిల్లల్లో చక్కెరపాళ్లను ఎప్పుడూ ఒకేలా ఉండేలా నియంత్రణలో ఉంచడం సాధ్యమవుతోంది. అయితే ఆధునిక సాంకేతికత సహాయంతో వచ్చిన ఈ పురోగతి ప్రస్తుతం ఈ రోగుల కుటుంబాలపై చాలా ఆర్థిక భారాన్నే మోపుతోంది. అయితే భవిష్యత్తులో ఈ వ్యయం తగ్గేందుకు అవకాశం ఉంది. అలాగే ప్రస్తుతం ఇన్సులిన్‌ అందేలా చూసేందుకు – ఇన్సులిన్‌ జీన్‌ థెరపీ, స్టెమ్‌సెల్‌ థెరపీ కంప్లీట్‌ క్లోజ్‌డ్‌ లూప్‌ సిస్టమ్స్‌ వంటి సులభమైన, సరళమైన, నొప్పిలేని ప్రక్రియలను అందుబాటులోకి తెచ్చేందుకు విస్తృతంగా పరిశోధనలు సాగుతున్నాయి.

టైప్‌–1 డయాబెటిస్‌తో బాధపడే చిన్నారుల విషయంలో రక్తంలోని చక్కెరపాళ్లను ఎప్పుడూ అదుపులో ఉంచేలా చూసుకోవడం తల్లిదండ్రులను, కుటుంబ సభ్యులను  చాలా ఒత్తిడికి గురిచేసే అంశం. అయితే నొప్పిలేకుండా ఇన్సులిన్‌ ఇచ్చే కొత్త కొత్త ఉపకరణాలు వారి జీవన నాణ్యతను పెంచుతున్నాయి. అందుబాటులోకి వస్తుండటంతో పాటు కొత్త కొత్త పరిశోధనల ఫలితాలు ఇలాంటి పిల్లల విషయంలో ఆశాజనకంగా ఉన్నాయి. దీర్ఘకాలికంగా బాధించే ఈ వ్యాధికి ఒక శాశ్వత చికిత్సను కనుగొనే దిశగా జరిగే ప్రయత్నాల్లో ఆశారేఖ కనిపిస్తూ ఉంది. అప్పటివరకు మన అవగాహనతోనే మన భవిష్యత్తరానికి సంపద అయిన పిల్లలను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అందరిలోనూ ఆ అవగాహన పెంపొందాల్సిన ఆవశ్యకత ఉంది.

డాక్టర్‌ లీనతారెడ్డి పీడియాట్రిక్‌
ఎండోక్రైనాలజిస్ట్, రెయిన్‌బో చిల్డ్రన్స్‌ హాస్పిటల్, హైదరాబాద్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement