షువో రాయ్
మీరు కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా? తరచూ డయాలసిస్ చేయించుకోవాల్సి వస్తోందా? కిడ్నీ మార్పిడికి దాత కోసం ఎదురు చూస్తున్నారా? నరకప్రాయం అనిపించే డయాలసిస్ వద్దని అనుకుంటున్నారా? మీ సమస్యలన్నీ తీరే రోజు ఎంతో దూరం లేదంటున్నారు యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాస్త్రవేత్త షువో రాయ్. ఎందుకంటారా?.... ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా మూత్రపిండాల మాదిరిగానే పని చేసే కృత్రిమ కిడ్నీ సిద్ధమైంది కాబట్టి!!
అక్షరాలా 2.20 లక్షలు... దేశంలో ఏటా కిడ్నీ సమస్యలతో డయాలసిస్ అవసరమవుతున్న వారి సంఖ్య ఇది. ఈ సంఖ్య పెరుగుతున్నా అందుకు తగ్గట్టుగా వైద్య సదుపాయాలు మాత్రం పెరగట్లేదు. కిడ్నీ దాతలూ తక్కువగా ఉండటంతో కిడ్నీ మార్పిడి చుట్టూ నేరాలు సైతం చోటుచేసుకుంటున్నాయి. ఉన్న సెంటర్ల లోనే గంటలకొద్దీ నానా అవస్థలు పడుతూ డయాలసిస్ చేయించుకుంటున్న రోగులకు ఎట్టకేలకు శుభవార్త. షువో రాయ్ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం కృత్రిమ కిడ్నీ తయారీలో విజయం సాధించడమే కాదు.. మరో రెండేళ్లలో అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది.
డయాలసిస్‌తో సమస్యలెన్నో...
మధుమేహం, అధిక రక్తపోటు వంటి సమస్యల కారణంగా శరీరంలోని రక్తాన్ని శుద్ధి చేసే మూత్రపిండాల పనితీరు మందగిస్తుంది. సకాలంలో తగిన చికిత్స తీసుకోకపోతే పనిచేయడమూ మానేస్తాయి. ఇది కాస్తా మరణానికి దారితీస్తుంది. మూత్రపిండాలు కొంతవరకే పనిచేస్తున్న పరిస్థితుల్లో ఓ భారీ యంత్రం సాయంతో రక్తాన్ని అప్పుడప్పుడూ శుద్ధి చేసి మళ్లీ ఎక్కిస్తూంటారు. డయాలసిస్ అని పిలిచే ఈ చికిత్స ఒక్కొక్కరికీ ఒక్కోలా ఉంటుంది. కొంత మందికి వారానికి ఒకసారి డయాలసిస్ అవసరమైతే ఇతరులకు నెల, రెండు నెలలకు ఒకసారి సరిపోతుంది. ఇదంతా కొంత ఖరీ దైన వ్యవహారమే. అదే సమయంలో సమస్యలను పూర్తిగా తగ్గించదు కూడా. శుద్ధి చేసే క్రమంలో శరీరానికి అవసరమైన కొన్ని పదార్థాలూ నష్టపోవాల్సి ఉంటుంది.
ప్లాస్టిక్‌లాంటి పదార్థాలతో తయారైన ఫిల్టర్ల వాడకం దీనికి కారణం. మూత్రపిండాల్లో సహజసిద్ధంగా ఉండే నెఫ్రాన్లు ఏడు నానోమీటర్ల సైజులో ఉంటే ప్లాస్టిక్ ఫిల్టర్‌లోని రంధ్రాలు ఇంతకంటే ఎక్కువ సైజులో ఉంటాయి. ప్రపంచంలో అత్యధిక మంది మధుమేహ రోగులున్న భారత్‌లో ఈ సమస్య పెరుగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా చీమకుర్తితోపాటు శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానంలో అత్యధిక కిడ్నీ రోగులు ఉండటం తెలిసిందే. ఏపీ సీఎం వై.ఎస్. జగన్ ప్రభుత్వం డయాలసిస్ రోగులకు ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించినా, కేంద్ర ప్రభుత్వ స్థాయిలో దేశవ్యాప్తంగా అందరికీ ఉచితంగా డయాలసిస్ జరిగేలా ఏర్పాట్లు చేయాలని సంకల్పించినా అవన్నీ సమస్య తీవ్రతను దృష్టిలో ఉంచుకుని చేపట్టిన చర్యలే. ఈ నేపథ్యంలోనే యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు చెందిన షువో రాయ్ పరిశోధన అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.
ఎలా పనిచేస్తుంది?
శరీరంలో ఏదైనా కొత్త అవయవం చేరితే రోగ నిరోధక వ్యవస్థ వెంటనే దాన్ని నిరోధించే ప్రయత్నం చేస్తుందనే విషయం మనకు తెలిసిందే. కానీ షువోరాయ్ తయారు చేసిన కృత్రిమ కిడ్నీతో మాత్రం ఈ సమస్య రాదు. ఎందుకంటే ఇందులో రోగి కణాలనే వాడతారు. స్థూలంగా ఇది రెండు భాగాలుగా ఉంటుంది. ఒకదాంట్లో నానోస్థాయి రంధ్రాలున్న ఫిల్టర్లు ఒక కట్టలా ఉంటాయి. సిలికాన్‌తో తయారైన ఈ ఫిల్టర్లు రక్తం ప్రవహించే వేగాన్ని ఉపయోగించుకొని రక్తంలోని విషపదార్థాలు, చక్కెరలు, లవణాలను తొలగిస్తాయి. ఫిల్టర్‌లోని రంధ్రాలు కచ్చితమైన సైజు, ఆకారంలో ఉండటం వల్ల రక్త కణాలపై ఒత్తిడి తగ్గుతుంది. లేదంటే రక్తం గడ్డకట్టి రోగికి ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇక రెండో భాగంలో బయో రియాక్టర్ ఉంటుంది. ఇందులో మూత్రపిండాల కణాలే ఉంటాయి. శుద్ధి చేసిన రక్తంలో తగుమోతాదులో నీళ్లు, అవసరమైన లవణాలు, చక్కెరలు ఉండేందుకు బయో రియాక్టర్‌లోని మూత్రపిండ కణాలు ఉపయోగపడతాయి. ఫిల్టర్ల ద్వారా శుద్ధి అయిన రక్తాన్ని పరిశీలించి.. ఏయే పదార్థాలు ఎంత మోతాదులో ఉన్నాయో గుర్తించడం నియంత్రణకు అవసరమైన పనులు చేసేందుకు ఒక మైక్రో కంట్రోలర్‌ను వాడతారు. గతేడాది షువో రాయ్ బృందం సిద్ధం చేసిన కృత్రిమ కిడ్నీ పరికరం నిమిషానికి లీటర్ రక్తాన్ని శుద్ధి చేయగలదని పరీక్షల్లో తేలింది. ఈ పరికరంలో వాడే బయో రియాక్టర్లను 1999 నుంచి జంతువుల్లో విజయవంతంగా పరీక్షిస్తున్నారు.
ఎలా అమరుస్తారు
షువో రాయ్ అభివృద్ధి చేసిన కృత్రిమ కిడ్నీ సైజు చాలా చిన్నది. ముందుగా ఫిల్టర్లు ఉన్న భాగాన్ని కడుపు భాగంలో చిన్న గాటు పెట్టి మూత్రనాళాలకు కలుపుతారు. రక్తం గడ్డ కట్టే ప్రమాదాన్ని నివారించేందుకు నెలరోజులపాటు పరిశీలిస్తారు. ఆ తరువాత రక్తం సక్రమంగా శుద్ధి అవుతున్నదీ లేనిదీ చూస్తారు. ఈ దశలో బయో రియాక్టర్‌ను జోడిస్తారు. కృత్రిమ కిడ్నీని అమర్చుకున్న వారు తమ దైనందిన కార్యకలాపాలను చేసుకోవచ్చు. కిడ్నీ మార్పిడి ఆపరేషన్లకు కూడా ఈ కృత్రిమ కిడ్నీ ప్రత్యామ్నాయం కానుందని అంచనా. జంతు పరీక్షలు ఇప్పటికే పూర్తయిన నేప థ్యంలో త్వరలోనే మానవ పరీక్షలు నిర్వహించేందుకు రంగం సిద్ధమవుతోంది. అమెరికాలోని కిడ్నీ రోగుల సంస్థ ఈ ప్రయోగాల్లో పాల్గొనడంతోపాటు ప్రాజెక్టు సాకారమయ్యేందుకు ఆర్థికంగానూ సాయపడతామని ఇప్పటికే ప్రకటించింది. అన్నీ సవ్యంగా సాగితే వచ్చే ఏడాదికల్లా ఈ కృత్రిమ కిడ్నీని అందుబాటులోకి తెస్తామని షువో రాయ్ చెబుతున్నారు. కిడ్నీ మార్పిడికి 5ృ10 ఏళ్లు పట్టొచ్చని, ఈలోగా కృత్రిమ కిడ్నీ ద్వారా రోగులు సాంత్వన పొందొచ్చని వివరించారు.
- సాక్షి నాలెడ్జ్ సెంటర్
డయాలసిస్ ప్రక్రియ తొలగింపే లక్ష్యం
డయాలసిస్ ప్రక్రియను పూర్తిగా తొలగించాలన్ననే నా లక్ష్యం. రక్తాన్ని శుద్ధి చేస్తూనే సహజసిద్ధ మూత్రపిండాలు చేసే పనులన్నీ నిర్వహించే కృత్రిమ కిడ్నీని తయారు చేయాలని దశాబ్దం కంటే ఎక్కువ కాలం నుంచి ప్రయత్నిస్తున్నా. ఇప్పుడున్న పరిస్థితుల్లో తగినన్ని నిధులు అందుబాటులోకి వస్తే ఒకట్రెండేళ్లలో మానవ ప్రయోగాలను పూర్తి చేయొచ్చు. ప్రపంచంలో ఏమూల ఉన్న వారికైనా దీన్ని అం దుబాటులోకి తీసుకురావచ్చు. నాతోపాటు మా బృందం మొత్తం ఇదే లక్ష్యంతో పనిచేస్తోంది.
- సాక్షితో షువో రాయ్
Comments
Please login to add a commentAdd a comment