కిడ్నీలు జర భద్రం
పెరుగుతున్న కిడ్నీ వ్యాధిగ్రస్తులు
డయాబెటిక్, హైపర్ టెన్షన్ కారణం
జిల్లాలో 500 మందికి పైగా ట్రాన్స్‌ప్లాంటేషన్ అవసరం
శరీరంలో కిడ్నీలదే కీలక భూమిక
మానవ శరీరంలో మూత్రపిండాలు అనేక ముఖ్య విధులు నిర్వర్తించే కర్మాగారాలు. ఇవి శరీరం నుంచి వ్యర్థ పదార్థాలు/ మాదకద్రవ్యాలను తొలగించి శరీరంలో ద్రవ పదార్థాల సమతుల్యతను కాపాడతాయి. రక్త పీడనాన్ని క్రమ బద్ధీకరించి, ఆరోగ్య వంతమైన గట్టి ఎముకల తయారీకి, ఎర్రరక్త కణాల ఉత్పత్తికి సహకరిస్తాయి. ఇంత ముఖ్య భూమిక పోషించే కిడ్నీలపై అప్రమత్తత ఎంతో అవసరం.
మూత్రపిండ వ్యాధులకు కారణాలివే
మూత్రపిండాలు దెబ్బతినేందుకు కొన్ని సాధారణ కారణాలు ఉన్నాయి. మధుమేహం, అధిక రక్తపోటు, అధిక బరువు, మూత్ర విసర్జక మార్గ వాధులు, మూత్రకోశవ్యాధులు, మూత్ర పిండాల్లో ఏర్పడే రాళ్లు, గ్లోమోరంలో నోఫ్రోసిన్ (మూత్రపిండాలలో మూత్రాన్ని వడపోసే సూక్ష్మ నిర్మాణాల వాపు), అను వంశీకంగా సంక్రమించే మూత్రపిండ సంబంధిత వ్యాధి, మాదక ద్రవ్యాలు, విషపదార్థాలు, మలేరియా, నొప్పి నివారణ మందులు, నాటు మందులు, శాస్త్రీయం కాని మందులు అధికంగా వాడే వారికి కిడ్నీ వాధులు సంక్రమించే అవకాశం ఉంది. వయస్సు 50 సంవత్సరాలు పైబడిన వారిలో ధూమపానం వల్ల కూడా కిడ్నీలు దెబ్బతింటాయి.
హెచ్చరికలుగా కనిపించే లక్షణాలు
సాధారణంగా మూత్రపిండ వ్యాధి రెండింటికీ సోకుతుంది. రెండు కిడ్నీలు పాడైన దశలో రక్తపోటు అధికంగా ఉండటం, మూత్రంలో రక్తం, ప్రొటీన్లను నష్టపోవడం, రక్తహీనత, ఆయాసం, ఎక్కువ సార్లు మూత్ర విసర్జన జరుపుట (ముఖ్యంగా రాత్రి వేళల్లో), మూత్ర విసర్జన కష్టంగా ఉండటం, మూత్ర విసర్జన సమయంలో నొప్పి కలుగుట, ముఖ్యంగా చిన్నపిల్లల్లో కాళ్లు, చేతులు వాపులు, కళ్లు చుట్లూ ఉబ్బరం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
వీరిలో కిడ్నీ వ్యాధులు సోకే అవకాశం ఎక్కువ
వృద్ధాప్యంలో ఉన్న వారికి, మధుమేహ వ్యాధి అదుపులో లేని వారికి, రక్తపోటు క్రమబద్ధీకరణ కానివారికి, కుటుంబంలో ఎవరైనా మూత్రపిండాల వ్యాధితో బాధపడే వారు ఉంటే మిగిలిన వారికి కూడా వ్యాధులు సోకే అవకాశం ఉంటుంది. అలాంటి వారు తరచూ వైద్య పరీక్షలు చేయించుకోవడం మంచింది.
అందుబాటులో ఆధునిక వైద్యం
మూత్రపిండాల వ్యాధులకు అత్యాధునిక వైద్యం అందుబాటులో ఉంది. హోమ్ డయాలసిస్, డయాలసిస్, కిడ్నీ సంబంధిత లాపరోస్కోపిక్ ఆపరేషన్లు, కిడ్నీ మార్పిడి వంటి వైద్య విధానాలు అందుబాటులోకి వచ్చాయి. మధుమేహం, హైపర్ టెన్షన్ రోగులు వ్యాధి లక్షణాలను గుర్తించి తొలిదశలో చికిత్స పొందితే మంచిది. ఆరోగ్యకరమైన కిడ్నీలు ఆనందమయ జీవితానికి తొలిమొట్టుగా గ్రహించి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు తరచూ కిడ్నీ పరీక్షలు చేయించుకుంటూ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి.
- డాక్టర్ ఎం.సాయికృష్ణ, మూత్రపిండ వ్యాధి నిపుణులు
నివారణ సాధ్యం, శ్రేష్టం
కిడ్నీ వ్యాధికి గురవుతున్న వారిలో 50 శాతం మంది మధుమేహ రోగులే. మైక్రో ఆల్బుమిన్ యూరియా అనేది సుగర్ సంబంధిత కిడ్నీ వ్యాధికి ముందస్తు సూచికే కాక, రాబోయే కంటి రెటీనా, గుండె సమస్యలకు కూడా ప్రమాద ఘంటిక. శుభవార్త ఏమంటే ఏసీఈ, ఏఆర్‌బీ వంటి ఆధునిక మందులతోపాటు, ఆహారంలో ఉప్పు, మాంసకృత్తుల వాడకం తగ్గించడం, మధుమేహం, రక్తపోటును అదుపుచేసుకోవడం, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడం ద్వారా కిడ్నీల సమస్యలను నివారించవచ్చు. దీర్ఘకాలిక సుగర్ శాతం(ెహ చ్‌బీఏ1సీ) వార్షిక సగటు ప్రతి ఒక శాతం తగ్గుదలతో సుగర్ సంబంధిత కిడ్నీ సమస్యలను 37 శాతం వరకూ నివారించగలిగి, పూర్తి జీవితం సంపూర్ణ ఆరోగ్యంతో జీవించొచ్చు.
- డాక్టర్ ఎం.శ్రీకాంత్, డయాబెటాలజిస్ట్