కాళ్ల వాపులు కనిపిస్తున్నాయా? | Antibiotics Should Be Used For Inflammation Of The Legs | Sakshi
Sakshi News home page

కాళ్ల వాపులు కనిపిస్తున్నాయా?

Published Thu, Dec 26 2019 12:07 AM | Last Updated on Thu, Dec 26 2019 12:07 AM

Antibiotics Should Be Used For Inflammation Of The Legs - Sakshi

కొంతమంది పెద్దవయసువారు తమ కాళ్లపై కాస్తంత నొక్కుకుని పరిశీలనగా చూసుకుంటూ ఉంటారు. అలా నొక్కగానే కొద్దిగా గుంట పడ్డట్లుగా అయి... అది మళ్లీ క్రమంగా నెమ్మదిగా పూడుకుపోయి మామూలు స్థితికి వస్తుంది. ఇది చాలామందిలో కనిపించే సాధారణ సమస్య. చాలావరకు హానిలేనిదే అయినా కొన్నిసార్లు ఈ కాళ్లవాపు లోపల ఉన్న ప్రమాదకరమైన పరిస్థితికి ఒక సంకేతం కావచ్చు. రెండు కాళ్లలోనూ వాపు కనిపిస్తే అది మూత్రపిండాలు, కాలేయం, హార్ట్‌ ఫెయిల్యూర్‌ వంటి సమస్యలకు సూచన కావచ్చు. అదే ఒకే కాలిలో వాపు ఉంటే అది ఫైలేరియాసిస్‌లాంటి సమస్యకు సంకేతం కావచ్చు. కాళ్లవాపులపై  అవగాహన పెంచుకునేందుకు ఉపయోగపడేదే ఈ కథనం.

కాళ్లలో నొక్కిన చోట గుంట పడి, అది మెల్లగా సర్దుకోడాన్ని సాధారణ పరిభాషలో ‘పిట్టింగ్‌’ అంటారు. ఇదే సమస్యను వైద్యపరిభాషలో ‘ఎడిమా’ అని చెబుతారు. సాధారణంగా పురుషుల్లో కంటే మహిళల్లో ఎక్కువగా కనిపించే ఈ సమస్యకు అనేక కారణాలుంటాయి. మనమందరమూ సాధారణంగా ఈ తరహా కాళ్లవాపును మన జీవితంలోని ఏదో ఒక దశలో గమనించే ఉంటాం. అన్నిటికంటే సాధారణమైన దేమిటంటే చాలా దూరం కూర్చుని ప్రయాణం చేయడం వల్ల చాలామందిలో కాళ్లవాపు వస్తుంటుంది. ఇది నిరపాయకరం. కాసేపట్లో తగ్గిపోతుంది. కానీ కొన్ని సమస్యలు అంత సింపుల్‌గా ఉండవు. ఈ సమస్యకు గల కారణాలేమిటో చూద్దాం.

నిర్ధారణ పరీక్షలు
►సీబీపీ (కంప్లీట్‌ బ్లడ్‌ పిక్చర్‌)
►యూరిన్‌ స్పాట్‌ ప్రోటీన్‌ / కియాటినిన్‌ రేషియో
►బ్లడ్‌ యూరియా క్రియాటినిన్‌  లివర్‌ ఫంక్షన్‌ పరీక్ష  2–డీ ఎకో కార్డియోగ్రామ్‌  టీ3, టీ4, టీఎస్‌హెచ్‌
►అల్ట్రా సౌండ్‌ హోల్‌ అబ్డామిన్‌ 
►వీనస్‌ డాప్లర్‌ ఆఫ్‌ ద లెగ్స్‌
►నైట్‌ స్మియర్‌ ఫర్‌ మైక్రోఫైలేరియా లాంటి పరీక్షలతో పాటు, డీడైమర్‌ అనే పరీక్షను కాళ్ల వాపులు ఉన్నవారిలో చేయించాల్సి ఉంటుంది.

చికిత్స
రెండు కాళ్లూ వాచినప్పుడు...
సాధారణంగా కాళ్ల వాపు వచ్చిన అన్ని సందర్భాల్లోనూ ఒకేలాంటి నిర్దిష్టమైన చికిత్స ఉండదు. కారణాన్ని బట్టి చికిత్స మారుతుంది. అందుకే ముందుగా పరీక్షలు చేయించి కాళ్ల వాపుకు కారణాన్ని కనుగొనాల్సి ఉంటుంది.  
మూత్రపిండాల సమస్యలో: ఇమ్యునోసప్రెసెంట్స్, డైయూరెటిక్స్‌ వంటి మందులు.
కాలేయ సమస్య అయితే : స్పైరనోలాప్టోన్‌ అనే మందులు.
గుండెకు సంబంధించిన సమస్యలో : అయనోట్రోపిక్స్, డైయూరెటిక్స్‌ వంటి మందులు వాడాల్సి ఉంటుంది.
హైపోథైరాయిడిజమ్‌లో : థైరాక్సిన్‌ అనే హార్మోన్‌ ఇవ్వాల్సి ఉంటుంది.

ఒకే కాలి వాపునకు చికిత్స
ఫైలేరియాసిస్‌లో: డై ఇథైల్‌ కార్బోమైసిన్‌ను సాధారణంగా ఉపయోగిస్తారు.

వేరికోస్‌ వెయిన్స్‌ : నిర్దిష్టంగా మందులు ఉండవు. అయితే కాళ్లకు తొడిగే తొడుగు (స్టాకింగ్స్‌) వల్ల ఈ సమస్యను నియంత్రణలో ఉంచవచ్చు. అవసరాన్ని బట్టి శస్త్రచికిత్స చేయించాల్సి రావచ్చు.

వీనస్‌ ఇన్‌సఫిషియెన్సీ : ఈ సమస్యకు కూడా నిర్దిష్టంగా చికిత్స ఉండదు. అయితే ప్రత్యేకమైన ఎలాస్టిక్‌ తొడుగుల ద్వారా కాళ్ల వాపును అదుపు చేయవచ్చు. ఒకవేళ కాళ్ల వాపు మరీ ఎక్కువగా ఉంటే శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుంది.

సెల్యులైటిస్‌ : ఈ సమస్య వచ్చినప్పుడు యాంటీబయాటిక్స్‌ వాడాల్సి ఉంటుంది.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు
అన్ని రకాల కాళ్ల వాపుల విషయంలో ఈ సాధారణ జాగ్రత్తలు తీసుకోవాలి.
1. ఆహారంలో ఉప్పు తగ్గించాలి.
2. చాలాసేపు అదేపనిగా కూర్చోవడం, నిలబడటం తగ్గించాలి.
3. రాత్రివేళల్లో కాళ్లను ఎత్తుగా తలగడపై విశ్రాంతిగా ఉంచాలి.
4.అవసరాన్ని బట్టి ఎలాస్టిక్‌ స్టాకింగ్స్‌ వాడాలి.
ఈ అవగాహన కల్పించుకుని కాళ్లవాపు తరచూ వస్తుంటే వైద్యుణ్ణి సంప్రదించి తగిన చికిత్స చేయించుకోవాల్సి ఉంటుంది.

తెలుసుకోవాల్సిన కారణాలివే
రెండు కాళ్లకూ నీరొస్తుంటే...
ఈ కింది సమస్యలు ఉండే అవకాశం ఉంది.

గుండె సమస్యలు : హార్ట్‌ ఫెయిల్యూర్‌ వంటి గుండెకు సంబంధించిన సమస్యలున్నప్పుడు ఇలా కాళ్లపై నీరు రావడం చాలా మామూలే.

కాలేయ సమస్యలు : సిర్రోసిస్‌ ఆఫ్‌ లివర్‌ వంటి కాలేయ సమస్య ఉన్నప్పుడు

కిడ్నీ సమస్యలు : నెఫ్రోటిక్‌ సిండ్రోమ్, గ్లామరూలో నెఫ్రైటిస్‌ వంటి మూత్రపిండాల వ్యాధులు ఉన్నవారిలో

హైపోథైరాయిడిజం : మహిళల్లో సాధారణంగా కనిపించే ఈ సమస్యలో కాళ్ల వాపు అనేది నీరుపట్టడం వల్ల జరగదు. కానీ... ‘ప్రీటిబియల్‌ మిక్స్‌ ఎడిమా’ అనే తరహా కాళ్లవాపు కనిపిస్తుంది. ఇది గ్రేవ్స్‌ డిసీజ్‌ అనే థైరాయిడ్‌ సమస్యలో కనిపిస్తుంది.

పోషకాహార లోపాలు : ఆహారంలో తగినంతగా ప్రోటీన్లు తీసుకోకపోవడం (హైపో ప్రోటీనీమియా), బెరిబెరీ వంటి పోషకాహార లోపాలు ఉండటం

కొన్ని రకాల మందుల వల్ల : కొన్ని రకాల హైబీపీ మందుల వల్ల (క్యాల్షియమ్‌ ఛానెల్‌ బ్లాకర్స్‌), డయాబెటిస్‌కు వాడే మందులు (పయోగ్లిటజోన్స్‌), నివారణ మందులు (పెయిన్‌ కిల్లర్స్‌ ఎన్‌ఎస్‌ఏఐడీస్‌) వాడే వారిలోనూ, స్టెరాయిడ్స్‌ (గ్లూకో కార్టికాయిడ్స్‌), అసిడిటీకి వాడే మందుల (ప్రోటాన్‌ పంప్‌ ఇన్హిబిటర్స్‌)... వల్ల కాళ్లవాపు కనిపించవచ్చు.

ఎలాంటి కారణాలు లేకుండా : కొంతమందిలో నిర్దిష్టంగా ఎలాంటి కారణం లేకుండానే కాళ్లవాపులు రావచ్చు. ముఖ్యంగా పిల్లలను కనే వయసులోని మహిళల్లో ఇది కనిపించడం చాలా సాధారణం. దీన్ని ఇడియోపాథిక్‌ సైక్లిక్‌ అడిమా అంటారు.

ఒకే కాలిలో వాపు వస్తుంటే...
1 ఫైలేరియాసిస్‌: క్యూలెక్స్‌ దోమకాటు వల్ల వచ్చే వాపు.
2 వేరికోస్‌ వెయిన్స్‌ : కాళ్లపై ఉండే రక్తనాళాల్లోని (సిరలు) కవాటాలు పనిచేయకపోవడం వల్ల నరాలు ఉబ్బినట్లుగా కనిపిస్తాయి. ఇలాంటప్పుడు కూడా ఏదో ఓ కాలిపై వాపు రావచ్చు.
3 డీప్‌ వెయిన్‌ థ్రాంబోసిస్‌ : రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం వల్ల ఈ సమస్య వస్తుంది.
4 వీనస్‌ ఇన్‌సఫిషియెన్సీ : కాళ్లలోని రక్తనాళాల్లో రక్తం... తాను పయనించాల్సిన  మార్గంలో ప్రయాణం చేయకపోవడం వల్ల వచ్చే సమస్య ఇది.
5 సెల్యులైటిస్‌ : కాళ్ల చర్మంలోని డెర్మల్, సబ్‌క్యుటేనియస్‌ అనే పొరలలో ఉండే కనెక్టివ్‌ టిష్యూలో సమస్యల వల్ల ఈ వాపు వస్తుంది.

ఇతర సమస్యల కారణంగా...
పోషకాహార లోపాల్లో : ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారం
తీసుకోవాలి.

►ఏదైనా మందుల వల్ల కాళ్ల వాపు వస్తే... పేషెంట్‌ వాడుతున్న నొప్పినివారణ మందులు, హైబీపీ మందులు, స్టెరాయిడ్స్‌ నిలిపివేసి, వాటికి బదులుగా ఇతర మందులు మార్చాలివస్తుంది.

ఏ కారణం లేకుండా వచ్చే వాపు : ఇది ఏ కారణం లేకుండా వచ్చే ఇడియోపథిక్‌ సైక్లిక్‌ ఎడిమా అయితే ఎలాంటి మందులు వాడనవసరం లేదు. దానంతట అదే తగ్గిపోతుంది. ఒకవేళ అప్పటికీ తగ్గకపోతే కొద్ది రోజుల పాటు (షార్ట్‌ కోర్స్‌) డైయూరెటిక్స్‌ వాడవచ్చు.

►ప్రయాణంలో వచ్చే వాపులు... వీటికి ఎలాంటి మందులు వాడాల్సిన అవసరం లేదు. కాస్త ఎత్తుగా ఉండేలా తలగడపై కాళ్లు పెట్టుకోవడంతో కాళ్ల వాపు తగ్గుతుంది. అరికాళ్లను ప్రతి అరగంటకోసారి గుండ్రంగా తిప్పుతున్నట్లుగా (రొటేటింగ్‌ మోషన్‌లో) చేయాలి.  ప్రయాణంలో ఉన్నప్పటికీ ప్రతి గంటకోసారి కాస్తంత లేచి అటు ఇటు నడవాలి. బస్‌లోనో లేదా రైల్లోనో ఉన్నప్పటికీ ఈ పని చేయాలి. ఫ్లైట్స్‌లో యూఎస్‌ వంటి దూరప్రాంతాలకు వెళ్లేవారిలో ఇది మరీ ముఖ్యం. ఇలా తప్పక నడవాల్సిందేనంటూ డాక్టర్లు సిఫార్సు చేస్తుంటారు.
డాక్టర్‌ టి.ఎన్‌.జె. రాజేశ్, సీనియర్‌ కన్సల్టెంట్‌ ఫిజీషియన్‌
ఇంటర్నల్‌ మెడిసిన్‌ – ఇన్‌ఫెక్షియస్‌ డిసీజెస్,
స్టార్‌ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement