కిడ్నీ మార్పిడితో కొత్త జీవితం
మన శరీరంలోని అవయవాల్లో మూత్రపిండాలు (కిడ్నీస్) ప్రధానమైనవి. ఇవి మన శరీరంలో రక్తాన్ని శుద్ధి చేసి, మలిన పదార్థాలను మూత్రం ద్వారా బయటకు పంపిస్తాయి. నీటి సమతుల్యతను కాపాడటంతో పాటు రక్తపోటును కూడా నియంత్రిస్తాయి. ఇవి చెడిపోతే శరీరంలో రక్తశుద్ధి ప్రక్రియ కుంటుపడిపోయి రక్తం కలుషితం అవుతుంది. దాంతో ప్రాణాలకే ప్రమాదం. అలాంటి సమయంలో కిడ్నీ మార్పిడి ఒక్కటే శాశ్వత పరిష్కారం.
చికిత్స: దీర్ఘకాలిక కిడ్నీల వైఫల్యం ఉన్నప్పుడు కిడ్నీ పనితీరును మెరుగుపరిచేందుకు వైద్యులను క్రమం తప్పకుండా కలుస్తూ వారు సూచించిన చికిత్స తీసుకోవాలి. బీపీ ఉంటే దాన్ని అదుపులో పెట్టుకోవాలి. మంచి పోషకాహారాన్ని తీసుకుంటూ ఉండాలి. మూత్రపిండాలు వాటి సామర్థ్యాన్ని పూర్తిగా కోల్పోతే శరీరంలో రక్తాన్ని శుద్ధి చేసే ప్రక్రియ పూర్తిగా కుంటుపడుతుంది. అలాంటప్పుడు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా శరీరంలోని రక్తాన్ని శుద్ధి చేయాల్సి వస్తుంది. ఈ స్థితిలో ఉన్న రోగులకు డయాలసిస్ గానీ లేదా కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ గానీ చేయాల్సి వస్తుంది.
డయాలసిస్ ఎప్పుడు చేయించుకోవాలి: పేషెంట్‌కి ఆగకుండా వాంతులు అవుతుండటం, నీరసంగా ఉండటం, ఆకలి తక్కువగా ఉండటం, ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది కలుగుతుండటం వంటి లక్షణాలు కనిపిస్తున్నప్పుడు డయాలసిస్ అత్యవసరమని భావించవచ్చు. అంతేకాకుండా కొందరు పేషెంట్లలో ఇలాంటి లక్షణాలు లేకపోయినప్పటికీ వారికి నిర్వహించిన పరీక్షల్లో సీరమ్ క్రియాటినైన్ 8 ఎంజీ కంటే ఎక్కువగా, యూరియా 150కి పైగా ఉన్నట్లు తేలితే పేషెంట్ ఆరోగ్య పరిస్థితి దిగజారకుండా డయాలసిస్ నిర్వహించాల్సి ఉంటుంది. కానీ వైద్యుల సూచనలు, సలహాల మేరకే ఈ ప్రక్రియ చేపట్టాలి. అయితే కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్‌కు మించిన మంచి ప్రత్యామ్నాయం లేదని చెప్పవచ్చు. దాదాపు 25 శాతం మంది రోగులు డయాలసిస్ చేయించుకున్నప్పటికీ, వివిధ సైడ్ ఎఫెక్ట్స్‌తో చనిపోతున్నారు. డయాలసిస్‌లో ఉన్నప్పుడు పేషెంట్ గుండె విఫలం కావడం లేదా తీవ్రమైన ఇన్ఫెక్షన్స్ లాంటి ఇతరత్రా కారణాల వల్ల తమ ప్రాణాలను కోల్పోతున్నారు.
డయాలసిస్ రకాలు...
హీమో డయాలసిస్: ఇది యంత్రం ద్వారా రక్తాన్ని శుద్ధి చేసే పద్ధతి. కృత్రిమ కిడ్నీ ద్వారా యంత్రం సహాయంతో రక్తాన్ని శుద్ధి చేస్తారు. పెరిటోనియల్ డయాలసిస్: ఇది ఇంట్లోనే చేసుకునే డయాలసిస్.
కిడ్నీ మార్పిడి ఎప్పుడు?
కిడ్నీ వంద శాతం పాడైనప్పుడు ట్రాన్స్‌ప్లాంటేషన్ ఉత్తమమైన మార్గం. అయితే ఇది అందరికీ సాధ్యపడదు. దీనికి దాత అవసరం. లైవ్ డోనార్ (బతికి ఉన్న వారి నుంచి కిడ్నీ సేకరించడం), కెడావర్ డోనార్ (చనిపోయిన వ్యక్తి నుంచి కిడ్నీ సేకరించడం) ప్రక్రియ ద్వారా కిడ్నీని సేకరిస్తారు. లైవ్ డోనార్‌లో రక్తసంబంధీకులు మాత్రమే కిడ్నీని దానం చేయాలి. అలాగే దాత బ్లడ్ గ్రూపు స్వీకర్త బ్లడ్ గ్రూపుతో కలవాల్సి ఉంటుంది. కిడ్నీ దానం చేసేవారికి అధిక రక్తపోటు, డయాబెటిస్, గుండెజబ్బులు, మెదడు జబ్బులు, కాలేయ వ్యాధులైన హెపటైటిస్-బి, సి లాంటివి ఉండకూడదు. ఒకవేళ రక్తసంబంధీకుల బ్లడ్ గ్రూపులు కలవకపోతే స్వాప్ లేదా ఏబీఓ ఇన్‌కంపాటబుల్ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ ప్రక్రియలు అందుబాటులో ఉన్నాయి. అయితే కిడ్నీ లభించేవరకు డయాలసిస్ తప్పనిసరి.
స్వాప్ ట్రాన్స్‌ప్లాంటేషన్
కిడ్నీ మార్పిడి అవసరమైన వారి రక్త సంబంధీకులు కిడ్నీ దానం చేయాలనుకున్నప్పటికీ బ్లడ్‌గ్రూపులు కలవకపోవడం వల్ల కొన్నిసార్లు అది సాధ్యపడదు. ఇలాంటి సందర్భాల్లో అదే సమస్యతో బాధపడుతున్న మరొకరికి చెందిన రక్తసంబంధీకులు కిడ్నీని దానం చేయాలని అనుకుంటే... పరస్పరం ఒకరి దాతలు మరొకరికి కిడ్నీలు దానం చేసుకొని... కిడ్నీ మార్పిడి చేయించుకునే ప్రక్రియను స్వాప్ రీనల్ ట్రాన్స్‌ప్లాంటేషన్ (ఇచ్చిపుచ్చుకోవడం) అంటారు. ఈ విధానంలో వీరి కిడ్నీ మరొకరి బంధువుకూ, వారి కిడ్నీ వీరి బంధువుకూ అమర్చుతారు.
బ్లడ్ గ్రూపులు కలవకపోయినా కిడ్నీ మార్పిడి
అందివస్తున్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, వైద్యులలో పెరుగుతున్న నైపుణ్యాలతో ప్రస్తుతం బ్లడ్‌గ్రూపులు కలవకపోయినా కూడా కిడ్నీ మార్పిడి చేయగలుగుతున్నారు. ఏబీఓ ఇన్ కంపాటబుల్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అనే అత్యాధునిక వైద్య ప్రక్రియ ద్వారా దాత, స్వీకర్త... ఈ ఇద్దరూ వేర్వేరు బ్లడ్‌గ్రూపులు కలిగి ఉన్నా... కిడ్నీ మార్పిడి చేయడం వీలవుతుంది. ఈ ప్రక్రియలో ప్రత్యేకమైన ప్లాస్మాఫెరసిస్ పద్ధతిని అనుసరించి వేర్వేరు బ్లడ్‌గ్రూపుల్లోని యాంటిజెన్ కలిసేలా చేస్తారు. దాత, స్వీకర్తల బ్లడ్ గ్రూపులు కలవకపోయినప్పటికీ ఏబీఓ ఇన్‌కంపాటబుల్ ట్రాన్స్‌ప్లాంటేషన్ విధానంలో కిడ్నీ మార్పిడి చేసుకున్న వారు కూడా కంపాటబుల్ కిడ్నీ మార్పిడి మాదిరిగానే మెరుగైన ఫలితాలు పొందుతున్నారు.
కిడ్నీ దానం సురక్షితమా?
కిడ్నీ దానం హానికరం కానేకాదు. ఒక కిడ్నీ పాడైనప్పటికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా మరో కిడ్నీతో కూడా జీవిత కాలాన్ని హాయిగా కొనసాగించవచ్చు. దైనందిన జీవితానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. యథావిధిగా ఉద్యోగాలు చేసుకోవచ్చు. డ్రైవింగ్, వ్యాయామంతో పాటు ఆటల పోటీల్లోనూ పాల్గొనవచ్చు. మిలిటరీ ఉద్యోగాలు కూడా నిరభ్యంతరంగా కొనసాగించుకోవచ్చు. కిడ్నీ దానం చేసే దాతకు భవిష్యత్తులో ఎలాంటి ఆరోగ్య సమస్యలూ ఉండవు. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీకి అత్యాధునికమైన ’ల్యాపరోస్కోపిక్’ వైద్య విధానం అవలంబిస్తారు. ఒక కిడ్నీ దానం చేయడం వల్ల దాతకు ఎలాంటి నష్టం లేదని నిర్ధారణ చేసిన తర్వాతనే కిడ్నీ మార్పిడి చేస్తారు.
లక్షణాలు
కాళ్ల వాపులు ముఖం వాచినట్లు ఉండటం ఆకలి తగ్గడం ఆగకుండా వాంతులు కావడం నీరసంగా ఉండటం ఆయాసం రావడం ఎక్కువ సార్లు మూత్ర విసర్జనకు వెళ్లాల్సి రావడం (ప్రధానంగా రాత్రివేళల్లో) మూత్రం తక్కువగా రావడం కొన్ని సందర్భాల్లో మూత్రంలో రక్తం పడటం ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది కలగడం అపస్మారక స్థితికి చేరుకోవడం.
కిడ్నీ చెడిపోవడానికి కారణాలు
డయాబెటిస్ అధిక రక్తపోటు మూత్రనాళ ఇన్ఫెక్షన్స్‌ను నిర్లక్ష్యం చేయడం కిడ్నీలో రాళ్ల సమస్య వంశపారంపర్యంగా (2 నుంచి 5 శాతం మందిలో).