కిడ్నీలు ప్రతిరోజూ దేహంలో 200 లీటర్ల రక్తాన్ని శుభ్రం చేస్తూ... రక్తంలోని మాలిన్యాలనూ, వ్యర్థాలనూ ఎప్పటికప్పుడు తొలగిస్తూ ఉంటాయి. అవి దేహానికి హాని చేసే యూరియా, క్రియాటినిన్ లాంటి జీవరసాయనాలను వడపోసి మూత్రం ద్వారా ఎప్పటికప్పుడు బయటకు పంపేస్తాయి. అయితే కిడ్నీల పనితీరు దాదాపు 70 – 80 శాతానికి పడిపోయేవరకు బాధితులకు ఆ విషయమే తెలియదు.
ఒకసారి కిడ్నీలు గనక చెడిపోతే జీవక్రియల్లో వెలువడే ఎన్నో విషరసాయనాలు దేహంలోనే పేరుకుపోవడం మొదలవుతుంది. అది ప్రాణాలకే ముప్పు తెచ్చిపెట్టే ముప్పుగా పరిణమించే ప్రమాదం ఉంది. అయితే ఈ ముప్పు రెండు రకాలుగా ఉంటుంది. మొదటిది తాత్కాలికమైనది. రెండోది శాశ్వతమైనది.
కిడ్నీ ఫెయిల్యూర్‌ను తెలుసుకోవడం ఎలా?
బాధితుల దేహంలో కిడ్నీలు దెబ్బతిన్నప్పుడు ‘క్రియాటినిన్’ అనే వ్యర్థ రసాయనం రక్తంలో పేరుకు΄ోతుంది. సీరమ్ క్రియాటినిన్ అనే ఓ చిన్న రక్తపరీక్ష ద్వారా కిడ్నీలు బాగున్నాయా లేదా అన్నది తేలిగ్గా తెలుసుకోవచ్చు. కిడ్నీ జబ్బులను అత్యంత తొలిదశల్లో గుర్తించడానికి ఉపయోగపడే పరీక్ష స్పాట్ యూరిన్ అల్బుమిన్ క్రియాటినిన్ రేషియో పరీక్ష. ఇదొక సరళమైన మూత్రపరీక్ష. మరీ ముఖ్యంగా షుగర్ ఉన్నవారిలో చాలా త్వరగా ఇది రాబోయే కిడ్నీ జబ్బులను పసిగడుతుంది.
కిడ్నీ సమస్య తాత్కాలికమా, శాశ్వతమా అన్నది తెలుసుకోవడం ‘అల్ట్రాసౌండ్ స్కానింగ్’తో సాధ్యమవుతుంది. కిడ్నీల సైజు మామూలుగానే ఉండి, క్రియాటినిన్ పెరుగుతూ΄ోతే అది తాత్కాలిక సమస్య. మందులతో, జీవనశైలి పద్ధతులతో దాన్ని చక్కదిద్దవచ్చు. ఒకవేళ వాటి సైజు బాగా చిన్నగా మారితే అప్పుడది శాశ్వత సమస్య అయ్యే అవకాశాలు ఎక్కువ. తాత్కాలిక కిడ్నీ సమస్యను ‘అక్యూట్ కిడ్నీ ఇంజరీ’ అనీ, కిడ్నీ పనితీరు వేగంగా తగ్గుతూపోతుంటే దాన్ని ‘ర్యాపిడ్‌లీ ప్రోగ్రెసివ్ రీనల్ ఫెయిల్యూర్’ (ఆర్‌పీఆర్‌ఎఫ్) అనీ, అదే పూర్తిగా శాశ్వతంగా దెబ్బతింటే దాన్ని ‘క్రానిక్ కిడ్నీ డిసీజ్’ (సీకేడీ) అని అంటారు.
శాశ్వత డయాలసిస్ నివారణ కోసం ఇవీ జాగ్రత్తలు...
డయాబెటిస్ పూర్తి అదుపు అవసరం : జీవితంలో డయాలసిస్ వద్దు అనుకునేవారు డయాబెటిస్‌ను పూర్తి అదుపులో ఉంచుకోవాలి. క్రమం తప్పకుండా మందులు తీసుకుంటూ, తగినంత వ్యాయామం చేయాలి.
బీపీ నియంత్రణ తప్పనిసరి: రక్తపోటు క్రమంగా శాశ్వతంగా కిడ్నీలు దెబ్బతినే క్రానిక్ కిడ్నీ డిసీజ్ వైపునకు తీసుకెళ్లే ప్రమాదముంది. అందుకే హైబీపీ ఉన్నవారు తమ రక్త΄ోటును అదుపులో ఉంచుకోవాలి.
అనవసరంగా పెయిన్‌కిల్లర్లు / యాంటిబయాటిక్స్ వద్దు
చాలామంది చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు యాంటీ బయాటిక్స్ వాడుతుంటారు. చిన్న΄ాటి నొప్పి కూడా తట్టుకోలేక నెలల తరబడి పెయిన్‌కిల్లర్స్ తీసుకుంటారు. డాక్టర్ల సూచన లేకుండా పెయిన్‌కిల్లర్లూ, యాంటీబయాటిక్స్ వంటి ‘ఓవర్ ద కౌంటర్’ మందులు ఎట్టిపరిస్థితుల్లో వాడకూడదు. చిన్నా చితకా నొప్పులకు పారాసెటమాల్ మాత్ర వాడితే సరిపోతుంది.
ఎట్టిపరిస్థితుల్లో నాటు మందులు వద్దు...
కొందరు శాస్త్రీయత లేని వైద్యప్రక్రియలకు / నాటుమందులకు వెళ్తుంటారు. నాటుమందుల్లోని విషాలను వడపోసే క్రమంలో కిడ్నీలు మరింతగా పాడైపోయి, బాధితులను డయాలసిస్ వైపునకు తీసుకెళ్తాయి. కిడ్నీల ఆరోగ్యం బాగుండాలంటే ఎట్టిపరిస్థితుల్లోనూ నాటు మందులు వాడకూడదు.
ఈ జాగ్రత్తలతో శాశ్వత డయాలసిస్‌కు వెళ్లకుండా కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
(చదవండి: స్మోకింగ్స్ .. ఆ గర్భ శత్రువులే..! )
Comments
Please login to add a commentAdd a comment