గ్రాఫీన్‌తో వేగవంతమైన డయాలసిస్!
కిడ్నీలు పాడైతే డయాలసిస్ చేయించుకోవాల్సి వస్తుందని తెలిసిందే. అయితే డయాలసిస్ చేయించుకోవాలంటే దాదాపు 4 గంటల సమయం పడుతుంది. అంతేకాదు ఆ సమయంలో విపరీతమైన నొప్పి అనుభవించాల్సి ఉంటుంది. ఈ సమస్యకు ఇంగ్లండ్‌లోని మసాచూసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు ఓ పరిష్కారాన్ని కనుక్కున్నారు. గ్రాఫీన్ అనే పదార్థంతో తయారు చేసిన ఫిల్టర్లను ఉపయోగిస్తే.. డయాలసిస్ పదిరెట్లు ఎక్కువ వేగంతో జరుగుతుందని నిరూపించారు.
దీంతో ఈ ప్రక్రియ అతితక్కువ సమయంలోనే పూర్తవుతుందన్న మాట. డయాలసిస్ యంత్రాల్లో ఉపయోగిస్తున్న ఫిల్టర్లు చాలా మందంగా ఉంటాయని, గ్రాఫీన్ ఒక నానోమీటర్ మందం మాత్రమే ఉండటం వల్ల రక్తంలోని వ్యర్థ పదార్థాలను సులువుగా, వేగంగా వేరు చేయొచ్చని మెకానికల్ ఇంజనీరింగ్‌కు చెందిన పిరన్ కిడాంబి అంటున్నారు. ఈ నేపథ్యంలోనే వేర్వేరు సైజుల గ్రాఫీన్ పొరలను తయారు చేసేందుకు కొత్త పద్ధతిని సిద్ధం చేశామని చెప్పారు. ఈ పద్ధతి ద్వారా కేవలం 0.66 నానోమీటర్ల సైజుండే పొటాషియం క్లోరైడ్ అణువులను కూడా ఫిల్టర్ చేయగల పొరలను సిద్ధం చేశామని తెలిపారు. ఈ పరిశోధన వివరాలు అడ్వాన్స్ మెటీరియల్స్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.