లైంగిక ఆసక్తి కూడా తగ్గుతుంది | Also decreases sexual interest | Sakshi
Sakshi News home page

లైంగిక ఆసక్తి కూడా తగ్గుతుంది

Published Wed, Jul 6 2016 11:41 PM | Last Updated on Mon, Jul 23 2018 8:49 PM

లైంగిక ఆసక్తి కూడా తగ్గుతుంది - Sakshi

లైంగిక ఆసక్తి కూడా తగ్గుతుంది

ఆగిపోకండి!  సాగిపోండి!

మెనోపాజ్... ఋతుక్రమం ఆగిపోవడం... ఇది శారీరకంగా ప్రతి స్త్రీ జీవితంలో వచ్చే దశ. కానీ, ఆ దశలో ఎదురయ్యే శారీరక, మానసిక
బాధల గురించి చాలామంది బెంబేలెత్తిపోతుంటారు. కానీ,  ‘మెనోపాజ్’ గురించి పీడకలలా భయపడాల్సిన పని లేదని  వైద్యులు భరోసా ఇస్తున్నారు. స్త్రీ జీవితచక్రంలో మెనోపాజ్ అనేది  ఒక మజిలీ. అక్కడ కాసేపు ఆగి, సేద తీరి, స్వీయపరిశీలన చేసుకొని,  మరింత దృఢచిత్తంతో ముందుకు సాగాలి. వయస్సు మీద పడుతున్నప్పుడు దాన్ని హుందాగా అంగీకరించడం నేర్చుకోవాలి.
 
 
హార్మోన్లలో తేడా వల్ల....

మెనోపాజ్ దశలో ఈస్ట్రోజెన్ హార్మోన్ స్థాయిలో తేడాల వల్ల ఒళ్ళు వెచ్చపడడం, ఉన్నట్టుండి మూడ్ మారిపోవడం, రాత్రివేళ విపరీతంగా చెమటలు పట్టడం, జననేంద్రియం లోపల పొడిబారిపోవడం, సెక్స్ పట్ల ఆసక్తి లేకపోవడం లాంటి లక్షణాలు తలెత్తుతాయి. చాలామందికి తెలియనిదేమిటంటే, ఆడవారికి ఈస్ట్రోజెన్ లాగే టెస్టోస్టీరాన్ హార్మోన్ కూడా కీలకమే. మెనోపాజ్‌తో టెస్టోస్టీరాన్ స్థాయి తగ్గడం వల్ల కూడా లైంగిక ఆసక్తి, భావప్రాప్తి లాంటివి తగ్గిపోతాయి. వాటితో బెంగపడకుండా, స్త్రీలు సమస్యను అర్థం చేసుకొని, జీవితంలో ముందడుగు వేయాలి. జీవిత భాగస్వాములైన పురుషులు కూడా ఈ విషయం సహృదయంతో అర్థం చేసుకోవాలి. తగినంత సేపు మాటలు, చేష్టల ద్వారా వారిని సిద్ధపరచాలి.
 
సుప్రియ ఈ మధ్య తరచూ చీకాకుగా ఉంటోంది... తెచ్చిన కాఫీ కాస్తంత చల్లగా ఉందనో, అరగంట క్రితమే చెప్పిన పని ఇంకా కాలేదనో... ప్రతి చిన్న విషయానికీ పనివాళ్ళ మీద భద్రకాళిలా విరుచుకుపడుతోంది.ఆమె మూడ్ ఉన్నట్టుండి... మారిపోతోంది. సీరియస్ అవుతోంది. నిజానికి... 56 ఏళ్ళ సుప్రియ ఎప్పుడూ ఇలా ఉండేవారు కాదు. అందరితో నవ్వుతూ, తుళ్ళుతూ ఉండేవారు. కానీ, ఇప్పుడు ఇంట్లోనూ, ఆఫీసులోనూ అయినదానికీ, కానిదానికీ గొంతు చించుకుంటున్నారు.
 శారీరకంగా కూడా ఆమెలో ఇప్పుడు చాలా మార్పులు వస్తున్నాయి. విపరీతమైన అలసట, నీరసంగా అనిపించడం, బద్ధకం, ఉన్నట్టుండి ఒళ్ళంతా వెచ్చబడడం, చెమటలు పట్టడం! సుప్రియకు వచ్చిందేదో తగ్గని అనారోగ్యం, తీరని జబ్బు కాదు. ఈ మూడ్‌లో మార్పులు ఆడవారందరిలో జీవితంలో ఒక దశలో కనిపించేవే!
 
అవును...
 మెనోపాజ్... ఋతుక్రమం ఆగిపోవడం... ఇది శారీరకంగా ప్రతి స్త్రీ జీవితంలో వచ్చే దశ. కానీ, ఆ దశలో ఎదురయ్యే శారీరక, మానసిక బాధల గురించి చాలామంది బెంబేలెత్తిపోతుంటారు. కానీ, ‘మెనోపాజ్’ గురించి పీడకలలా భయపడాల్సిన పని లేదని వైద్యులు భరోసా ఇస్తున్నారు.  

మెనోపాజ్ ముందు దశలో పీరియడ్స్ సక్రమంగా రాకపోవడం, వచ్చినప్పుడు రక్తస్రావం ఎక్కువగా ఉండడం, మానసికంగా చీకాకుగా అనిపించడం - ఎవరికైనా కొద్దిగా ఇబ్బందే. మెనోపాజ్ దశలోని స్త్రీలు నెమ్మదిగా నడుస్తారు. అలాగే, కొద్దిగా బరువు పెరుగుతారు. మెడ కింద చర్మం వదులుగా మారుతుంది. కొద్దిగా ముడతలు కూడా వస్తాయి. ముఖ్యంగా, ఈస్ట్రోజెన్ హార్మోన్ తగ్గడం వల్ల చర్మం పొడిబారి, సాగే గుణాన్ని కోల్పోతుంది. గాయాలు త్వరగా తగ్గవు. జుట్టు పలచబడుతుంది. ఒంటిమీద వెంట్రుకలు రావడం పెరుగుతుంది. అయితే, జీవితంలో శారీరకంగా వచ్చే మార్పుల్లో మెనోపాజ్ కూడా ఒకటని గ్రహించాలి. దాన్ని అర్థం చేసుకోవాలి. ఫ్లూ తదితర సమస్యల లాగానే దీన్ని కూడా హాయిగా ఎదుర్కోవాలి. అంతే తప్ప, శారీరకంగా, మానసికంగా వచ్చిన మార్పులతో పోరాటానికి దిగకూడదు. అలాగని విస్మరించి, అందరికీ దూరంగా మీదైన లోకంలో ఉండిపోయి, ముడుచుకుపోకూడదని డాక్టర్లు చెబుతున్నారు.
 
ఆగిపోతాయి! అంతే!

శాస్త్రీయంగా చూస్తే, ఆడపిల్లకు పుట్టుకతోనే అండాశయంలో 20 లక్షల అండాల దాకా ఉంటాయి. ఆ అమ్మాయి పెద్దమనిషి అయ్యే నాటికల్లా వాటి సంఖ్య 4 లక్షలకు తగ్గిపోతుంది. వాటిలో దాదాపు 500 అండాలు మాత్రమే మెచ్యూర్ అయి, అండోత్సర్గ సమయంలో అండాశయం నుంచి బయటకు వస్తుంటాయి. పెద్దమనిషి అయిన దగ్గర నుంచి మెనోపాజ్ దశ దాకా నెలకు ఒకసారి జరిగే ఋతుక్రమం ఇదే! మెనోపాజ్ వచ్చిందంటే, అండాశయంలో అండాల ఉత్పత్తీ జరగదు, ఈ అండాల విడుదలా ఆగిపోతుందన్న మాట! మరోమాటలో చెప్పాలంటే, సహజసిద్ధంగా ఆమె గర్భవతి అయ్యే అవకాశం ఇక ఉండదన్న మాట!

లైంగిక ఆసక్తి కూడా తగ్గుతుంది. అంతమాత్రాన ‘మెనోపాజ్’ అంటే సెక్స్ జీవితానికి శుభం కార్డు అని ఫీలవ్వాల్సిన పని లేదు. కేవలం ‘కృష్ణా... రామా’ అనుకోవాల్సిందే అనుకోకూడదు. ఈస్ట్రోజెన్ హార్మోన్ తగ్గడం వల్ల లూబ్రికేషన్ కరవై, కలయిక సమయంలో నొప్పి అనిపిస్తుంది. శారీరకంగా వచ్చిన మార్పులకు అనుగుణంగా లైంగిక జీవితానికి సిద్ధమైతే చాలు. ఎంత వయసు వచ్చిందనే దాని కన్నా, మానసికంగా ఎంత యౌవనంగా ఫీలవుతున్నామన్నది ముఖ్యం.
 
స్త్రీలకు ఎందుకు సమస్యంటే...
ఏమైనా, ‘మెనోపాజ్’ స్త్రీలకు మానసికంగా ఇది కొద్దిగా కష్టసమయమేనని మానసిక వైద్య చికిత్సా నిపుణులు సైతం అంగీకరిస్తున్నారు. ఆ సమయంలో హార్మోన్లపరంగా వచ్చే మార్పుల వల్ల నిద్రలేమి ఏర్పడుతుంది. మానసికంగా ఆందోళన తలెత్తుతుంది. దాంతో, ఏ పని మీదా శ్రద్ధ, ఏకాగ్రత లేకుండా పోతాయి. నిజానికి, ఆ వయసులో ఆడవాళ్ళకు ఒకపక్క ఇంటి సమస్యలు కూడా ఎక్కువే. భర్త రిటైర్మెంట్ దగ్గర పడుతుంటుంది. అమ్మానాన్నలు, అత్తమామలు పెద్దవాళ్ళైపోయి, వాళ్ళకు అండగా నిలబడాల్సి ఉంటుంది. ఇంకోపక్క పిల్లలేమో పెరిగిపెద్దవడంతో, వాళ్ళ తాలూకు సమస్యలు ఉండనే ఉంటాయి. ఇవన్నీ చాలవన్నట్లు కెరీర్‌లో కూడా బాధ్యతాయుతమైన పదవిలోకి వచ్చి ఉంటారు. ఆ సమయంలో మెనోపాజ్ రావడంతో మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్లు శారీరక సమస్యలు కూడా తోడవుతాయి. మానసికంగా నిరాశా నిస్పృహలకు లోనవుతారు.
 
అత్యవసరమైతే... హార్మోన్ థెరపీ

మెనోపాజ్ ఇబ్బందులు మరీ ఎక్కువగా ఉండి, జీవన స్థాయినే దెబ్బతీస్తుంటే హార్మోన్ థెరపీ చేయించుకోవచ్చని ‘ఇంటర్నేషనల్ మెనోపాజ్ సొసైటీ’ ఎడ్యుకేషన్ కమిటీకి సారథ్యం వహిస్తున్న డాక్టర్ దురూ షా సలహా ఇస్తున్నారు. ‘‘మరీ ఇబ్బంది పడుతున్న ఆడవారికీ, 40 ఏళ్ళ లోపే మెనోపాజ్ వచ్చినవారికీ హార్మోన్ థెరపీ ఒక వరం. అయితే, సైడ్ ఎఫెక్ట్‌లు చాలా ఉంటాయి కాబట్టి, జాగ్రత్తగా తీసుకోవాలి. ఈ థెరపీ తీసుకుంటే, ఎముకలు విరగడాన్ని నివారించవచ్చు. పెద్దపేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గించవచ్చు. జీవనస్థాయి కూడా మెరుగవుతుంది’’ అని డాక్టర్ దురూ షా వివరించారు. అయితే, మధుమేహం ఉన్నవారు, తమ కుటుంబంలో ఎవరికైనా సెర్వికల్ క్యాన్సర్ వచ్చిన చరిత్ర ఉన్నవాళ్ళు మాత్రం ఈ ‘హార్మోన్ రిప్లేస్‌మెంట్ థెరపీ’ (హెచ్.ఆర్.టి) చేయించుకోకూడదు.
 
మీ కోసం... మీ వ్యాయామం!
మెనోపాజ్ తర్వాత ఎముకలు గుల్లబారిపోవడం అనేది చాలామంది స్త్రీలను పీడిస్తున్న సమస్య. దానివల్ల మణికట్టు, తుంటి, వెన్నెముక లాంటివి ఫ్రాక్చర్స్‌కు లోనయ్యే ప్రమాదం ఉంటుంది. ఈ రకమైన ఆస్టియో పోరోసిస్‌కు చికిత్సకన్నా నివారణే కీలకం. అందుకే, ఎముకల సాంద్రత సరిగ్గా ఉండేలా చూసుకొనేందుకు స్త్రీలు మొదటి నుంచి వ్యాయామం చేస్తూ, శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవాలి. ఉద్యోగం, పిల్లల సంరక్షణ, ఇంటి బాధ్యతల లాంటివి ఎన్ని ఉన్నప్పటికీ, ముందునుంచీ వ్యాయామం చేయడం భవిష్యత్తుకు మంచిది. అందుకే, ఆడవాళ్ళు మొదటి నుంచీ వాకింగ్, జాగింగ్, స్విమ్మింగ్, కాళ్ళమీద - పాదాల మీద నిల్చొని... శరీరం బరువు వాటి మీద ఉండేలా తేలికపాటి వ్యాయామాలు చేయాలి.
 
ఇవి తినండి!
ఈ వయసు ఆడవాళ్ళు సలాడ్‌లు, పండ్లు ఎక్కువగా తినాలి. ఎముకలు పటిష్ఠంగా ఉండడం కోసం క్యాల్షియం, ‘డి’ విటమిన్ ఒంటికి ఎక్కువగా పట్టేలా ఆకుకూరలు, కూరగాయలు, పాల ఉత్పత్తులు, సీతాఫలాలు, జామపండ్లు ఎక్కువగా తినాలి. అలాగే, ఈస్ట్రోజెన్ హార్మోన్ లోపాన్ని ఎదుర్కోవడం కోసం సోయాబీన్స్, సోయా పాలతో చేసిన ‘టోఫూ’ పెరుగు, అవిసె గింజలు, బీన్స్, బఠాణీలు, నువ్వులు బాగా తినాలి. వారానికి రెండుసార్లయినా మినుములు, మినప్పప్పు లాంటివి తింటే టెస్టోస్టీరాన్ స్థాయి మెరుగవుతుంది.
 నిజం చెప్పాలంటే, స్త్రీ జీవితచక్రంలో మెనోపాజ్ అనేది ఒక మజిలీ. అక్కడ కాసేపు ఆగి, సేదతీరి, స్వీయపరిశీలన చేసుకొని, మరింత దృఢచిత్తంతో ముందుకు సాగాలి. వయస్సు మీద పడుతున్నప్పుడు దాన్ని హుందాగా అంగీకరించడం నేర్చుకోవాలి. మూడేళ్ళక్రితం మెనోపాజ్ వచ్చిన ప్రముఖ టీవీ, స్టేజ్ యాంకర్ సాధనా శ్రీవాస్తవ్ (55 ఏళ్ళు) మాటల్లో చెప్పాలంటే, ‘‘అనవసరమైన ఆందోళనలన్నీ దూరంగా నెట్టండి. శారీరకంగా వస్తున్న మార్పుల గురించి అతిగా ఆందోళనపడితే, చర్మం మరింత ముడతలు పడుతుంది. జుట్టు ఇంకా ఇంకా నెరిసిపోతుంది. జీవితం ఎలా ముందుకు సాగితే, అలా ముందుకు వెళ్ళండి. అన్నిటినీ సమానంగా ఆస్వాదించండి. వీలైనంత ప్రశాంతంగా ఉండండి!’’ అప్పుడు మెనోపాజే కాదు... జీవితంలో ఏదైనా ఒక చిన్న ఫేజ్. అంతే! ఆ కొద్దిపాటి ‘పాజ్’ను కూడా భరించి, ఆనందంగా ముందుకు సాగిపోండి!
 
 
మనవాళ్ళకు... తొందరగా మెనోపాజ్ !
భారతీయ మహిళలకు సగటున 48 ఏళ్ళ వయస్సులో మెనోపాజ్ వస్తుందని గణాంకాలు చెబుతున్నాయి. ప్రపంచ సగటు మాత్రం 51 ఏళ్ళు. ఆ రకంగా చూస్తే, మన దేశ స్త్రీలు పిన్న వయస్సులోనే తొందరగా మెనోపాజ్ వస్తోందన్న మాట! ఇటీవలి అధ్యయనాలు కూడా ఆ మాటే పేర్కొంటున్నాయి. ‘‘ఆలస్యంగా పిల్లల్ని కనడం, పెరిగిపోతున్న గొడ్రాలితనం, మారుతున్న ఆహారపుటలవాట్లు, పొగతాగడం, అన్నిటి కన్నా ముఖ్యంగా మానసిక ఒత్తిడి వల్ల ఇలా ‘ముందుగానే మెనోపాజ్’ వస్తోంది’’ అని డాక్టర్లు చెబుతున్నారు.
 అండాశయాలు రెంటినీ అలాగే ఉంచేసినప్పటికీ, ‘పెద్దాపరేషన్’ చేసి గర్భసంచీ తొలగించిన (హిస్టెరెక్టమీ) ఆడవారికి  తొందరగా మెనోపాజ్ వచ్చే ప్రమాదం ఉంది. ఆ ఆపరేషన్ ప్రక్రియలో వారి అండాశయాలపై ప్రభావం పడడం వల్ల కావచ్చు... గర్భసంచీ తొలగింపునకు గురైన ఆడవారిలో అకస్మాత్తుగా ఒళ్ళు వెచ్చబడడం, ముఖమంతా ఎర్రగా మారడం లాంటి మెనోపాజ్ లక్షణాలు కనిపిస్తుంటాయి.
 
మెనోపాజ్ అంటే...
ఋతుక్రమం శాశ్వతంగా ఆగిపోవడమనేది (మెనోపాజ్) ప్రతి స్త్రీ జీవితంలో జరిగేదే! సాధారణంగా 45 నుంచి 55 ఏళ్ళ మధ్య వయస్సులో ఇది జరుగుతుంది. ఇది అందరిలో జరిగే మామూలు శారీరక ప్రక్రియే తప్ప, మరేమీ కాదు. గ్రీకు తత్త్వవేత్త అరిస్టాటిల్ ఈ శారీరక స్థితిని కొన్ని వందల ఏళ్ళ క్రితమే పేర్కొన్నారు. అయితే, ‘మెనోపాజ్’ అనే పదాన్ని మాత్రం చార్లెస్ పియర్ లూయిస్ డి గార్డెనే 1821లో రాసిన ‘మెనోపాజ్ - ది క్రిటికల్ ఏజ్ ఆఫ్ ఉమెన్’ అనే వ్యాసంలో తొలిసారిగా వాడారు.
 
కారణం
అండాశయాల నుంచి హార్మోన్ల ఉత్పత్తి క్షీణించడం వల్ల మెనోపాజ్ వస్తుంది. మెదడు నుంచి చర్మం దాకా కణజాలం మొత్తం మీద దీని ప్రభావం ఉంటుంది. నూటికి ఒక్క మహిళలో మాత్రం 40 ఏళ్ళ వయస్సు లోపలే అండాశయాలు పనిచేయడం మానేస్తాయి. దీన్నే ‘ప్రిమెచ్యూర్ ఒవేరియన్ ఫెయిల్యూర్’ అంటారు. మధుమేహం, కెమోథెరపీ, ఆటో - ఇమ్యూన్ డిసీజ్‌ల లాంటి వాటి వల్ల ఇలా జరుగుతుంటుంది. కాగా, గర్భసంచీ తొలగింపు ఆపరేషన్, ధూమపానం, అధిక బరువు లాంటి కారణాల వల్ల కూడా కొన్నిసార్లు మెనోపాజ్ దశ తొందరగా రావచ్చు.
 
