వడపోయని కిడ్నీలు..
పాతికేళ్లకే పాడవుతున్న వైనం నిమ్స్ వైద్యుల సర్వేలో వెల్లడి..
నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం నేడు వరల్డ్ కిడ్నీ డే..
సిటీబ్యూరో/గాంధీ ఆస్పత్రి: ఇనుప కండలు.. ఉక్కు నరాలతో రాళ్లను సైతం పిండి చేయగల యువత నేడు పాతికేళ్లకే కిడ్నీ జబ్బుల బారిన పడుతోంది. దేశవ్యా ప్తంగా ఏటా 2.5 లక్షల కేసులు నిర్థారణ అవుతుంటే.. రాష్ట్రంలో ప్రతి పదిమందిలో ఒకరు కిడ్నీ సంబంధిత సమస్యతో బాధ పడుతుండడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. వీటిలో గ్రేటర్ హైదరాబాద్‌లోనే ఏటా 15 వేలకు పైగా కేసులు వెలుగు చూస్తుండటం గమనార్హం. దేశంలోని ప్రధాన మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లో 10-15 శాతం మంది ఈ సమస్యతో బాధపడుతున్నట్లు వెల్లడైంది. నగరంలోని ప్రస్తుతం 15 వేల మంది డయాలసిస్ చేయించుకుంటుండగా, ఏటా 150-200కు పైగా మూత్రపిండాల మార్పిడి శస్త్ర చికిత్సలు జరుగుతున్నాయి. ఒక్క నిమ్స్‌లోనే ఏటా 70-80 శస్త్ర చికిత్సలు జరుగుతున్నాయి. ఆందోళన కలిగించే అంశం.. తమకు కిడ్నీ సంబంధిత సమస్య ఉన్నట్టు వీరిలో చాలా మందికి తెలియదు. బాధితుల్లో ఎక్కువ శాతం 40 ఏళ్లలోపు వారే కావడం విశేషం.
ఐసీఎంఆర్ సర్వే..
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎంత మంది కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు..? ఏ ప్రాంతంలో ఈ సమస్య ఎక్కువ ఉంది..? ఏ వయసు వారు దీని బారిన పడుతున్నారు..? వంటి ప్రశ్నలకు నిపుణుల వద్ద ఇప్పటి వరకు స్పష్టమైన సమాధానం లే దు. అయితే, ఈ ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాన్ని కనుగొనాలనే ఉద్దేశంతో ‘ది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్)’ నాలుగేళ్ల క్రితం ఢిల్లీ, ముంబయి, గౌహతి, భువనేశ్వర్, కోల్‌కత, చైన్నై, జైపూర్,
హైదరాబాద్ పట్టణాల్లో సర్వే చేపట్టింది. ఢిల్లీలోని ఎయిమ్స్‌తో పాటు నిమ్స్‌లోని సీనియర్ వైద్య నిపుణులు, పరిశోధక విద్యార్థులకు ఇందులో భాగస్వామ్యం కల్పించింది. సర్వే దాదాపు ముగింపు దశకు వచ్చింది.
పేదల జీవితాల్లో వైఎస్సార్ వెలుగులు
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆరోగ్యశ్రీ పథకం ద్వారా డయాలసిస్ సేవలను ఉచితంగా అందించి వేల మంది జీవితాల్లో వెలుగులు నింపారు. రూ. వేలు ఖర్చుపెట్టి డయాలసిస్ చేయించుకోలేని వారికి ‘ఆరోగ్యశ్రీ’ ద్వారా డయాలసిస్ సేవలను ఉచితంగా అందుబాటులోకి తెచ్చారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య పద్ధతిలో గాంధీ ఆస్పత్రిలో 2009 నవంబర్ 6న ప్రత్యేక సిబ్బంది పర్యవేక్షణలో 20 యూనిట్లతో డయాలసిస్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు ఇక్కడ 92,210 మందికి ఉచిత డయాలసిస్ సేవలు అందించారు.
రోగాలకు కారణాలివే..
మారిన ఆహారపు అలవాట్లు, మధుమేహం, అధిక రక్తపోటు, పెయిన్ కిల్లర్స్ అతిగా వినియోగించడం, యాంటిబయాటిక్స్ ఎక్కువ వాడటం, మలేరియా, టైఫాయిడ్ వ్యాధులు సోకడం, యాంజియోగ్రామ్ పరీక్షల్లో కాంట్రాస్ట్ మందు వాడటం, మరికొన్ని జన్యుపరమైన కారణాలతో పాటు శరీరానికి సరిపడినంత మంచి నీరు తాగకపోవడం వల్ల కిడ్నీ సమస్యలు తలెత్తుతున్నాయి.
- చాడ రమేష్, గాంధీ నెఫ్రాలజీ హెచ్‌వోడీ
ఏటా స్క్రీనింగ్ పరీక్షలు తప్పనిసరి
ఏడాది కోసారైనా ప్రతి ఒక్కరూ విధిగా కిడ్నీ సంబంధిత పరీక్షలు చేయించుకోవాలి. ఫిట్‌నెస్ కోసం రోజుకు కనీసం 20 నిమిషాలు వ్యాయామం చేయాలి. శరీరానికి సరిపడు (4 లీటర్లకు తగ్గకుండా) మంచినీరు తాగాలి. లేదంటే కిడ్నీలో రాళ్లు ఏర్పడి, మూత్ర విసర్జన సమయంలో భరించలేని నొప్పి వచ్చి అది క్రమంగా గుండె పోటుకు దారి తీస్తుంది. - ప్రొ. శ్రీభూషణ్ రాజు, నిమ్స్ నెఫ్రాలజీ విభాగాధిపతి
గాంధీలో డయాలసిస్ రోగులు..
2010 13,600
2011 16,300
2012 16,800
2013 20,400
2014 21,270
2015 ఫిబ్రవరి వరకు 3,840