కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ జీవితానికి కొత్త పాదు | starting new life with kidney transplantation | Sakshi
Sakshi News home page

కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ జీవితానికి కొత్త పాదు

Published Thu, Dec 15 2016 12:09 AM | Last Updated on Mon, Sep 4 2017 10:44 PM

కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ జీవితానికి కొత్త పాదు

కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ జీవితానికి కొత్త పాదు

రమేశ్‌కి ఇరవై నాలుగేళ్లు. ఇన్‌ఫెక్షన్‌ కారణంగా రెండు కిడ్నీలూ పూర్తిగా పాడయ్యాయి. ప్రస్తుతం అతడు ఉన్న పరిస్థితుల్లో కిడ్నీ మార్పిడి ఒక్కటే పరిష్కారం. ఎలాగైనా సరే కొడుకుని బతికించుకోవాలి. కొడుకు ఆరోగ్యంగా జీవించాలని తల్లిదండ్రులు తపించి పోయారు. లైవ్‌ డోనర్‌ నుంచి సేకరించిన కిడ్నీ అయితే రమేశ్‌కు నాణ్యమైన జీవితాన్ని ఇవ్వవచ్చని డాక్టర్లు సూచించారు. దాంతో రమేశ్‌ తండ్రి తన కిడ్నీని కొడుక్కి ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. అసలు మూత్రపిండాల మార్పిడి అవసరం ఎందుకు వస్తుంది? ఎలాంటి కిడ్నీతో మార్పిడి చేయాలి? ఆపరేషన్‌ తర్వాత దాత, స్వీకర్త ఇద్దరూ ఆరోగ్యంగా ఉంటారా?

మూత్రపిండాలు మన శరీరంలోని రక్తాన్ని శుద్ధి చేసి, మలినాలను మూత్రం ద్వారా బయటకు పంపిస్తాయి. పరోక్షంగా రక్తపోటును కూడా నియంత్రిస్తాయి. ఎముకల పటిష్టతను కాపాడతాయి. ఎర్ర రక్తకణాల తయారీలో కిడ్నీల పాత్ర కీలకం. దేహక్రియలలో అత్యంత క్లిష్టమైన పనులను చేసే మూత్రపిండాలు నిర్వీర్యమైతే రక్తం శుద్ధికాదు. దాంతో మలినాలు పేరుకుపోయి రక్తం కలుషితమవుతుంది. దేహం మొత్తం రోగగ్రస్థమవుతుంది.

కారణాలు
మూత్రపిండాల పనితీరు లోపించడానికి కారణాలు అనేకం. మధుమేహం, హైబీపీ దీర్ఘకాలం కొనసాగడం, మూత్రనాళాల్లో ఇన్‌ఫెక్షన్, కిడ్నీలో రాళ్లు ఏర్పడడం... వంటి అనేక కారణాలు కిడ్నీలు ఫెయిల్‌ కావడానికి దారి తీస్తాయి. వీటితోపాటు 2–5 శాతం మందిలో జన్యుపరమైన కారణాలు కూడా ఉంటాయి. మూత్రపిండాలు పని చేయడం మానేస్తే... మూత్రంలో ప్రొటీన్‌ ఎక్కువగా పోతుంది.

లక్షణాలు
మూత్రపిండాలు ఫెయిలయితే... కాళ్లకు నీరుపట్టి వాపు, ముఖం ఉబ్బినట్లు ఉండడం, ఆకలి తగ్గడం, వాంతులు, నీరసం, చిన్నపాటి శ్రమకే ఆయాసపడడం, రాత్రిపూట ఎక్కువసార్లు మూత్రవిసర్జన చేయాల్సి రావడం, మూత్ర విసర్జన మోతాదు తక్కువగా ఉండడం, మూత్రంలో రక్తం, ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బందులు, అపస్మారక స్థితికి చేరడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

