వయసు తగ్గించే హార్మోన్ దొరికింది!
నిత్య యవ్వనంతో జీవితాన్ని కొనసాగించాలని కోరుకోని వారెవరు ఉంటారు? ఇందుకోసం ఏళ్లుగా పరిశోధనలూ జరుగుతూనే ఉన్నాయి. తాజాగా బ్రెజిల్, అమెరికా శాస్త్రవేత్తలు ఈ దిశగా కీలకమైన ముందడుగు వేశారు. మానవ కణాల్లో వయోభారాన్ని తిరోగమింపజేసే హార్మోన్ ఒకదాన్ని వీరు గుర్తించారు. ఈ ఆవిష్కరణ మనల్ని చిరాయువులుగా చేయకపోయినా వయోభారంతో వచ్చే సమస్యలకు మరింత సమర్థమైన చికిత్స అందించడంలో మాత్రం ఉపయోగపడనుంది.
ఇది ఓ పురుష హార్మోన్. పేరు డనాజోల్. కృత్రిమంగా తయారు చేసిన ఈ హార్మోన్ టెలిమెరేస్ అనే ఎంజైమ్ ఉత్పత్తిని ఎక్కువ చేస్తుంది. ఈ ఎంజైమ్ మన కణాల్లోని క్రోమోజోమ్‌ల చివరలో ఉండే టెలిమోర్‌లు కుంచించుకుపోకుండా ఉండేలా చేస్తుంది. వయసుతోపాటు ఈ టెలిమోర్‌ల పొడవు తగ్గిపోతుందని ఇప్పటికే రుజువైన నేపథ్యంలో ఈ పరిశోధన ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంటోంది. కణం విడిపోయిన ప్రతిసారీ టెలిమోర్‌ల పొడవు కొంత తగ్గుతుందాని, పూర్తిగా లేని పరిస్థితి వచ్చినప్పుడు కణం చనిపోతుందని అంటున్నారు సావోపాలో విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త రోడ్రిగో కలాడో. టెలిమరేస్ ఎంజైమ్ ఈ ప్రక్రియను నిలిపివేస్తుంది కాబట్టి కణం విడిపోవడం కొనసాగుతుందన్న మాట. ఈ కొత్త ఆవిష్కరణతో అప్లాస్టిక్ అనీమియా, పల్మనరీ ఫైబ్రోసిస్ వంటి వ్యాధులకు మెరుగైన చికిత్స లభించే అవకాశముందని అంచనా.