అయ్యో ఎంత కష్టం !
*నిరుపేదకు పెద్దజబ్చు
*దాతలూ దయ చూపండి
అతనో నిరుపేద యువకుడు. క్షౌరవృత్తితో వచ్చే ఆదాయంతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. ఇంతలో అనారోగ్యం బారినపడ్డాడు. పరీక్షించిన వైద్యులు రెండు కిడ్నీలూ పాడయ్యాయనే పిడుగులాంటి వార్త చెప్పారు. వైద్యానికి లక్షల్లో ఖర్చవుతుందన్నారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. తమ బిడ్డను ఆదుకునేందుకు దాతలు దయ చూపాలని వేడుకుంటున్నారు.
పుత్తూరు, న్యూస్‌లైన్: పుత్తూరు పట్టణం గేటుపుత్తూరులోని గుండ్లపుత్తూరుకు చెందిన రాధమ్మ, చక్రపాణిల రెండవ కుమారుడు వెంకటేశ్వర్లు(33). ఇతనికి ఆరేళ్ల క్రితం వివాహమైంది. స్థానికంగా ఉన్న క్షౌర దుకాణంలో వెంకటేశ్వర్లు పనిచేస్తున్నాడు. వచ్చే అంతోఇంతో ఆదాయంతో తల్లి, భార్యను పోషించుకుంటున్నాడు. ఆరు నెలల క్రితం కాళ్లు వాయడంతో స్థానికంగా ఓ ప్రయివేటు క్లినిక్‌లో చూపించుకున్నాడు. అక్కడి వైద్యుల సలహా మేరకు తిరుపతి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకున్నాడు. వెంకటేశ్వర్లుకు రెండు కిడ్నీలూ పాడైనట్టు వైద్య పరీక్షల్లో తేలింది. అమ్మ రాధమ్మ, అన్న రాజేంద్రబాబు పలు ఆస్పత్రుల్లో వెంకటేశ్వర్లుకు వైద్యం చేయించారు.
సుమారు 50 వేల రూపాయలు అప్పు మిగిలినా పరిస్థితిలో మార్పులేదు. ఇక స్థోమత లేకపోవడంతో తిరుపతి స్విమ్స్‌లో ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా వెంకటేశ్వర్లును చేర్పించారు. అక్కడ నెల రోజులు డయాలసిస్ చేసిన వైద్యులు తర్వాత ఇంటికి పంపేశారు. వెంకటేశ్వర్లుకు వారంలో రెండు సార్లు ప్రయివేటు ఆస్పత్రుల్లో డయాలసిస్ చేయిస్తున్నారు. ఇందుకు కోసం ప్రతి వారం రూ.4 వేలు ఖర్చవుతోంది. ఈ మొత్తాన్ని భరించే శక్తి ఆ కుటుంబానికి లేదు. అప్పోసప్పో చేసి నెట్టుకొస్తున్నారు.
వారు మాట్లాడుతూ రెండు కిడ్నీల మార్పిడికి రూ.14 లక్షల మేర ఖర్చవుతుందని వైద్యులు తెలిపారన్నారు. దాతలు దయతలిస్తే తమ బిడ్డ మళ్లీ ఆరోగ్యవంతుడు అవుతాడని చెప్పారు. దాతలు 8500951242 నంబరులో సంప్రదించాలని కోరారు. అలాగే ఎ.రాజేంద్రబాబు, ఎస్‌బీఐ బ్యాంకు ఖాతా(32470026300) లో సొమ్ము జమ చేయవచ్చని తెలిపారు.