Indian immunologicals limited
-
ఐఐఎల్ మీజిల్స్–రూబెలా టీకాకు అనుమతి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మీజిల్స్–రూబెలా టీకా తయారీకి ఔషధ రంగ నియంత్రణ సంస్థ డీసీజీఐ, రాష్ట్ర డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ల నుంచి అనుమతులు లభించినట్లు ఇండియన్ ఇమ్యునాలాజికల్స్ (ఐఐఎల్) తెలిపింది. ఇండో–వియత్నాం భాగస్వామ్యంతో దీని తయారీ, మార్కెటింగ్ హక్కులను దక్కించుకోవడం సాధ్యపడినట్లు వివరించింది. ఇందుకోసం వియత్నాంకు చెందిన పాలీవాక్ సంస్థతో జట్టు కట్టినట్లు ఐఐఎల్ ఎండీ కె. ఆనంద్ కుమార్ తెలిపారు. ఈ ఒప్పందం ప్రకారం మీజిల్స్ టీకాకు సంబంధించిన భాగాన్ని పాలీవాక్ అందించనుండగా, రూబెల్లా టీకా భాగాన్ని ఐఐఎల్ స్వంతంగా తయారు చేసి సంయుక్తంగా ఎంఆర్ వేక్సిన్‌ను రూపొందిస్తుంది. -
జీనోమ్ వ్యాలీలో రూ.700 కోట్ల భారీ పెట్టుబడి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ జీనోమ్ వ్యాలీలో రూ.700 కోట్ల పెట్టుబడితో పశు వ్యాక్సిన్ తయారీ కేంద్రాన్ని (వెటర్నరీ వ్యాక్సిన్ ఫెసిలిటీ) ఏర్పాటు చేస్తున్నట్లు ఇండియన్ ఇమ్యునోలాజికల్స్ లిమిటెడ్ (ఐఐఎల్) ప్రకటించింది. సంస్థ ఎండీ డాక్టర్ కె.ఆనంద్‌కుమార్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్లు ముకుల్ గౌర్, ఎన్ఎస్ఎన్ భార్గవ సోమవారం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌తో భేటీ అయ్యారు. ఫుట్ అండ్ మౌత్ డిసీజెస్ (పాదాలు, నోటి ద్వారా సంక్రమించే వ్యాధులు)తో పాటు ఇతర పశు వ్యాధులకు సంబంధించిన టీకాలు ఈ కేంద్రంలో తయారు చేస్తామని ఈ సందర్భంగా వారు ప్రకటించారు. దీని ద్వారా 750 మందికి ఉపాధి అవకాశాలు దొరకనుండగా, ఏడాదికి 300 మిలియన్ డోసుల వ్యాక్సిన్ ఉత్పత్తి జరుగుతుంది. అత్యాధునిక సౌకర్యాలతో బయో సేఫ్టీ లెవల్ 3 ప్రమాణాలతో ఐఐఎల్ ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుంది. హైదరాబాద్ పేరు ఇనుమడిస్తుంది: కేటీఆర్ జాతీయ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు అనుబంధ సంస్థ అయిన ఐఐఎల్ ఇప్పటికే ప్రపంచంలోనే అతిపెద్ద ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ వ్యాక్సిన్ తయారీదారుల్లో ఒకటిగా ఉంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పశు వ్యాధుల నియంత్రణ కార్యక్రమంలో ఎక్కువ వ్యాక్సిన్లను ఐఐఎల్ సరఫరా చేస్తోంది. గచ్చిబౌలిలో ఉన్న ఐఐఎల్ వ్యాక్సిన్ తయారీ కేంద్రం ఇప్పటికే ఏటా 300 మిలియన్ డోసులను తయారు చేస్తోంది. ప్రస్తుత పెట్టుబడితో మరో 300 మిలియన్ డోసుల వ్యాక్సిన్ ఉత్పత్తి అవుతుంది. తమ వ్యాక్సిన్‌తో పశు వ్యాధుల నియంత్రణ జరుగుతుందని, రైతులకు, దేశానికి వేల కోట్ల రూపాయలు ఆదా అవుతాయని ఆనందకుమార్ పేర్కొన్నారు. కొత్త టీకా ఉత్పత్తి కేంద్రంతో ప్రపంచ వ్యాక్సిన్ రాజధానిగా లైఫ్ సైన్సెస్ రంగంలో హైదరాబాద్ పేరు ఇనుమడిస్తుందని మంత్రి కేటీఆర్ చెప్పారు. ఈ భేటీలో ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, రాష్ట్ర ప్రభుత్వ ఫార్మా, లైఫ్ సైన్సెస్ డైరెక్టర్ శక్తి నాగప్పన్ పాల్గొన్నారు. -
'వాతావరణ మార్పులతోనే కొత్తవ్యాధులు'
హైదరాబాద్ : వాతావరణ మార్పుల ప్రభావం కేవలం వర్షాలు, విపరీతమైన ఎండలకు మాత్రమే పరిమితం కాదని, మానవ, పాడిపశువుల ఆరోగ్యంపైనా తీవ్ర దుష్ప్రభావం చూపుతోందని పలువురు శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. చికన్‌గున్యా, మెదడువాపు, ఎల్లోఫీవర్, వెస్ట్‌నైల్ వైరస్ వంటి వ్యాధులు మళ్లీ మళ్లీ ప్రబలడం దీనికి ప్రత్యక్ష నిదర్శనమని అన్నారు. అన్ని రంగాల శాస్త్రవేత్తలు కలిసికట్టుగా పనిచేయడం ద్వారా మాత్రమే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని స్పష్టం చేశారు. ఇండియన్ ఇమ్యునలాజికల్స్ లిమిటెడ్, నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డులు 'కొత్త వ్యాధులు... వాతవరణ మార్పుల ప్రభావం' అన్న అంశంపై హైదరాబాద్‌లో గురువారం ఒక జాతీయ స్థాయి వర్క్‌షాప్ ఏర్పాటు చేసింది. ఇందులో ఐఐటీ ఢిల్లీ అధ్యాపకుడు డాక్టర్ హస్నైన్ మాట్లాడుతూ.. భవిష్యత్తులో వ్యాధుల కారణంగా సంభవించే మరణాలు 14 శాతం వరకూ ఎక్కువవుతాయని, మానవ వనరుల నష్టం కూడా మూడురెట్లు ఎక్కువవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యాధులు కొత్తకొత్త ప్రాంతాలకు విస్తరిస్తున్నాయని, ఒకప్పుడు ఆఫ్రికాకు పరిమితమైన బ్లూటంగ్ వైరస్ దశాబ్దకాలంలో యూరప్‌కు విస్తరించిందని తెలిపారు. జంతువుల నుంచి మనుషులకు, మనుషుల నుంచి జంతువులకు వచ్చే వ్యాధులు కూడా ఎక్కువవుతున్న నేపథ్యంలో ఈ రెండు వర్గాల జీవాల ఆరోగ్య సమస్యల పరిష్కారానికి కృషి జరగాల్సి ఉందని అన్నారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ డెరైక్టర్ జనరల్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్ మాట్లాడుతూ.. అధిక ఉష్ణోగ్రతలు హైపర్‌టెన్షన్, మధుమేహ వ్యాధిగ్రస్తులకు మరిన్ని చిక్కులు తెస్తాయని ఇప్పటికే రుజువైందని అన్నారు. నగరాలు కాంక్రీట్ అరణ్యాలుగా మారిపోతుండటం వల్ల ఆ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువ కావడం ఆందోళన కలిగిస్తోందని అన్నారు. నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు ఛైర్మన్ డాక్టర్ టి.నందకుమార్, ఐసీఏఆర్ డెరైక్టర్ జనరల్ డాక్టర్ గయా ప్రసాద్, కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి అశోక్‌కుమార్ అంగురాణా, ఇండియన్ ఇమ్యునలాజికల్స్ లిమిటెడ్ మేనేజింగ్ డెరైక్టర్ కె.వి.బాలసుబ్రమణ్యం తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.