జీనోమ్‌ వ్యాలీలో రూ.700 కోట్ల భారీ పెట్టుబడి  | Hyderabad: IIL To Invest Rs 700 Crore For New Animal Vaccine Facility | Sakshi
Sakshi News home page

జీనోమ్‌ వ్యాలీలో రూ.700 కోట్ల భారీ పెట్టుబడి 

Oct 11 2022 1:35 AM | Updated on Oct 11 2022 1:53 AM

Hyderabad: IIL To Invest Rs 700 Crore For New Animal Vaccine Facility - Sakshi

సోమవారం మంత్రి కేటీఆర్‌తో భేటీ అయిన ఐఐఎల్‌ సంస్థ ప్రతినిధులు  కె.ఆనంద్‌కుమార్, ముకుల్‌ గౌర్, భార్గవ. చిత్రంలో సత్యవతి రాథోడ్, శ్రీనివాస్‌గౌడ్‌  

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ జీనోమ్‌ వ్యాలీలో రూ.700 కోట్ల పెట్టుబడితో పశు వ్యాక్సిన్‌ తయారీ కేంద్రాన్ని (వెటర్నరీ వ్యాక్సిన్‌ ఫెసిలిటీ) ఏర్పాటు చేస్తున్నట్లు ఇండియన్‌ ఇమ్యునోలాజికల్స్‌ లిమిటెడ్‌ (ఐఐఎల్‌) ప్రకటించింది. సంస్థ ఎండీ డాక్టర్‌ కె.ఆనంద్‌కుమార్, సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్లు ముకుల్‌ గౌర్, ఎన్‌ఎస్‌ఎన్‌ భార్గవ సోమవారం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌తో భేటీ అయ్యారు.

ఫుట్‌ అండ్‌ మౌత్‌ డిసీజెస్‌ (పాదాలు, నోటి ద్వారా సంక్రమించే వ్యాధులు)తో పాటు ఇతర పశు వ్యాధులకు సంబంధించిన టీకాలు ఈ కేంద్రంలో తయారు చేస్తామని ఈ సందర్భంగా వారు ప్రకటించారు. దీని ద్వారా 750 మందికి ఉపాధి అవకాశాలు దొరకనుండగా, ఏడాదికి 300 మిలియన్‌ డోసుల వ్యాక్సిన్‌ ఉత్పత్తి జరుగుతుంది. అత్యాధునిక సౌకర్యాలతో బయో సేఫ్టీ లెవల్‌ 3 ప్రమాణాలతో ఐఐఎల్‌ ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుంది.  

హైదరాబాద్‌ పేరు ఇనుమడిస్తుంది: కేటీఆర్‌ 
జాతీయ డెయిరీ డెవలప్‌మెంట్‌ బోర్డు అనుబంధ సంస్థ అయిన ఐఐఎల్‌ ఇప్పటికే ప్రపంచంలోనే అతిపెద్ద ఫుట్‌ అండ్‌ మౌత్‌ డిసీజ్‌ వ్యాక్సిన్‌ తయారీదారుల్లో ఒకటిగా ఉంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పశు వ్యాధుల నియంత్రణ కార్యక్రమంలో ఎక్కువ వ్యాక్సిన్లను ఐఐఎల్‌ సరఫరా చేస్తోంది. గచ్చిబౌలిలో ఉన్న ఐఐఎల్‌ వ్యాక్సిన్‌ తయారీ కేంద్రం ఇప్పటికే ఏటా 300 మిలియన్‌ డోసులను తయారు చేస్తోంది.

ప్రస్తుత పెట్టుబడితో మరో 300 మిలియన్‌ డోసుల వ్యాక్సిన్‌ ఉత్పత్తి అవుతుంది. తమ వ్యాక్సిన్‌తో పశు వ్యాధుల నియంత్రణ జరుగుతుందని, రైతులకు, దేశానికి వేల కోట్ల రూపాయలు ఆదా అవుతాయని ఆనందకుమార్‌ పేర్కొన్నారు. కొత్త టీకా ఉత్పత్తి కేంద్రంతో ప్రపంచ వ్యాక్సిన్‌ రాజధానిగా లైఫ్‌ సైన్సెస్‌ రంగంలో హైదరాబాద్‌ పేరు ఇనుమడిస్తుందని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. ఈ భేటీలో ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్, రాష్ట్ర ప్రభుత్వ ఫార్మా, లైఫ్‌ సైన్సెస్‌ డైరెక్టర్‌ శక్తి నాగప్పన్‌ పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement