సాక్షి, హైదరాబాద్: అధిక రక్తపోటు (హైబీపీ), మధుమేహం (డయాబెటిస్/షుగర్) తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్నాయి. పట్టణీకరణ, పారిశ్రామికీకరణ..తద్వారా జీవనశైలి, ఆహారపు అలవాట్లలో మార్పులు, ఇతర కారణాలతో ఎక్కువ సంఖ్యలో ప్రజలు బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ వంటి అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. 30 శాతం మంది హైబీపీతో బాధ పడుతుండగా, 9.9 శాతం మంది మధుమేహంతో బాధపడుతున్నట్లు అధ్యయనం వెల్లడించింది.
దేశంలో డయాబెటిస్, బీపీ, కొలెస్ట్రాల్ వంటి వాటిపై భారత వైద్య పరిశోధన సంస్థ (ఐసీఎంఆర్) అధ్యయనం చేసింది. 31 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 20 ఏళ్లకు పైబడిన వారిపై సర్వే జరిపింది. జనాభా, ప్రాంతాలు, సామాజిక, ఆర్థిక స్థితిగతుల ఆధారంగా ఈ అధ్యయనం జరిగింది. దేశవ్యాప్తంగా 1.13 లక్షల మందిని సర్వే చేశారు.
79,506 మంది గ్రామీణులు, 33,537 మంది పట్టణ ప్రాంత ప్రజల (మొత్తం 1.13 లక్షల మంది) ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు. 2008 అక్టోబర్ 18 నుంచి 2020 డిసెంబర్ 17 వరకు ఐదు దశల్లో రాష్ట్రాల వారీగా కొనసాగిన సర్వే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ జరిగింది. ఆ వివరాలను తాజాగా లాన్సెట్ జర్నల్ ప్రచురించింది.
పట్టణాల్లోనే ఎక్కువ..
తెలుగు రాష్ట్రాల్లోని పట్టణాల్లో 30 శాతం మందికి పైగా హైబీపీతో బాధపడుతుండగా, గ్రామాల్లో 25–30 శాతం మంది బాధపడుతున్నారు. రెండు రాష్ట్రాల్లోని పట్టణాల్లో 10 శాతం కంటే ఎక్కువగా మధుమేహ బాధితులు ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వీరి సంఖ్య 7.4 శాతంగా ఉంది.
ఇక 15 శాతం మంది వరకు ప్రీ డయాబెటీస్ (వ్యాధికి ముందు దశ) స్థితిలో ఉన్నారు. పట్టణాల్లో ఇది 10–15 శాతంగా ఉంది. తెలంగాణ గ్రామాల్లో ప్రీ డయాబెటీస్ 15 శాతం వరకు ఉండగా, ఏపీలోని గ్రామాల్లో 10 శాతం వరకు ఉంది.
పంజాబ్‌లో 51.8 శాతం మందికి హైబీపీ
దేశవ్యాప్తంగా 11.4 శాతం మంది డయాబెటిస్‌తో బాధపడుతున్నట్లు సర్వే నిర్ధారించింది. డయాబెటిస్ ముందు దశలో 15.3 శాతం మంది ఉన్నారు. 35.5 శాతం బీపీతో బాధపడుతుండగా, 28.6 శాతం మంది ఊబకాయంతో ఉన్నారు. పొట్ట దగ్గర కొవ్వు ఎక్కువ ఉన్నవారు 39.5 శాతం మంది ఉన్నారు. రక్తంలో కొవ్వు శాతం అధికంగా ఉన్నవారు 81.2 శాతం ఉన్నారు.
అత్యధికంగా గోవాలో 26.4 శాతం మందికి డయాబెటిస్ ఉంది. అతి తక్కువగా యూపీలో 4.8 శాతం మందికి ఉంది. బీపీ బాధితులు అత్యధికంగా పంజాబ్‌లో 51.8 శాతం మంది ఉన్నారు. అత్యంత తక్కువగా మేఘాలయలో 24.3 శాతం మంది ఉన్నారు. దేశంలో ఊబకాయులు 28.6 శాతంగా ఉన్నారు. పాండిచ్చేరిలో ఎక్కువ (53.3 శాతం) మంది, జార్ఖండ్‌లో తక్కువ (11.6 శాతం) మంది ఊబకాయ బాధితులు ఉన్నారు.
మరికొన్ని ముఖ్యాంశాలు..
♦ ఉమ్మడి ఏపీలో ఊబకాయులు 25 శాతం కంటే ఎక్కువగా ఉన్నారు. పట్టణాల్లో 25 శాతం కంటే ఎక్కువగా ఉన్నారు. తెలంగాణ గ్రామాల్లో 20 శాతం వరకు ఉన్నారు. గ్రామీణ ఏపీలో 20–25 శాతం మధ్య ఉన్నారు.
♦ పొట్ట దగ్గర అధిక కొవ్వు పేరుకుపోయిన వారు ఉమ్మడి ఏపీలో 25 శాతం కంటే ఎక్కువగా ఉన్నారు.
♦ రక్తంలో అధిక కొలెస్ట్రాల్ ఉభయ రాష్ట్రాల్లోని 20–25 శాతం మందికి ఉంది. అర్బన్ తెలంగాణలో ఇది 20–25 శాతంగా, ఏపీలో 25 శాతం కంటే ఎక్కువగా ఉంది. గ్రామీణ తెలంగాణలో 20–25 శాతం మధ్య, గ్రామీణ ఏపీలో 15–20 శాతం మధ్య ఉంది.
♦ మంచి కొలెస్ట్రాల్ తక్కువగా ఉన్నవారు తెలంగాణలో 50–60 శాతం మంది ఉండగా, ఏపీలో 60 శాతం కంటే ఎక్కువగా ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 15–20 శాతం మందికి చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంది. రెండు రాష్ట్రాల్లోని పట్టణాల్లో 20–25 శాతం మందికి చెడు కొలెస్ట్రాల్ ఉంది.
అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో డయాబెటిస్ అధికం
అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో డయాబెటిస్ అధికంగా ఉంది. చాలా జబ్బులు పట్టణాల్లో ఉన్నాయి. ప్రీ డయాబెటిస్ గ్రామాల్లో ఎక్కువగా ఉంది. ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన రాష్ట్రాల్లో షుగర్ తక్కువగా ఉంది. దీర్ఘకాలిక జబ్బులు అధికంగా ఉన్నాయని అధ్యయనం తేల్చింది. ప్రీడయాబెటిస్ స్థితిలో ఉన్నవారిని డయాబెటిస్ వైపు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని సిఫారసు చేసింది. అధిక షుగర్ బాధితుల్లో తదుపరి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది. –ప్రొఫెసర్ కిరణ్ మాదల, క్రిటికల్ కేర్ విభాగాధిపతి, నిజామాబాద్ మెడికల్ కాలేజీ
Comments
Please login to add a commentAdd a comment