ప్రత్యామ్నాయంగా...!
మూత్రపిండాలు పనిచేయడం మానేసినప్పుడు ఆ పనిని బయటి నుంచి చేయించే ప్రక్రియ డయాలసిస్‌. సీరమ్‌ క్రియాటినైన్‌ 8 ఎంజి, యూరియా 150కి పైగా ఉంటే డయాలసిస్‌ ద్వారా రక్తాన్ని శుభ్రం చేయాలి. హీమో డయాలసిస్‌ ప్రక్రియలో రక్తాన్ని శుద్ధి చేయడానికి కృత్రిమ మూత్రపిండం సహాయం తీసుకుంటారు. ఒక దఫా డయాలసిస్‌కి మూడు గంటలు పడుతుంది. వారంలో మూడుసార్లు చేయాల్సి ఉంటుంది. దీనిని హాస్పిటల్‌లోనే చేయించుకోవాలి. మరో పద్ధతి పెరిటోనియల్‌ డయాలసిస్‌. దీనిని ఇంట్లో చేసుకోవచ్చు. సన్నటి జల్లెడ వంటి పొరకు మెత్తని ట్యూబ్‌ను చిన్న కోత ద్వారా అమర్చి ప్రత్యేకంగా తయారు చేసిన బ్యాగ్‌లోని ఫ్లూయిడ్స్‌ని కడుపులోకి పంపిస్తారు. ఫిల్టర్‌ ప్రక్రియకు అరగంట సమయం పడుతుంది. ఈ ప్రక్రియను రోజుకు మూడు– నాలుగు సార్లు చేయాలి. వీటితోపోల్చినప్పుడు కిడ్నీ ఫెయిలయిన పేషెంటుకి కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ మాత్రమే శాశ్వతమైన ప్రత్యామ్నాయం. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు వయసు పరిమితి లేదు. కానీ 70 ఏళ్లు దాటితే దేహం శస్త్రచికిత్సకు సహకరించడం కొంత కష్టమే.

మార్పిడికి కిడ్నీలు ఎలా!
కిడ్నీ ఫెయిలయిన వారికి మరొకరి కిడ్నీని అమర్చే ప్రక్రియనే కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ అంటారు. ఇందుకు బతికి ఉన్న వారి నుంచి కిడ్నీ స్వీకరించడం ఒక పద్ధతి, బ్రెయిన్‌ డెడ్‌ అయిన వారి నుంచి సేకరించిన కిడ్నీని అమర్చడం మరొక పద్ధతి. లైవ్‌ డోనార్‌ రక్తసంబంధీకులైతే మంచిది. కిడ్నీ దాత బ్లడ్‌ గ్రూప్, స్వీకర్త బ్లడ్‌గ్రూప్‌ కలవాలి. కిడ్నీ దాతకు హైబీపీ, డయాబెటిస్, గుండె జబ్బులు, మెదడు జబ్బులు, హెపటైటిస్‌ బి,సి వంటి కాలేయవ్యాధులు, ఎయిడ్స్‌ ఉండకూడదు. రక్త సంబంధీకుల్లో బ్లడ్‌ గ్రూప్‌ కలవకపోతే స్వాప్‌ పద్ధతిలో ఇన్‌కంపాటబుల్‌ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ ప్రక్రియలు ఉన్నాయి. అంటే... కిడ్నీ ఫెయిలైన ‘ఎ’ అనే వ్యక్తి కోసం అతడి బంధువుల నుంచి సేకరించిన కిడ్నీని, ‘బి’ అనే మరో పేషెంట్‌ కోసం అతడి బంధువులు ఇచ్చిన కిడ్నీని పరస్పరం మార్చుకోవడం. దీనిని స్వాప్‌ రీనల్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ అంటారు. అయితే అత్యాధునిక వైద్యవిధానంలో బ్లడ్‌ గ్రూపు కలవకపోయినా సరే విజయవంతంగా కిడ్నీ మార్పిడి చేయగలుగుతున్నారు.

వైద్యుని పర్యవేక్షణలోనే!
మూత్రపిండం మార్పిడి తర్వాత పేషెంటు చాలా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. దేహంలో ఇమ్యూన్‌ సిస్టమ్‌ వేరే అవయవాన్ని అంత త్వరగా స్వీకరించదు. ఇందుకోసం సర్జరీకి ముందు నుంచే ఇమ్యునోసప్రెసంట్‌ మందులు ఇస్తారు. ఈ మందుల వల్ల పేషెంటు దేహంలోని ఇమ్యూన్‌సిస్టమ్‌ కొత్త అవయవాన్ని వ్యతిరేకించే గుణాన్ని కోల్పోతుంది. ఈ మందులను జీవితకాలం వాడాల్సి ఉంటుంది. అలాగే కొత్త కిడ్నీ పనితీరును నిపుణులైన కిడ్నీ మార్పిడి బృందం పర్యవేక్షిస్తుంటుంది. కిడ్నీ మార్పిడి తరవాత 85–90 శాతం మందిలో రిజెక్షన్‌ కనిపించదు. 10– 15 శాతం మందిలో మాత్రం ఎర్లీ రిజెక్షన్‌ కనిపిస్తుంది. ఎర్లీ రిజెక్షన్‌ ఎదురైన ఆ సమస్యను క్రమంగా నియంత్రించవచ్చు. పేషెంటు డిశ్చార్జ్‌ అయిన తర్వాత మూడు నెలల వరకు కూడా తరచుగా వైద్యుని సంప్రదిస్తూ సూచనలను పాటించాలి. ఆ తర్వాత కూడా దీర్ఘకాల నిడివితో రొటీన్‌ హెల్త్‌ విజిట్‌లను కొనసాగించాల్సి ఉంటుంది.

ఆపరేషన్‌కు ముందు... తర్వాత?
ఆపరేషన్‌కు ఒకరోజు ముందు దాత, స్వీకర్త ఇద్దరూ ఇన్‌పేషెంట్లుగా చేరాలి. ఆపరేషన్‌ తర్వాత దాతను నాలుగైదు రోజుల్లో డిశ్చార్జ్‌ చేస్తారు. స్వీకర్తను డిశ్చార్జ్‌ చేయడానికి వారం నుంచి పది రోజులు పడుతుంది. ఆపరేషన్‌ తర్వాత పేషెంటు మామూలు స్థితికి వచ్చినట్లు నిర్ధారణ అయిన తర్వాత మాత్రమే డిశ్చార్జ్‌ చేస్తారు. ఆహారం తీసుకోవడం, కొత్త మూత్రపిండం పని మొదలుకావడం వంటివి పరిక్షించిన తర్వాత నిర్ణయం తీసుకుంటారు. ఆపరేషన్‌ తర్వాత పేషెంటు ధూమపానం, మద్యపానం, దేహానికి విపరీతమైన శ్రమనిచ్చే ఆటలకు దూరంగా ఉండాలి.

కిడ్నీ దానం సురక్షితమే!
కిడ్నీ దానం చేయడం వల్ల దాతకు ఎటువంటి హాని కలగదు. దేహంలో ఉంటే రెండు కిడ్నీలలో ఒకటి సమర్థంగా పని చేస్తున్నా మనిషి హాయిగా జీవించవచ్చు. కాబట్టి దాత దైనందిన జీవితాన్ని యథాతథంగా కొనసాగించవచ్చు. డ్రైవింగ్, వ్యాయామం, ఆటలతోపాటు మిలటరీ ఉద్యోగం కూడా చేయవచ్చు. అలాగే దాత పూర్తిస్థాయి ఆరోగ్యంగా ఉన్నారని, కిడ్నీ తీసుకోవడం వల్ల దాతకు ఇతర ఆరోగ్యసమస్యలేవీ తలెత్తవని నిర్ధారించుకున్న తర్వాతనే కిడ్నీ స్వీకరణకు అనుమతిస్తారు. ఇటీవల కిడ్నీ తీసుకోవడానికి లాప్రోస్కోపిక్‌ విధానాన్ని అవలంబిస్తున్నారు. దాంతో చిన్న గాయంతో, తక్కువ నొప్పితో ఆపరేషన్‌ పూర్తవుతుంది. తర్వాత నాలుగు వారాలపాటు వైద్యులు సూచించిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

డాక్టర్‌ బి. సూర్యప్రకాశ్‌
సీనియర్‌ యూరాలజిస్ట్‌ అండ్‌
కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్‌ సర్జన్‌
యశోద హాస్పిటల్స్, హైదరాబాద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement