కిడ్నీ కౌన్సెలింగ్స్
మావారి వయసు 36 ఏళ్లు. సాఫ్ట్‌వేర్ కంపెనీలో సీనియర్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. మా కుటుంబంలో వంశపారంపర్యంగా షుగర్ వ్యాధి ఉంది. గత ఐదేళ్లుగా విదేశాల్లోనే ఉండి పనిచేసి, ఇటీవలే స్వదేశం వచ్చారు. విదేశాల్లో ఉన్నప్పుడు ఫాస్ట్‌ఫుడ్, కూల్‌డ్రింక్స్ ఎక్కువగా తీసుకునేవారు. మద్యం, సిగరెట్ల అలవాటు కూడా ఉంది. ఈమధ్య హఠాత్తుగా ఆరోగ్యం చెడిపోతే డాక్టర్‌కు చూపించాం. రెండు కిడ్నీలు చెడిపోయాయని చెప్పారు. వారానికి మూడు, నాలుగు సార్లు డయాలసిస్ చేయించుకోవాలి. ట్రాన్స్‌ఫ్లాంటేషన్ అవసరమని చెప్పారు. మూత్రపిండాల మార్పిడి ఎలా చేస్తారు? కిడ్నీ ఎవరు ఇవ్వవచ్చు? దయచేసి వివరంగా తెలపండి. – కె. సింహాచలం, విశాఖపట్నం
మన శరీరంలోని అత్యంత కీలకమైన అవయవాల్లో మూత్రపిండాలు కూడా చాలా ప్రధానమైనవి. ఇవి మన శరీరంలోని రక్తాన్ని శుద్ధిచేసి, అనవసర, ప్రమాదకర, విసర్జన పదార్థాలను నీటితో కలిపి బయటకు పంపిస్తుంటాయి. కిడ్నీలకు తీవ్రమైన వ్యాధులు సోకినప్పుడు అవ రక్తాన్ని శుద్ధి చేయలేవు. మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధుల్లో ప్రాథమిక దశలో నొప్పిగానీ, స్పష్టమైన వ్యాధి లక్షణాలేమీ కనిపించవు. దాంతో కీలకమైన ఈ అవయవాలకు వ్యాధి సోకినట్లు గుర్తించడలంలో చాలా ఆలస్యం అవుతుంది. కానీ కిడ్నీ వ్యాధుల గుర్తింపులో సమయం చాలా కీలకం. ఆలస్యం అవుతున్నకొద్దీ వ్యాధి మరింత ముదిరి చివరకు అది రీనల్ ఫెయిల్యూరుకు దారితీస్తుంది. దాంతో మూత్రపిండం తిరిగి సాధారణ స్థితికి చేరుకోవడం చాలా సందర్భాల్లో అసాధ్యం అవుతుంది. ఆ పరిస్థితిలో మూత్రపిండాల మార్పిడి (కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్) తప్ప మరో మార్గం లేని పరిస్థితి ఏర్పడుతుంది.
కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు దాత అవసరం. దాత నుంచి కిడ్నీ పొందడానికి ప్రభుత్వ నిర్వహణలో ఉండే ‘జీవన్‌దాన్’లో పేరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. దాత లభించేలోగా డయాలసిస్‌పై ఆధారపడటమే మార్గం. డయాలసిస్‌లో రక్తంలోని మలినాలు, అదనపు నీటిని తొలగించివేస్తారు. డయాలసిస్‌లో రెండు రకాలు ఉన్నాయి. మొదటిది హీమోడయాలసిస్, రెండోది పెరిటోనియల్ డయాలసిస్. హీమోడయాలసిస్ కోసం ఆసుపత్రికి వెళ్లాల్సి ఉంటుంది. పెరిటోనియల్ డయాలసిస్ ఇంటిదగ్గరే చేసుకోడానికి వీలవుతుంది. ప్రపంచంలోని చాలా దేశాల్లో లాగే మన దేశంలోనూ కిడ్నీ దాతల సంఖ్య చాలా తక్కువగా ఉంటున్నది. అందువల్ల వ్యాధిగ్రస్తుడి పరిస్థితిని బట్టి తొందరగా కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స అవసరమైనప్పుడు కుటుంబసభ్యులు, రక్తసంబంధీకుల్లో ఎవరైనా దానం చేయవచ్చు. దాతల ఆరోగ్యం, రక్తం గ్రూపు తదితర అంశాలను పరిశీలించి డాక్టర్లు సరైన దాతను నిర్ణయిస్తారు.
కిడ్నీ వ్యాధుల చికిత్సతో పాటు మూత్రపిండాల మార్పిడికి అవసరమైన పూర్తిస్థాయి సదుపాయాలు, వైద్యనిపుణులు ఇప్పుడు హైదరాబాద్‌లో కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ శస్త్రచికిత్సలో సక్సెస్‌రేటు 95 శాతం వరకు ఉండి, దాదాపు అన్నీ విజయవంతమవుతూ అనేక మందికి మంచి ఆయుర్దాయాన్ని ఇస్తున్నాయి. శస్త్రచికిత్స తర్వాత దాదాపు 10, 15 ఏళ్ల వరకు దాదాపు ఎలాంటి సమస్యలూ ఎదురుకాకుండా జాగ్రత్తలు తీసుకోడానికి వీలవుతుంది. మీవారి విషయంలో వ్యాధి నిర్ధారణ జరిగిందంటున్నారు కాబట్టి ఇక మీరు ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీ డాక్టర్ల సూచన మేరకు చికిత్స చేయించండి.
డాక్టర్ ఎ. శశికిరణ్,
సీనియర్ నెఫ్రాలజిస్ట్ అండ్
కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ ఫిజీషియన్, యశోద హాస్పిటల్స్,
మలక్‌పేట్, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment