నా జుట్టు చాలా ఒత్తుగా ఉండేది. అయితే డెలివరీ తర్వాత మాత్రం జుట్టు ఎక్కువగా ఊడిపోతోంది. ఇది ఇతర సమస్యల వల్ల తలెత్తుతుందా? లేక డెలివరీ తర్వాత ఇలాంటి సమస్యలు ఏర్పడతాయా? దీనికి నివారణ మార్గాలేంటి? ఎలాంటి ఆహారం తీసుకోవాలి?
– నళిని, గుంటూరు
గర్భం ధరించిన తర్వాత శరీరంలో ఈస్ట్రోజన్ హార్మోన్ ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో ఈస్ట్రోజన్ ప్రభావం వల్ల జుట్టు ఒత్తుగా ఉండి, ఊడటం తక్కువగా ఉంటుంది. కాన్పు తర్వాత ఈస్ట్రోజన్ తగ్గిపోయి, మామూలు స్థాయికి వచ్చేస్తుంది. దీని ప్రభావం వల్ల కాన్పు తర్వాత జుట్టు బాగా ఊడిపోవడం జరుగుతుంది. అంతే కాకుండా కాన్పు తర్వాత పాలిచ్చేటప్పుడు... తల్లిలో పోషకాలు, విటమిన్స్, ప్రొటీన్స్, మినరల్స్ తగ్గిపోవడం వల్ల కూడా పోషకపదార్థాల లోపం వల్ల జుట్టు ఊడిపోవడం జరుగుతుంది. ఇది తాత్కాలికం మాత్రమే. కొన్ని నెలలకు జుట్టు ఊడటం తగ్గుతుంది. ఆహారంలో పప్పులు, ఆకుకూరలు, పండ్లు, పాలు, పెరుగు, మాంసాహారులైతే మాంసం, గుడ్లు వంటి పోషకాహారం తీసుకోవడం వల్ల కొద్దిగా జుట్టు రాలడం తగ్గుతుంది. అలాగే మానసిక ఒత్తిడి లేకుండానూ చూసుకోవాలి. సరైన నిద్ర కూడా అవసరం. మంచి నీళ్లు ఎక్కువగా తాగాలి. బయోటిన్ విటమిన్ కలిగిన మల్టీవిటమిన్ మాత్రలు వాడి చూడొచ్చు.
కొన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల గర్భధారణ తొలినాళ్లలో లిస్టీరియా ఇన్‌ఫెక్షన్‌కు గురయ్యే ప్రమాదం ఉందని ఒక అధ్యయనంలో వెల్లడైనట్లు చదివాను. దీని గురించి పూర్తి వివరాలు తెలియజేయగలరు.– వి.సరళ, వనపర్తి
లిస్టీరియా అనే బ్యాక్టీరియా మన రక్తంలోకి ప్రవేశించడం వల్ల లిస్టీరియా ఇన్‌ఫెక్షన్ వస్తుంది. లిస్టీరియా అనేది మట్టిలో, నీళ్లలో ఉంటుంది. అలా లిస్టీరియా బ్యాక్టీరియా మట్టిలో పండే పచ్చి కూరగాయలు, పండ్లు, పాలు, చికెన్, మటన్, చేపలు, గుడ్లకు చేరుతుంది. వీటిని బాగా కడగకుండా, ఉడకబెట్టకుండా తినడం వల్ల ఇన్‌ఫెక్షన్ శరీరంలోకి సోకుతుంది. సాధారణంగా ఈ ఇన్‌ఫెక్షన్ సోకిన తర్వాత కొద్ది రోజులకు అదే మెల్లిగా తగ్గుతుంది. కానీ గర్భిణులలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల లిస్టీరియా ఇన్‌ఫెక్షన్ సోకితే, అది తీవ్రంగా మారి తల్లికి, తల్లి నుంచి బిడ్డకు సోకే ప్రమాదం ఉంటుంది. దానివల్ల జ్వరం, వికారం, ఒళ్లు, కండరాల నొప్పులు, తలనొప్పి, అదే నరాలకు పాకితే.. అయోమయం, ఫిట్స్ వంటి లక్షణాలు ఉండొచ్చు. గర్భిణులలో అబార్షన్లు, నెలలు నిండకుండానే కాన్పు జరగటం, బిడ్డ బరువు పెరగకపోవడం, కడుపులోనే చనిపోవడం, కాన్పు సమయంలో చనిపోవడం వంటి సమస్యలు ఏర్పడొచ్చు. కాబట్టి గర్భిణులు ఏదైనా తినే ముందు చేతులు కడుక్కోవడం, పండ్లు, కూరగాయలను వాడే ముందు బాగా కడగటం, పచ్చి పాలు, గుడ్లు తీసుకోకుండా ఉండటం, మాంసాహారాన్ని బాగా ఉడకబెట్టి తీసుకోవడం వంటి జాగ్రత్తలు పాటిస్తే లిస్టీరియా ఇన్‌ఫెక్షన్ నుంచి దూరంగా ఉండొచ్చు.
నేనిప్పుడు ప్రెగ్నెంట్‌ని. నాకు పచ్చళ్లు తినడం అంటే చాలా ఇష్టం. ఈ సమయంలో పచ్చళ్లు తినొచ్చా? ఏమీ కాదని కొందరు, తినొద్దు అని మరికొందరు అంటున్నారు. ఏది నిజం?
– మణి, వినుకొండ
పచ్చళ్లు తయారు చేసేటప్పుడు, అవి ఎక్కువ రోజులు నిలువ ఉండటానికి నూనె, ఉప్పు, కారం వంటివి ఎక్కువగా వెయ్యడం జరుగుతుంది. ప్రెగ్నెన్సీ సమయంలో పచ్చళ్లు ఎక్కువగా తినడం వల్ల, కొందరిలో కడుపులో మంట, గొంతులో మంట, ఎసిడిటీ వంటి సమస్యలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. అలాగే బీపీ పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి. ఎక్కువగా పచ్చళ్లు తినడం వల్ల ఇబ్బందులు రావొచ్చు. మరీ అంతగా పచ్చళ్లు తినాలని ఇష్టంగా ఉంటే, ఎప్పుడైనా కొద్దిగా తినొచ్చు. అంతే కానీ అదే పనిగా రోజూ తినడం మంచిది కాదు. వీలైనంత వరకు తినకుండా ఉండటమే మేలు.
నాకు ఆస్త్తమా ఉంది. ఆస్తమా ఉన్న స్త్రీలు గర్భం దాల్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని ఎక్కడో చదివాను. దీంతో పెళ్లంటేనే భయంగా ఉంది. గర్భధారణపై ఆస్తమా ప్రభావం ఏ మేరకు ఉంటుంది?
– వీకే, హైదరాబాద్
ఆస్తమా ఉన్న స్త్రీలలో శ్వాస తీసుకునే నాళాల్లో వాపు రావడం, దాని ద్వారా గాలి పీల్చుకోవడానికి ఇబ్బంది, ఆయాసం వంటి లక్షణాలు ఉంటాయి. అలాగే వారిలో కొందరికి గర్భాశయం, ట్యూబ్‌లు, అండాశయాల్లో వాపు రావడం లేదా పిండం గర్భాశయంలో నిలువలేకపోవడం వంటి ఇబ్బందులు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇది ఆస్తమా ఉన్న అందరిలోనూ ఉండాలని ఏమీ లేదు. కొందరిలో ప్రెగ్నెన్సీ కొద్దిగా ఆలస్యంగా రావచ్చు. ఆస్తమా ఉన్నవాళ్లు గర్భం కోసం ప్రయత్నం చేసేటప్పుడు ఆస్తమాను పూర్తిగా అదుపులో పెట్టుకోవడం మంచిది. ఇప్పటి నుంచే మీరు, ఆస్తమా ఉంటే ప్రెగ్నెన్సీ రాదని అపోహ పడి, పెళ్లి చేసుకోవడానికి భయపడాల్సిన అవసరం లేదు. భయాన్ని పక్కకు పెట్టి, ఒకసారి డాక్టర్‌ని సంప్రదించి మీ సందేహాలను తీర్చుకోవడం మంచిది.
డా‘‘ వేనాటి శోభ
బర్త్‌రైట్ బై రెయిన్‌బో హైదర్‌నగర్
హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment