సమాజాన్ని దీర్ఘకాలిక వ్యాధులు పట్టిపీడిస్తున్నాయి. దేశంలో జరుగుతున్న మరణాల్లో 65 శాతం దీర్ఘకాలిక వ్యాధుల వల్లే సంభవిస్తున్నాయని... అధిక బరువు, ఊబకాయం వల్ల షుగర్ వచ్చే ప్రమాదం ప్రజల్లో 73 శాతం ఎక్కువగా ఉందని కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) తేల్చిచెప్పింది.
ఈ మేరకు దీర్ఘకాలిక వ్యాధులపై ఐసీఎంఆర్, ఎన్‌ఐఎన్ సహా 21 సంస్థలు సర్వే చేశాయి. దేశవ్యాప్తంగా 600 ప్రాంతాల నుంచి దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్న 10,659 మందిని (18–69 ఏళ్ల వయసు వారు) సర్వే చేసి ఈ వివరాలు వెల్లడించాయి. తెలంగాణలో జాతీయ పోషకాహార సంస్థ (ఎన్‌ఐఎన్) సర్వే చేసింది. సర్వే నివేదికపై పార్లమెంటు ఇటీవల చర్చించింది. దేశంలో దీర్ఘకాలిక వ్యాధులపై జరిగిన మొట్టమొదటి సర్వే ఇదేనని కేంద్రం తెలిపింది.
– సాక్షి, హైదరాబాద్
సర్వేలో వెల్లడైన అంశాలు...
►2019లో దేశంలో దీర్ఘకాలిక జబ్బులతో 61 లక్షల మంది చనిపోయారు. అందులో షుగర్‌తో 1.70 లక్షల మంది మరణించారు. 1990తో పోలిస్తే దీర్ఘకాలిక వ్యాదులతో మరణించే వారి సంఖ్య రెట్టింపు అయింది.
►ధూమపానం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశం 15.5 శాతం ఎక్కువ. అధికంగా పొగతాగడం వల్ల కేన్సర్ ముప్పు సైతం 39 శాతం పెరుగుతుందని సర్వే తేల్చింది.
ఉప్పుతో పెరుగుతున్న ముప్పు...
►సర్వేలో పాల్గొన్న వారిలో సగటు ఉప్పు వినియోగం 8 గ్రాములుగా వెల్లడైంది. అందులో పురుషుల్లో ఉప్పు సగటు వినియోగం 8.9 గ్రాములుకాగా, మహిళలు 7.1 గ్రాములు వాడుతున్నారు. పట్టణాల్లో 8.3 గ్రాములు, పల్లెల్లో 8 గ్రాముల మేర వాడుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పినదానికంటే దేశంలో రెట్టింపు ఉప్పు వినియోగం జరుగుతోంది.
‘పొగ’బారిన 33% మంది
సర్వే ప్రకారం దేశంలో 32.8 శాతం మంది పొగతాగుతున్నారు. అందులో పురుషులు 51.2 శాతం, మహిళలు 13 శాతం ఉన్నారు. పట్టణాల్లో 25 శాతం, పల్లెల్లో 36.8 శాతం పొగ తాగుతున్నారు.
►15.9 శాతం మంది మద్యం సేవిస్తున్నారు. అందులో పురుషులు 28.3 శాతం, మహిళలు 2.4 శాతం ఉన్నారు. పట్టణాల్లో 14.2 శాతం, పల్లెల్లో 16.7 శాతం ఉన్నారు. అందులో అధిక మద్యం సేవించేవారు 5.9 శాతం మంది ఉన్నారు. అధిక మద్యం సేవించేవారిలో పురుషులు 10.9 శాతం, 0.5 శాతం మహిళలున్నారు. పట్టణాల్లో 10.7 శాతం, పల్లెల్లో 6.1 శాతం అధిక మద్యం సేవిస్తున్నారు. దేశంలో మద్యం వినియోగించే వారిలో 20–35 ఏళ్లవారే ఎక్కువగా ఉన్నారు.
వేధిస్తున్న ఊబకాయం...
►సర్వేలో పాల్గొన్న వారిలో 41.3 శాతం మంది శారీరక శ్రమ చేయడంలేదు. అందులో పురుషులు 30.9 శాతం మంది, మహిళలు 52.4 శాతం ఉన్నారు. పట్టణాల్లో 51.7 శాతం, గ్రామాల్లో 36.1 శాతం మంది చేయడంలేదు.
►26.1 శాతం మంది అధిక బరువుతో బాధపడుతున్నారు. అందులో పురుషులు 23.3 శాతం, మహిళలు 29.3 శాతం ఉన్నారు. పట్టణాల్లో 42.5 శాతం మంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు, గ్రామాల్లో ఇది 18 శాతంగా ఉంది.
పెరుగుతున్న బీపీ, షుగర్...
►28.5 శాతం మందిని బీపీ పట్టిపీడిస్తోంది. పురుషుల్లో 29.9 శాతం, మహిళల్లో 27 శాతం బీపీతో బాధపడుతున్నారు. ఇక పట్టణాల్లో 34 శాతం, గ్రామాల్లో 25.7 శాతం మంది బీపీతో ఉన్నారు.
►9.3 శాతం మంది షుగర్‌తో బాధపడుతున్నారు. అందులో పురుషుల్లో 8.5 శాతం, మహిళల్లో 10.2 శాతం షుగర్ ఉంది. పట్టణాల్లో 14.4 శాతం, గ్రామాల్లో 6.9 శాతంగా ఉంది.
2040 నాటికి ‘బరువు’మూడింతలు
►సర్వే అంచనాల ప్రకారం 2040 నాటికి అధిక బరువు బాధితుల సంఖ్య రెట్టింపు కానుంది. ఊబకాయం బాధితుల సంఖ్య మూడింతలు అవుతుంది. బీఎంఐ 25–30 మధ్య ఉంటే అధిక బరువు అంటారు. బీఎంఐ 30 కంటే ఎక్కువగా ఉంటే ఊబకాయం అంటారు. నడుము చుట్టుకొలత పురుషుల్లో 90 సెంటీమీటర్లు, మహిళల్లో 80 సెంటీమీటర్ల కంటే ఎక్కువ ఉంటే అధిక పొట్ట ఉన్నట్లు లెక్క.
►బీపీ 140/90 కంటే ఎక్కువ ఉంటే అధికంగా ఉన్నట్లు. షుగర్ ఫాస్టింగ్ 126 కంటే ఎక్కువ ఉంటే మధుమేహం ఉన్నట్లు లెక్క.
వ్యాయామానికి విరామం...
►ఈ సర్వే ప్రకారం దేశంలో 98.4 శాతం మంది నిర్ణీత పరిమాణంలో కూరగాయలు, పండ్లు తీసుకోవడంలేదు.
►వారానికి కనీసం 150 నిమిషాలపాటు తేలికపాటి నుంచి మధ్యస్థ స్థాయి లేదా 75 నిమిషాలపాటు తీవ్రస్థాయిలో శారీరక శ్రమ చేయాలి. ఆ ప్రకారం శారీరక శ్రమ చేయనివారు 41.3 శాతం మంది ఉన్నారు.
ప్రతి మూడు మరణాల్లో రెండు అవే...
గత 30 ఏళ్లలో జీవనశైలి జబ్బుల ప్రభావం భారతీయుల్లో రెట్టింపైంది. దేశంలో ప్రస్తుతం సంభవించే ప్రతి 3 మరణాలలో రెండు వీటికి చెందినవే. తగిన శారీరక శ్రమ, బరువును అదుపులో ఉంచుకోవడం, తాజా కూరగాయలు, పండ్లు రోజుకు 400 గ్రాములకు తగ్గకుండా తీసుకోవడం ద్వారా ఈ జబ్బులను దూరం చేయవచ్చు.
– డాక్టర్ హరిత, వైద్యురాలు, నిజామాబాద్
Comments
Please login to add a commentAdd a comment