భవిష్యత్తు గురించి ఆలోచించనివారుండరు. రాబోయే రోజులు, వచ్చే ఏడాది, ఇంకో పదేళ్లపాటు.. రేపటి ఆనందకర జీవనం కోసం ఆశపడుతూనే ఉంటారు. కానీ, హైదరాబాద్ హిమాయత్‌నగర్‌లో ఉంటున్న ఐలా మమతను కలిస్తే ఈ రోజుకున్న విలువ ఏంటో తెలుస్తుంది. రెండు కిడ్నీలు చెడిపోయి, 22 ఏళ్లుగా డయాలసిస్ మీద ఆధారపడి జీవిస్తున్నారు మమత.
కష్టాలను అధిగమిస్తూ సొంతంగా మ్యాగజీన్ నడుపుతూ, కిడ్నీ రోగులకు మానసిక స్థైర్యం ఇస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ‘మీ నవ్వు చాలా బాగుందండి’ అని పలకరిస్తే.. రేపటి నవ్వు కూడా ఈ రోజే నవ్వేస్తాను. ఈ రోజును ఆనందంగా బతకడానికి ప్రయత్నిస్తాను’ అన్నారు.
‘ఇన్నేళ్లు కష్టాలన్నీ ఒక్కోటి అధిగమిస్తూ వచ్చాను. కానీ, ఇప్పుడు డయాలసిస్ చేయించుకోవడానికి కూడా ఆర్థికంగా లేక.. ఈ రోజు బతికితే చాలు అనుకుంటున్నాను’ అంటూ నవ్వు వెనకాల దాచుకున్న ఒక్కో వాస్తవాన్ని ఇలా కళ్లకు కట్టారు మమత.
‘‘నన్ను చూసి ఎవరు పలకరించినా ముందు నవ్వేస్తాను. ‘ఇంతబాధలోనూ నవ్వుతూ ఉంటావు’ అంటారు. కష్టం మరింత పరీక్ష పెట్టడానికే వస్తుందేమో అనిపిస్తుంటుంది. 22 ఏళ్ల క్రితం బాబు పుట్టినప్పుడు డెలివరీ తర్వాత యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చింది. ఆ ఇన్ఫెక్షన్ పాకి, రెండు కిడ్నీలూ చెడిపోయాయి. దీంతో రెండు కిడ్నీలను తొలగించారు. అప్పటినుంచి డయాలసిస్ తప్పనిసరైంది. మా వారికి ఉద్యోగం లేదు. ఊళ్లో ఉన్న తన తల్లిదండ్రులని చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇటు నా ఆరోగ్యపరిస్థితి ఏ మాత్రం బాగాలేదు. అమ్మ వెన్నుదన్నుగా ఉండటంతో బిడ్డ పెంపకం భారంగా అనిపించలేదు.
రాత మార్చుకున్నాను..
ఆర్థికంగా ఏమీ లేదు. ఆరోగ్యమూ లేదు. నా స్థితిని అప్పటి కలెక్టర్‌కు చెప్పాను. నా మాటతీరు చూసి, పుస్తకాలు రాయమన్నాడు. అలా ‘భారతీయ సంస్కృతి’ పేరుతో మ్యాగజీన్ పెట్టుకొని, ప్రకటనలు తెచ్చుకొని నాకంటూ ఓ చిన్న లోకాన్ని ఏర్పరుచుకున్నాను. పత్రిక ద్వారా నలుగురికి సాయం చేయగలిగాను. వారంలో మూడు రోజులు డయాలసిస్. నెలకు సరిపడా చేతినిండా పని. ఈ సమయంలోనే నాలాంటి డయాలసిస్ పేషెంట్ల కోసం ఓ ఎన్జీవోను ఏర్పాటు చేశాను. కిడ్నీ రోగులకు అవగాహన కార్యక్రమాల ఏర్పాటుతో పాటు, కౌన్సిలింగ్ ఇచ్చాను. ప్రభుత్వంతో పోరాడి, వేలాది మందికి ఉచిత డయాలసిస్ అవకాశం వచ్చేలా చేశాను.
మారిన రాత..
కరోనా టైమ్‌లో శారీరకంగా చాలా దెబ్బతిన్నాను. అసలే డయాలసిస్ పేషెంట్‌ను. దీనికితోడు కరోనా సోకింది. మ్యాగజీన్ ఆగిపోయింది. ఎన్జీవోలోని సభ్యులు కరోనా బారినపడి చాలామంది చనిపోయారు. సపోర్ట్‌గా ఉందనుకున్న అమ్మ మరణం... మానసికంగా బాగా కుంగిపోయాను. దీంతో చాలా ఒంటరిగా అనిపించింది. దాని నుంచి కోలుకుంటానన్న నమ్మకం కూడా కొన్నిరోజులపాటు లేదు. మా అబ్బాయి ‘ఎంతోమందికి కౌన్సెలింగ్ ఇచ్చావు. నువ్వు ఇలా ఉంటే ఎలా..’ అని ధైర్యం ఇచ్చాడు. మా అబ్బాయి ఫిల్మ్‌మేకింగ్ లో కోర్సు చేస్తున్నాడు. ఇంకా వాడి జీవితం సెట్ అవ్వాల్సి ఉంది.
ప్రాణం నిలబడాలంటే..
మ్యాగజీన్ నడిపించాలన్నా, చేపట్టిన ఆర్గనైజేషన్‌ను ముందుకుతీసుకువెళ్లాలన్నా మళ్లీ సున్నా నుంచి జీవితం మొదలుపెట్టాను. ఈ ఉగాదికి మ్యాగజీన్‌ను మళ్లీ ప్రారంభించాను. కానీ, ఆర్థిక లేమి కారణంగా నడపలేకపోతున్నాను. అంతకుముందున్న శక్తి ఇప్పుడు ఉండటం లేదు. హిమోగ్లోబిన్ సడెన్‌గా పడిపోతోంది. ఇన్నేళ్లుగా డయాలసిస్ వల్ల శరీరంలో అకస్మాత్తు గా మార్పులు వస్తుంటాయి. డయాలసిస్‌కు డబ్బుల్లేక ఎప్పుడు మానేస్తానో, ఈ ప్రాణం ఎప్పుడు పోతుందో.. తెలియదు. నా కొడుకు జీవితం ఏం అవుతుందో అని మనసులో ఆందోళనగా ఉంటుంది. ఎవరైనా సాయం అందిస్తే, ఇంకొంతమందికి నా పని ద్వారా సాయం అందించగలను’’ అని వివరించారు మమత.
నిన్నటి వరకు రేపటి గురించిన ఆలోచన లేకున్నా గుండెధైర్యంతో నిలదొక్కుకున్న మమత నేటి జీవనం కోసం చిరునవ్వు వెనుక దాగున్న విషాదాన్ని పరిచయం చేశారు. సాయమందించే మనసులు ఆమె చిరునవ్వును కాపాడతాయని ఆశిద్దాం.
– నిర్మలారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment