సాక్షి, హైదరాబాద్: మూత్రపిండాలు మానవ శరీరంలో చాలా కీలకమైన అవయవాలు. అవి సక్రమంగా పనిచేస్తేనే శరీరంలోని మిగతా అన్ని అవయవాలు సరిగ్గా ఉంటాయి. ఆరోగ్యంగా నాలుగు కాలాల పాటు జీవించగలడు. మూత్ర పిండాలు సరిగ్గా పనిచేయకపోతే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అయితే కిడ్నీ సమస్యలు ఉన్నట్టు తొలి దశలో అర్థం కాదు. ఎలాంటి లక్షణాలు కూడా బయటపడవు. దాదాపు 80 శాతంపైగా కిడ్నీలు పాడైన తర్వాతే చాలా మందికి అర్థం అవుతుంది.
అప్పటికే జరగాల్సిన అనర్థం జరిగిపోతుంది. కొందరిలో కిడ్నీ సమస్యలు ఉన్నాయని తెలిసిన రెండు మూడు వారాలకే మరణాలు సంభవించే ప్రమాదం ఉంది. కిడ్నీలు సరిగ్గా పనిచేయకపోతే శరీరంలో పేరుకుపోయే వ్యర్థ పదార్థాలను బయటకు వెళ్లిపోవు. దీంతో అవి కాస్తా విషపదార్థాలుగా మారి శరీరంలోని ఒక్కో అవయం దెబ్బతింటుంది. అలా ప్రాణాంతకంగా మారుతుంది. అందుకే కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎంతో ముఖ్యం.
వారికి అదొక్కటే మార్గం..
కిడ్నీ ఫెయిల్యూర్ రెండు రకాలుగా ఉంటుంది. కొందరికి తాత్కాలికంగా, మరికొందరు పూర్తిగా కిడ్నీలు పాడైపోతాయి. డీహైడ్రేషన్, పెయిన్ కిల్లర్స్ అతిగా వాడటం, ఇన్ఫెక్షన్లు, గుండెకు రక్త ప్రసరణ నిలిచిపోవడం తదితర కారణాల వల్ల కిడ్నీలు తాత్కాలికంగా పనిచేయవు. తాత్కాలిక కిడ్నీ ఫెయిల్యూర్‌కు కూడా డయాలసిస్ చేయాలి. అయితే శాశ్వత కిడ్నీ ఫెయిల్యూర్‌కు మాత్రం దీర్ఘకాలిక డయాలసిస్ ఒక్కటే మార్గం. డయాబెటిస్, బీపీ, ఆటోఇమ్యూన్ డిసీజ్, జన్యుపరమైన సమస్యల వల్ల మూత్రపిండాలు శాశ్వతంగా పాడవుతాయి.
డయాలసిస్ అంటే ఏంటి?
సాధారణంగా కిడ్నీలు రక్తంలోని వ్యర్థాలను వడపోస్తాయి. కిడ్నీలు 80 శాతం పాడయ్యే వరకు ఆ పనిని చక్కగా నిర్వర్తిస్తాయి. అప్పటివరకు ఎలాంటి లక్షణాలు బయటపడవు. అంతకుమించి పాడైతే మాత్రం కిడ్నీలు చేయాల్సిన పనులను చేయలేక మొరాయిస్తాయి. అలాంటి సమయంలో వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలి. ఇలాంటి వారికి డయాలసిస్ ప్రక్రియ వరప్రదాయిని అని చెప్పొచ్చు. డయాలసిస్ ప్రక్రియలో కిడ్నీలు చేయాల్సిన పనిని మెషీన్ సాయంతో రక్తాన్ని వడపోసి వ్యర్థాలను తొలగిస్తారు. హీమోడయాలసిస్ ప్రక్రియను వారానికి మూడు సార్లు చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ నాలుగు గంటల పాటు జరుగుతుంది.
ఆలస్యమైతే ఏమవుతుంది?