దశలు
{పీ-మెనోపాజ్ - ఋతుచక్రం క్రమం తప్పిపోయిన దశ.పెరీ-మెనోపాజ్ - మెనోపాజ్‌కు దారి తీసే సంధి కాలం. ఇది దాదాపుగా 4 నుంచి 8 ఏళ్ళ దాకా కూడా ఉండవచ్చు.పోస్ట్ - మెనోపాజ్ - కనీసం ఒక ఏడాది కాలంగా ఋతుక్రమం ఆగిపోతే, ఇక మెనోపాజ్ వచ్చినట్టే!
 
వచ్చే ముప్పు
మెనోపాజ్ వల్ల ఎముక కణజాలంలోని ప్రొటీన్, ఖనిజ లవణాల పరిమాణం తగ్గిపోయే ‘ఆస్టియోపేనియా’ రావచ్చు. క్యాల్షియం, ‘డి’ విటమిన్ లోపాల వల్ల ఎముకలు పెళుసుగా మారి, ఉత్తిపుణ్యానికే విరిగే ‘ఆస్టియోపోరోసిస్’ రావచ్చు. అలాగే, గుండె రక్తనాళాల్లో బ్లాక్‌లు ఏర్పడడం వల్ల వచ్చే గుండెపోటు లాంటి ‘కార్డియో వాస్క్యులర్ డిసీజ్’లు రావచ్చు.
 

మెనోపాజ్ వస్తే... ఏం చేయాలి?
మెనోపాజ్ అనేది శారీరకంగా వచ్చే మార్పే తప్ప, చికిత్స చేయించుకోవాల్సిన వ్యాధి కాదని ముందుగా గుర్తించాలి  మెనోపాజ్‌కు చేరువయ్యే సంధి కాలంలో శారీరక, మానసిక, భావోద్వేగ సమస్యలు మరీ ఇబ్బందికరంగా ఉంటే, హార్మోనల్ రీప్లేస్‌మెంట్ థెరపీని తీసుకోవచ్చు. అయితే, దీన్ని చాలా జాగ్రత్తగా, అతి కొద్దికాలం మాత్రమే వాడాలి  ప్రత్యామ్నాయ వైద్య విధానంగా ఆక్యుపంక్చర్, ఔషధపరమైన ఆహార సప్లిమెంట్‌ల లాంటివి కూడా కొందరు వాడతారు మెనోపాజ్ వల్ల ఈస్ట్రోజెన్ తగ్గుతుంది. జననేంద్రియ స్రావాలు తగ్గుతాయి. కాబట్టి, ‘వాజినల్ మాయిశ్చరైజర్లు’, తక్కువ మొతాదు ఈస్జ్రోజెన్ క్రీమ్‌లను వాడితే ఉపశమనం ఉంటుంది  పుష్కలంగా ద్రవపదార్థాలు తీసుకోవాలి. తేలికపాటి, వదులు దుస్తులు వేసుకోవాలి. మసాలా ఆహారం తినకూడదు. తింటే, ఉన్నట్టుండి ఒళ్ళు వెచ్చబడడం, చెమటలు పట్టడం లాంటివి ఎక్కువవుతాయి  మెనోపాజ్ వచ్చే క్రమంలోని ఇబ్బందుల్ని భరించలేకపోతే, కౌన్సెలింగ్ తీసుకోవడం ద్వారా వాటిని ఎదుర్కోవాలి  కాళ్ళ మీద - పాదాల మీద నిల్చొని... శరీరం బరువు వాటి మీద ఉండేలా తేలికపాటి వ్యాయామాలు చేయాలి. క్యాల్షియం, ‘డి’ విటమిన్ సప్లిమెంట్లు తీసుకోవాలి. బై ఫాస్ఫొనేట్స్ లాంటి మందులు వాడడం ద్వారా ‘ఆస్టియో పోరోసిస్’ను నివారించుకోవచ్చు.
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement