
రాలిపోయే పూలతో రాగాలు..
సమాజానికి మనవంతుగా ఏం చేద్దాం?
ఈ ప్రశ్న వేసి ఊరుకోవడం లేదు అల్లం పాండురంగారావు.
తన కళ్లను దానం చేస్తానని ప్రతిజ్ఞ చేశారు... అంతటితో ఆగలేదు,
దేశమంతా తిరిగి 60 వేల మంది చేత ప్రతిజ్ఞ చేయించారు.
ప్రతిజ్ఞతో ఆగిపోవడం లేదు...
ఇప్పటి దాకా 69 మంది చేత కళ్లను దానం చేయించారు.
ఈ మహాయజ్ఞానికి ఆచరణ తండ్రి వెంకటేశ్వరరావు కళ్లతోనే ప్రారంభించారు.
‘జీవించండి... జీవితాన్నివ్వండి’ అంటూ అవయవదానం ఆవశ్యకత తెలియచేస్తున్నారు హైదరాబాద్ వాస్తవ్యుడైన ఈ 61 ఏళ్ళ ఉద్యమశీలి.
మూత్రపిండాలు, కళ్లు, గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, క్లోమం, చర్మం... ఈ ఏడు భాగాలను దానం చేయవచ్చు.
బ్రెయిన్‌డెడ్ కేసుల్లో పేషెంటు మిగిలిన భాగాలన్నీ బాగుంటాయి. వాటిని మరొకరికి అమరుస్తారు.
చిన్ననాటి స్నేహితులు, సన్నిహితులు, పరిచయస్థులు ఎవరు కనిపించినా ‘బాగున్నారా’ అని పలకరిస్తాం. అల్లం పాండురంగారావు మాత్రం దాంతోపాటు ‘మీరు రక్తదానం చేస్తున్నారా, అవయవదానానికి వాగ్దానం చేశారా’ అని కూడా అడుగుతారు. ‘‘అవునా? అంటే నిజమే మరి, నా ఉద్యమమే అది! ఎక్కడ నలుగురు కలిసినా నా ల్యాప్‌టాప్‌లో పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ చూపిస్తాను. నేత్రదానం గురించి ఎల్‌వీ ప్రసాద్ సంస్థ శిక్షణ ఇచ్చింది. సమాచారం అందుకున్న వెంటనే టీమ్ వెళ్లడం, కార్నియా సేకరణ నుంచి తిరిగి మరో వ్యక్తికి అమర్చడం వంటివన్నీ బొమ్మలతో ప్రదర్శిస్తాను. ఇప్పుడు అవయవదానం గురించిన సమాచారం సేకరించి ప్రోగ్రాం తయారు చేసుకున్నాను’’ అంటారాయన.
బూడిదపాలు చేయద్దు!
‘‘దేశంలో పాతిక లక్షల మంది చూపులేక బాధపడుతుంటే బంగారంలాంటి కళ్లను బూడిదపాలు చేయడానికి మనసెలా ఒప్పుతోంది’’ అని ప్రశ్నిస్తారు పాండురంగారావు. ‘‘దేశ నిర్మాణంలో భాగం కావాల్సిన యువత అర్ధంతరంగా జీవితాన్ని ముగించడం మనసును కలచి వేస్తుంటుంది. జీవించే అవకాశం లేని వ్యక్తి అవయవాలతో మరో నలుగురికి ప్రాణం పోయ వచ్చు. అది దాత ఆత్మీయులకు, గ్రహీతకు, గ్రహీత ఆత్మీయులకూ సంతోషమే. మనవాళ్లు ఫలానా వ్యక్తిలో జీవిస్తున్నారని తృప్తి చెందుతారు. అలాగే దాత అవయవాలతో ఆరోగ్యవంతులైన వాళ్లు ఆ కృతజ్ఞతతో మంచి గుణాలను అలవరుచుకుని జీవితం గడుపుతారు’’ అంటారు పాండురంగారావు.
నేపథ్యం ఇదీ!: సామాజిక సేవను ప్రవృత్తిగా కాక ప్రధాన కర్తవ్యంగా మలుచుకోవడానికి దారి తీసిన పరిస్థితులను ఆయన ఇలా వివరించారు... ‘‘మా నాన్నది చిత్తూరు. సింగరేణి కాలరీస్‌లో ఉద్యోగరీత్యా బెల్లంపల్లిలో స్థిరపడ్డారాయన. అయితే అక్కడ మా చదువుకు అసౌకర్యంగా ఉండడంతో కొండపల్లిలో మా మేనత్త దగ్గర పెరిగాను. శేరిలింగంపల్లి నుంచి నా సామాజికోద్యమాన్ని కొనసాగిస్తున్నాను. బిహెచ్‌ఈఎల్ (భెల్)లో సీనియర్ డిప్యూటీ జనరల్ మేనేజర్‌గా రిటైరయ్యా.
మా కుటుంబ నేపథ్యం, బాధ్యతలే నన్ను సేవారంగం వైపు నడిపించాయి. నాకు నలుగురు అక్కచెల్లెళ్లు, ఒక తమ్ముడు. వీరందరికీ చదువు చెప్పించడం, పెళ్లి చేయడం నాన్నగారికి తలకు మించిన భారమే. దాంతో పెద్ద కొడుకుగా ఆ బాధ్యతల్లో కొన్ని నావయ్యాయి. కడుపులో ఆకలి కళ్లలో కనిపిస్తుంటే, చేతిలో రూపాయి లేక, అడుక్కోవడానికి అభిమానం అడ్డువచ్చి మౌనంగా ఆకలి బాధను భరిస్తున్న వాళ్లను చూసినప్పుడు బాధగా అనిపించేది. అప్పట్లో నేనేమీ ధనవంతుణ్ని కాకపోయినా జేబులో ఉన్న పదిరూపాయల్లో రెండు రూపాయలిచ్చి అన్నం తినమనేవాణ్ని. భెల్ ఉద్యోగులతో పాటు నేనూ లయన్స్ క్లబ్‌లో చేరాను, 53 సార్లు రక్తదానం చేశాను. లయన్స్ క్లబ్ నిర్వహించిన కంటి ఆరోగ్య శిబిరానికి డాక్టర్ శివారెడ్డి వచ్చారు. ‘నేత్రదానం గురించి సమాజంలో చైతన్యం తీసుకురావాలి. ఆ పని మీద దృష్టిపెట్ట’మని సూచించారాయన. అలా నేను ఈ ఉద్యమం మొదలుపెట్టా. కొన్నాళ్లకు నాన్నగారు పోయారు. తొలిసారి మా నాన్న కళ్లే దానం చేశా’’ అంటూ గతంలోకి వెళ్లారాయన.
విద్యావంతులు చైతన్యం కావాలి!
అవయవదానం చేయడం రక్తదానం, నేత్రదానం చేసినంత సులభం కాదు. పెద్ద ఆసుపత్రుల్లోనే సాధ్యమవుతుంది. అది కూడా రెండు-మూడు గంటల్లోనే చేయాలి. ‘‘గడచిన డిసెంబర్‌లో ఒక కాలేయమార్పిడి చేయించాం. మరో ఇద్దరి నుంచి అవయవాలను సేకరించాం. ప్రస్తుతానికి అవయవదానాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నది నిమ్స్, మోహన్ ఫౌండేషన్ మాత్రమే. ఇది రక్తదానంలా విస్తరించలేదింకా. చదువుకున్న వాళ్లు ఉదారంగా ఆలోచిస్తే ఇది అట్టడుగు వారికి చేరుతుంది’’ అంటారాయన. ‘‘ఆ మధ్య అంధబాలురకు చదరంగం నేర్పించి, మామూలు వ్యక్తులతో బహిరంగ పోటీ పెట్టాం. ఆ పోటీలో గెలిచిన విద్యార్థుల ‘మాకు చూపునివ్వండి’ అనే విన్నపానికి ద్రవించిన కొందరు అక్కడే అవయవ దాన ప్రతిజ్ఞ చేశారు’’ అని చెప్పుకొచ్చారు. కుటుంబ బాధ్యత నెరవేర్చడానికి పెళ్లిని త్యాగం చేసిన ఆయన బిహెచ్‌ఈఎల్, రామచంద్రాపురంలో వృద్ధాశ్రమం నడుపుతున్నారు. పదవీవిరమణ అనంతరం వచ్చిన రూ. 13 లక్షలను విరాళంగా ఇచ్చిన ఆయన ప్రతి ఆదివారం ఆ ఆశ్రమంలో వృద్ధులతో గడుపుతారు. సొంత మేలు కట్టిపెట్టి పరుల మేలు తలపెట్టడానికి పాండురంగారావులా మహోన్నత వ్యక్తిత్వం ఉండాలి. కానీ కాలి బూడిదయ్యే అవయవాన్ని దానమివ్వడానికి కొంచెం పరిణతి, కొంచెం విశాల హృదయం చాలు.
- వాకా మంజులారెడ్డి
ప్రతి ఒక్కరూ తాము సంపాదించిన ఆస్తికి వీలునామా రాస్తారు. దేవుడిచ్చిన ఈ అవయవాలు అంతకంటే విలువైనవని, వీటిని వృథా చేయకుండా మరొకరికి దానం చేద్దామనే ఆలోచనే చేయరు. ఆరోగ్యంగా ఉన్న అవయవాలను మట్టిపాలు కానివ్వకుండా మరొకరికి ప్రాణం పోయడానికి ఉపయోగించాలి. అలాంటి స్పృహ కలిగించాలని నా ప్రయత్నం.
- అల్లం పాండురంగారావు