కిడ్నీలు పాడైన వారు నిరంతరం డయాలసిస్ చేయించుకోవాలి. డయాలసిస్ ఆలస్యమైతే రక్తంలో వ్యర్థ పదార్థాలు పేరుకుపోయి మిగతా అవయవాల్లో ఇన్ఫెక్షన్లు పెరుగుతాయి. ఈ విషయంలో కాస్త అలసత్వం వహించినా.. సమస్య మరింత జఠిలం కావచ్చు. కొద్ది రోజులు ఆగి చేయించుకుందామని నిర్లక్ష్యం వహిస్తే ప్రాణానికే ప్రమాదం ఉంటుంది. మూత్రం సరిగ్గానే వస్తోందని, ఆరోగ్యం బాగానే ఉందని ఆలస్యం చేసినా జరగాల్సిన నష్టం జరుగుతుంది. మూత్రపిండాలు మందకొడిగా పనిచేస్తాయి. నీటిని వడగట్టలేకపోవడంలో విఫలమవుతాయి. విషపదార్థాలు రక్తంలోనే ఉండిపోతాయి. కొన్నిసార్లు నీరు ఊపిరితిత్తుల్లోకి చేరుతుంది. దీనివల్ల ‘పల్మనరీ ఎడిమా’ అనే సమస్య ఏర్పడుతుంది. దీంతో శ్వాస తీసుకోవడంతో ఇబ్బందులు, ఆయాసం వస్తుంది. సమయానికి డయాలసిస్ చేయించుకునేవారు ఎక్కువ కాలం జీవించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
ఫిస్టులా చేయించుకోవాల్సిందే..
డయాలసిస్ కన్నా ముందు ఫిస్టులా అనే ప్రక్రియ తప్పనిసరి. ఈ పద్ధతిలో చేయి పైన ధమని, సిరాను ఫిస్టులా అనే లావు పాటి సూది(క్యాథటీర్) ద్వారా కలుపుతారు. డయాలసిస్ ప్రక్రియ చేసే సమయంలో ఫిస్టులా లేకపోవడం వల్లే చాలా వరకు రోగి ప్రాణాపాయ స్థితిలో వెళ్లి.. చనిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే డయాలసిస్ ముందు ఫిస్టులా వేయించుకోవడం చాలా ముఖ్యం అని డాక్టర్లు చెబుతున్నారు.
నీరు తీసుకోకపోవడం వల్లే..
చాలావరకు కిడ్నీ సమస్యలు పరిశుభ్రమైన నీరు తీసుకోకపోవడం వల్ల వస్తుంటాయి. ముఖ్యంగా నీళ్లలో ఉండే పాదరసం, సీసం, ఫ్లోరిన్ వంటి లోహాలు కిడ్నీలను పాడు చేస్తాయి. పారిశ్రామిక వాడల్లో ఉండే వారు తరచూ కిడ్నీ పరీక్షలు చేయించుకుంటే ముందుగానే సమస్యలను గుర్తించవచ్చు. దీంతో సరైన సమయంలో చికిత్స తీసుకుని ప్రాణాపాయస్థితి నుంచి బయటపడొచ్చు. సౌందర్య సాధనాల్లో ఉండే కెమికల్స్ కూడా కిడ్నీలు పాడయ్యేందుకు కారణం
అవుతాయి.
ఆహారం విషయంలో అపోహలొద్దు..
సాధారణంగా కిడ్నీ సమస్యలు ఉన్నప్పుడు మంచి ఆహారం తీసుకోవాలి. ఎలాంటి అపోహలకు తావివ్వకుండా వైద్యులు సూచించిన మేరకు సరైన ఆహారం తీసుకోవాలి. అప్పుడే శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. సరైన ఆహారం లేకపోతే ఎముకలు, కండరాలు, రక్తనాళాలు, నరాలు బలహీనమై సమస్య మరింత జఠిలమవుతుంది. అది ప్రాణాపాయస్థితికి కూడా దారి తీయొచ్చు. డయాలసిస్ ప్రక్రియ ఇప్పుడు దాదాపు అన్ని ప్రాంతాల్లో అందుబాటులో ఉంది. ఎలాంటి భయం, అనుమానాలు, అపోహలు లేకుండా రెగ్యులర్‌గా డయాలసిస్ చేయించుకుంటే ప్రాణాపాయస్థితి నుంచి బయటపడొచ్చని మూత్రపిండాల నిపుణులు చెబుతున్నారు.
డయాబెటిస్, హైబీపీ కూడా కారణమే..
డయాబెటిస్ వల్ల కూడా కిడ్నీలు పాడవుతున్నాయి. డయాబెటిస్ సోకిన తర్వాత సరైన శ్రద్ధ తీసుకోకపోవడం వల్ల పదేళ్లలో కిడ్నీలు పాడవుతుంటాయి. 30– 40 ఏళ్ల వయసు వారు ఎక్కువగా ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఇక అధిక రక్తపోటు ఉన్న వారిలో కూడా కిడ్నీలు సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. బీపీ ఉన్న వారు కిడ్నీ సంబంధిత పరీక్షలు కచి్చతంగా చేయించుకోవాలి. పాలీసిస్టిక్ కిడ్నీ డిసీజ్ వంశపారంపర్యంగా వస్తుంది. ప్రతి నలుగైదుగురిలో ఒకరిలో వస్తుంది. ఇంట్లో ఎవరికైనా ఇలాంటి సమస్య ఉంటే మిగిలిన వారు కూడా పరీక్షలు చేయించుకుంటే ముందుగానే సమస్యలు గుర్తించి సరైన చికిత్స తీసుకోవచ్చు.
పెయిన్ కిల్లర్స్ వల్ల..
చిన్న నొప్పి వచి్చనా ఇటీవల పెయిన్ కిల్లర్ మందులు వాడటం ఎక్కువైంది. అలాగే కడుపులో మంట తగ్గించే మందులు, యాంటీ బయాటిక్స్ వంటి మందులను ఎక్కువగా వాడటం వల్ల కిడ్నీ సమస్యలు వస్తున్నాయి. కిడ్నీల్లో రాళ్లు వస్తే సరైన చికిత్స తీసుకోకపోవడం, వాటిని తొలగించుకోకపోవడంతో ఇన్ఫెక్షన్లు పెరుగుతాయి. దీంతో కిడ్నీలు పాడైపోతాయి. 60 ఏళ్లు దాటిన వారిలో ఎక్కువగా ఇన్ఫెక్షన్ల వల్ల, పెయిన్ కిల్లర్ల, ఎసిడిటీ మందులు వాడకం వల్ల కిడ్నీలు చెడిపోతుంటాయి. కొందరిలో క్యాన్సర్ సోకిన వారిలో కూడా కిడ్నీలు పాడయ్యే అవకాశం ఉంటుంది. మైలోమా, బోన్‌మ్యారో, ల్యుకేమియా కొన్ని రకాల క్యాన్సర్లు కిడ్నీ పరీక్షల ద్వారా కూడా తెలుస్తుంది.
కిడ్నీ సమస్యలు ఎందుకు వస్తాయి?
చిన్నపిల్లల్లో కిడ్నీ సమస్యలు పుట్టుకతోనే వస్తున్నాయి. కడుపులో ఉండగానే స్కానింగ్‌ల ద్వారా ఈ విషయాలను గుర్తిస్తున్నారు. కిడ్నీలు సరిగ్గా ఎదగకపోవడం, మూత్ర నాళాలు సరిగ్గా అభివృద్ధి చెందకపోవడం, ఫిల్టర్లు పాడైపోవడం వల్ల చిన్న వయసులోనే డయాలసిస్ అవసరం పడుతోంది. ఈ పరిస్థితి జన్యుపరమైన లోపాల వల్ల వస్తుంటుంది. ఈ సమస్యలు ఉన్న పిల్లలు వాడే మందుల వల్ల కూడా సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉంది. వీరి శరీరాల్లో రక్త నాళాలు సరిగ్గా అభివృద్ధి చెందకపోవడం వల్ల వారికి డయాలసిస్ ప్రక్రియ చేయడం కాస్త సంక్షిష్టంగా ఉంటుంది. యువతీ యువకుల్లో కిడ్నీలో రాళ్లు, అనవసరమైన మందులు వాడటం వల్ల కిడ్నీలు పాడవుతున్నాయి.
అలసత్వం వద్దు..
డయాలసిస్ చేయించుకోవడంలో అస్సలు అలసత్వం వద్దు. వారానికి మూడుసార్లు కచి్చతంగా చేయించుకుంటే ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉంటారు. రేపు, మాపు అంటూ నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదం. కుటుంబంలో ఎవరికైనా కిడ్నీ సమస్యలు ఉంటే అందరూ పరీక్షలు చేయించుకోవడం మంచిది. దీంతో ప్రాథమిక దశలోనే చికిత్స తీసుకోవచ్చు. ముఖ్యంగా పారిశ్రామికవాడల్లో ఉండేవారు కిడ్నీ పరీక్షలు చేయించుకోవాలి. సౌందర్య సాధనాల వల్ల కూడా కిడ్నీలు పాడయ్యే ప్రమాదం ఉంది.
– శ్రీభూషణ్ రాజు, నెఫ్రాలజీ విభాగం అధిపతి, నిమ్స్
Comments
Please login to add a commentAdd a comment