అంపశయ్యపై ‘శిరీష’ | Sireesh was waiting for donors help | Sakshi
Sakshi News home page

అంపశయ్యపై ‘శిరీష’

Published Mon, Dec 25 2017 3:02 AM | Last Updated on Mon, Dec 25 2017 3:02 AM

Sireesh was waiting for donors help - Sakshi

దుగ్గొండి (నర్సంపేట): వరంగల్‌ రూరల్‌ జిల్లా దుగ్గొండి మండలం మహ్మదాపురం గ్రామానికి చెందిన రేగుల శోభన్‌–సౌందర్య దంపతులది నిరుపేద కుటుంబం. వారికి ప్రశాంత్, శిరీష ఇద్దరు సంతానం. భార్యాభర్తలు కూలి పనులకు వెళ్లి వచ్చిన దాంతో పిల్లలను పోషించుకుంటున్నారు. డిగ్రీ పూర్తి చేసిన కుమారుడు ప్రశాంత్‌ ఆర్థిక పరిస్థితులు అనుకూలించక హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్‌ కంపెనీలో పనిచేస్తున్నాడు. కూతురు శిరీష డిగ్రీ ఫైనలియర్‌ చదువుతోంది. అయితే ఆమె కొన్నేళ్ల నుంచి రక్తహీనతతో బాధపడుతుండేది. దీంతో తల్లిదండ్రులు వరంగల్, హన్మకొండలోని పలు ఆస్పత్రుల్లో చికిత్స చేయించారు. రూ.3 లక్షల వరకు ఖర్చయ్యాయి.

ఆరోగ్యం కాస్త కుదుట పడటంతో 6 నెలల క్రితం ఇదే మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన యువకుడికి ఇచ్చి పెళ్లి చేశారు. వైద్యానికి, వివాహానికి అప్పులు చేయడంతో ఉన్న 2 ఎకరాల భూమి రూ.8 లక్షలకు అమ్మి వేశారు. శిరీష పెళ్లి అయిన 3 రోజులకే వ్యాధి తిరగబెట్టింది. కాళ్లు, ముఖం వాచిపోవడంతో హన్మకొండలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు కిడ్నీలు పాడైపోయాయని తప్పనిసరిగా మార్చాలని చెప్పారు. 6 నెలలుగా హైదరాబాద్‌లోని పలు ఆస్పత్రుల్లో చికిత్స కోసం మరో రూ.3 లక్షలు ఖర్చు చేసినా ఫలితం దక్కలేదు. మంచం పై నుంచి లేవలేని స్థితిలో ఉన్న శిరీష డయాలసిస్‌తో కాలం గడుపుతోంది. 

తల్లి ముందుకొచ్చినా..  
శిరీషకు కనీసం ఒక కిడ్నీ మారిస్తేనే బతుకుతుం దని డాక్టర్లు చెప్పడంతో తల్లి సౌందర్య తన కిడ్నీ ఇచ్చేందుకు సిద్ధమైంది. రక్త పరీక్షలు సరిపోలడం తో కిడ్నీ మార్చడానికి ఇబ్బందులు తొలగాయి. ఆపరేషన్‌కు రూ.లక్ష వరకు ఖర్చవుతుందని డాక్టర్లు చెప్పారు. తన కిడ్నీ ఇచ్చి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న కూతురిని బతికించుకుందామన్నా ఆపరేషన్‌కు డబ్బులు లేక కన్నపేగు తల్లడిల్లుతోంది. మానవతావాదులు సాయం అందించి శిరీషను ఆదుకోవాలని తల్లి వేడుకుంటోంది. సాయం చేయాలనుకునే వారు సెల్‌ నంబర్‌ 7732045246 ఫోన్‌ చేయాలని కోరారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement