బాబుకు పొత్తికడుపులో నొప్పి, మూత్రంలో ఎరుపు | The Problem with your Baby is Called Hemchuria | Sakshi
Sakshi News home page

బాబుకు పొత్తికడుపులో నొప్పి, మూత్రంలో ఎరుపు

Published Fri, May 17 2019 12:31 AM | Last Updated on Fri, May 17 2019 12:31 AM

The Problem with your Baby is Called Hemchuria - Sakshi

మా బాబుకి తొమ్మిదేళ్లు. మూడు నెలల క్రితం బాబుకి మూత్రంలో రక్తం పడింది. అల్ట్రాసౌండ్‌ స్కాన్, ఎంసీయూ... ఇలా కొన్ని టెస్ట్‌లు చేశారు. రిపోర్ట్స్‌ నార్మల్‌ అనే వచ్చాయి. మూత్రంలో ఇన్‌ఫెక్షన్‌ అని యాంటిబయటిక్స్‌ రాశారు. అయితే మూత్రం పోసేటప్పుడు పొత్తికడుపులో నొప్పిగా ఉందంటూ బాబు మళ్లీ బాధ పడుతున్నాడు. పదిరోజుల కిందట మళ్లీ మూత్రంలో రక్తం పడింది. డాక్టర్‌ దగ్గరకెళితే మళ్లీ పరీక్షలు చేశారు. అవి కూడా నార్మలే. అసలు మా బాబుకి ఏమై ఉంటుంది, రక్తం ఎందుకు పడుతోంది? 

మీరు చెప్పిన లక్షణాలను బట్టి మీ అబ్బాయికి ఉన్న కండిషన్‌ను హిమెచ్యూరియా అంటారు. ఇది చాలా సాధరణమైన సమస్య. ఈ లక్షణం చూడటానికి భయపెట్టేదిగా అనిపించినా చాలా వరకూ ఎలాంటి ప్రమాదం ఉండదు. కొంతమందిలో మాత్రమే ఈ లక్షణం సీరియస్‌ సమస్య ఉండటానికి సూచన. 

పిల్లల యూరిన్‌లో రక్తం కనబడానికి గల కొన్ని కారణాలు: 
మూత్రనాళంలో రాళ్లు, రక్తానికి సంబంధించిన సికిల్‌ సెల్‌ డిసీజ్, కోయాగ్యులోపతి వంటి హెమటలాజికల్‌ సమస్యలు. వైరల్‌ / బ్యాక్టీరియల్, మూత్రనాళంలో ఇన్ఫెక్షన్స్, మూత్రనాళంలో ఏవైనా అడ్డంకులు, కొల్లాజెన్‌ వ్యాస్క్యులార్‌ డిసీజ్, వ్యాస్క్యులైటిస్, పీసీజీఎన్, ఐజీఏ నెఫ్రోపతి వంటి  ఇమ్యున్‌లాజికల్‌ సమస్యలు, పుట్టుకతోనే మూత్రపిండాల్లో లోపాలు ఉండటం వల్ల పిల్లలు మూత్రవిసర్జన చేసే సమయంలో రక్తం కనిపించవచ్చు. ఇక పిల్లల్లో అన్నిసార్లూ కంటికి కనబడేంత రక్తం రాకపోవచ్చు. అందుకే దీన్ని తెలుసుకోవాలంటే మైక్రోస్కోపిక్, కెమికల్‌ పరీక్షలు అవసరమవుతాయి. మీ అబ్బాయికి చేసిన అన్ని పరీక్షల్లో నార్మల్‌ అనే రిపోర్టు వచ్చింది కాబట్టి యూరినరీ ఇన్ఫెక్షన్, హైపర్‌ కాల్సీ యూరియా అంటే మూత్రంలో అధికంగా కాల్షియం ఉండటం లేదా రక్తానికి సంబంధించిన సమస్యలతో పాటు థిన్‌ బేస్‌మెంట్‌ మెంబ్రేన్‌ డిసీజ్, ఐజీఏ నెఫ్రోపతి వంటి సమస్యలు ఉన్నాయేమో తెలుసుకోవడం ప్రధానం.

కొన్ని సందర్భాల్లో ఇటువంటి సమస్యలు కొన్ని జన్యుపరంగా వస్తుంటాయి.  మీ అబ్బాయికి మూడు నుంచి ఆరు నెలలకోసారి సాధారణ మూత్రపరీక్షలతో పాటు  యూరిన్‌లో ప్రొటీన్ల శాతం, రక్త కణాల మార్ఫాలజీ, క్రియాటినిన్‌ లెవెల్స్‌ వంటి పరీక్షలు తరచూ చేయిస్తుండటం ముఖ్యం. బాబుకి పొత్తికడుపులో నొప్పి వస్తుందంటున్నారు కాబట్టి ఇది యూరినరీ ట్రాక్ట్‌ ఇన్‌ఫెక్షన్‌ వల్ల అయి ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. అలాంటప్పుడు యాంటీబయాటిక్స్‌తో చికిత్స అవసరం. అయితే ఈ సమస్య కిడ్నీ వల్లగాని, జన్యుపరంగా గాని ఉత్పన్నమవుతున్నట్టు అనిపిస్తే బయాప్సీ చేయడం కూడా చాలా ముఖ్యం. మీ అబ్బాయికి రొటీన్‌ పరీక్షలు నార్మల్‌గా ఉన్నాయని చెప్పారు కాబట్టి, పైన చెప్పిన విషయాలను మీ డాక్టర్‌తో మరోసారి చర్చించి తగిన సలహా, చికిత్స తీసుకోండి.

రోజుల పాప... తలలో తెల్ల వెంట్రుకలు 

మాకు కొద్దిరోజుల క్రితం పాప పుట్టింది. పాపకు తలలో కొంత మేర వెంట్రుకలు తెల్లగా ఉన్నాయి. ఇదేమైనా భవిష్యత్తులో ల్యూకోడెర్మా వంటి జబ్బుకు దారితీసే ప్రమాదం ఉందా? 

మీ పాపకు ఉన్న కండిషన్‌ (లోకలైజ్‌డ్‌ ప్యాచ్‌ ఆఫ్‌ వైట్‌ హెయిర్‌)ను పోలియోసిస్‌ అంటారు. సాధారణంగా ఇది తల ముందు భాగంలో అంటే నుదుటిపై భాగంలో కనిపిస్తుంటుంది. అయితే మరెక్కడైనా కూడా వచ్చేందుకు అవకాశం ఉంది. ఇలా ఉందంటే అది ప్రతీసారీ తప్పనిసరిగా ఏదో రుగ్మతకు సూచిక కానక్కర్లేదు. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం కొన్ని జన్యుపరమైన సమస్యలకు సూచన కావచ్చు. చర్మంలోని పిగ్మెంట్‌లలో మార్పుల వల్ల కూడా రావచ్చు. కంట్లో పిగ్మెంట్‌కు సంబంధించిన ఏవైనా మార్పులు ఉన్నాయేమో తెలుసుకోవడం చాలా ముఖ్యం.

పిల్లల్లో ఏదైనా హార్మోనల్‌ సమస్యలు (అంటే థైరాయిడ్, జననేంద్రియాలకు సంబంధించినవి) ఉండటానికి సూచన కావచ్చు. ఇలాంటి అసోసియేటెడ్‌ సమస్యలేవీ లేకపోతే మీ పాపకు ఉన్న ఈ లక్షణం... ల్యూకోడెర్మా లాంటి సమస్యకు దారితీసే అవకాశం లేదు. పాపను ఒక్కసారి పీడియాట్రీషియన్‌కు చూపించండి. మీరు రాసినదాన్ని బట్టి పాపకు తక్షణ చికిత్స ఏదీ అవసరం లేదు. మీరూ ఈ విషయంలో ఆందోళన పడకుండా ఒకసారి డాక్టర్‌ను కలిసి ఇతరత్రా ఏ సమస్యలూ లేవని నిర్ధరించుకొని నిశ్చింతగానే ఉండండి.

పాపకు తలలో ర్యాష్‌... పరిష్కారం చెప్పండి

మా పాపకు ఆరు నెలలు. తల మీద విపరీతమైన ర్యాష్‌తో పాటు ఇన్ఫెక్షన్‌ వచ్చింది. మా డాక్టర్‌గారికి చూపించాం. మొదట తగ్గిందిగానీ, కొన్నాళ్లకు మళ్లీ  వచ్చింది. పాపకు తలలోని కొన్నిప్రాంతాల్లో జుట్టు సరిగా రావడం లేదు. మా పాప సమస్యకు పరిష్కారం చెప్పండి. ఇది భవిష్యత్తులో రాబోయే సమస్యలకు ఏదైనా సూచనా? 

మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీ పాపకు మాడు (స్కాల్ప్‌) భాగంలో చర్మం మీద ర్యాష్‌ వచ్చినట్లుగా, కొద్దిగా సూపర్‌ యాడ్‌ ఇన్ఫెక్షన్‌ కూడా అయినట్లుగా అనిపిస్తోంది. ఈ కండిషన్‌ను వైద్య పరిభాషలో సెబోరిక్‌ డర్మటైటిస్‌ అంటారు. ఇది కాస్త దీర్ఘకాలికంగా కనిపించే సమస్యగా చెప్పవచ్చు. దీన్ని ప్రధానంగా నెలల పిల్లల్లో, యుక్తవయసుకు వచ్చిన పిల్లల్లో కూడా చూస్తుంటాం. ఈ సమస్య ఉన్న పిల్లలకు మాడు (స్కాల్ప్‌)పైన పొరల్లా ఊడటం, అలాగే కొన్నిసార్లు తలంతా అంటుకుపోయినట్లుగా ఉండటం, కొన్ని సందర్భాల్లో మాడుపై పొర ఊడుతున్నట్లుగా కనిపిస్తుంటుంది. ఇది రావడానికి ఇదమిత్థంగా కారణం చెప్పలేకపోయినప్పటికీ... కొన్నిసార్లు ఎమ్‌.

పర్ఫూరా అనే క్రిమి కారణం కావచ్చని కొంతవరకు చెప్పుకోవచ్చు. చిన్నపిల్లల్లో... అందునా ముఖ్యంగా నెల నుంచి ఏడాది వయసు ఉండే పిల్లల్లో ఈ సమస్యను మరీ ఎక్కువగా చూస్తుంటాం. కొన్నిసార్లు ఈ ర్యాష్‌ ముఖం మీదకు, మెడ వెనకభాగానికి, చెవుల వరకు వ్యాపిస్తూ ఉండవచ్చు. ఇది వచ్చిన పిల్లల్లో పై లక్షణాలతో పాటు కొందరిలో నీళ్ల విరేచనాలు (డయేరియా) లేదా నిమోనియా వంటి ఇన్ఫెక్షన్స్‌ తరచూ వస్తుంటే దాన్ని ఇమ్యూనో డెఫిషియెన్సీ డిసీజ్‌కు సూచికగా చెప్పవచ్చు. అలాగే కొన్ని సందర్భాల్లో ఇతర కండిషన్స్‌... అంటే అటోపిక్‌ డర్మటైటిస్, సోరియాసిస్‌ వంటి స్కిన్‌ డిజార్డర్స్‌ కూడా ఇదేవిధంగా కనిపించవచ్చు. 

ఇక చికిత్స విషయానికి వస్తే ఈ సమస్య ఉన్నవారికి యాంటీసెబోరిక్‌ (సెలీనియం, సెల్సిలిక్‌ యాసిడ్, టార్‌) షాంపూలతో క్రమం తప్పకుండా తలస్నానం చేయిస్తుండటం, తక్కువ మోతాదులో స్టెరాయిడ్స్‌ ఉన్న కీమ్స్‌ తలకు పట్టించడం, ఇమ్యూనోమాడ్యులేటర్స్‌ వంటి మందుల వల్ల తప్పనిసరిగా వీళ్లకు నయమవుతుంది. అలాగే ఈ సమస్య ఉన్న భాగాన్ని తడిబట్టతో తరచూ అద్దుతూ ఉండటం చాలా ముఖ్యం. ఇదేమీ భవిష్యత్తు వ్యాధులకు సూచిక కాదు. మీరు ఒకసారి మీ పిల్లల డాక్టర్‌ను లేదా డర్మటాలజిస్ట్‌ను సంప్రదించి, తగిన చికిత్స తీసుకోండి. ఈ సమస్య తప్పక తగ్గిపోతుంది. 

డా. రమేశ్‌బాబు దాసరి సీనియర్‌ పీడియాట్రీషియన్,
రోహన్‌ హాస్పిటల్స్, విజయనగర్‌ కాలనీ, హైదరాబాద్‌

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement