హైదరాబాద్ : వాతావరణ మార్పుల ప్రభావం కేవలం వర్షాలు, విపరీతమైన ఎండలకు మాత్రమే పరిమితం కాదని, మానవ, పాడిపశువుల ఆరోగ్యంపైనా తీవ్ర దుష్ప్రభావం చూపుతోందని పలువురు శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. చికన్‌గున్యా, మెదడువాపు, ఎల్లోఫీవర్, వెస్ట్‌నైల్ వైరస్ వంటి వ్యాధులు మళ్లీ మళ్లీ ప్రబలడం దీనికి ప్రత్యక్ష నిదర్శనమని అన్నారు. అన్ని రంగాల శాస్త్రవేత్తలు కలిసికట్టుగా పనిచేయడం ద్వారా మాత్రమే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని స్పష్టం చేశారు. ఇండియన్ ఇమ్యునలాజికల్స్ లిమిటెడ్, నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డులు 'కొత్త వ్యాధులు... వాతవరణ మార్పుల ప్రభావం' అన్న అంశంపై హైదరాబాద్‌లో గురువారం ఒక జాతీయ స్థాయి వర్క్‌షాప్ ఏర్పాటు చేసింది. ఇందులో ఐఐటీ ఢిల్లీ అధ్యాపకుడు డాక్టర్ హస్‌నైన్ మాట్లాడుతూ.. భవిష్యత్తులో వ్యాధుల కారణంగా సంభవించే మరణాలు 14 శాతం వరకూ ఎక్కువవుతాయని, మానవ వనరుల నష్టం కూడా మూడురెట్లు ఎక్కువవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
వ్యాధులు కొత్తకొత్త ప్రాంతాలకు విస్తరిస్తున్నాయని, ఒకప్పుడు ఆఫ్రికాకు పరిమితమైన బ్లూటంగ్ వైరస్ దశాబ్దకాలంలో యూరప్‌కు విస్తరించిందని తెలిపారు. జంతువుల నుంచి మనుషులకు, మనుషుల నుంచి జంతువులకు వచ్చే వ్యాధులు కూడా ఎక్కువవుతున్న నేపథ్యంలో ఈ రెండు వర్గాల జీవాల ఆరోగ్య సమస్యల పరిష్కారానికి కృషి జరగాల్సి ఉందని అన్నారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ డెరైక్టర్ జనరల్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్ మాట్లాడుతూ.. అధిక ఉష్ణోగ్రతలు హైపర్‌టెన్షన్, మధుమేహ వ్యాధిగ్రస్తులకు మరిన్ని చిక్కులు తెస్తాయని ఇప్పటికే రుజువైందని అన్నారు. నగరాలు కాంక్రీట్ అరణ్యాలుగా మారిపోతుండటం వల్ల ఆ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువ కావడం ఆందోళన కలిగిస్తోందని అన్నారు. నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డు ఛైర్మన్ డాక్టర్ టి.నందకుమార్, ఐసీఏఆర్ డెరైక్టర్ జనరల్ డాక్టర్ గయా ప్రసాద్, కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి అశోక్‌కుమార్ అంగురాణా, ఇండియన్ ఇమ్యునలాజికల్స్ లిమిటెడ్ మేనేజింగ్ డెరైక్టర్ కె.వి.బాలసుబ్రమణ్యం తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
'వాతావరణ మార్పులతోనే కొత్తవ్యాధులు'
Published Thu, Sep 3 2015 5:29 PM | Last Updated on Tue, Sep 4 2018 5:16 PM
Advertisement