Kidney transplants
-
ఏడాదిలో కిడ్నీ మార్పిడులు 11,423
సాక్షి, హైదరాబాద్: దేశంలో కిడ్నీ మార్పిడి చికిత్సలు గణనీయంగా పెరిగాయి. ఒక్క 2022 ఏడాదిలోనే ఏకంగా 11,423 కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు జరిగినట్టు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ తాజాగా వెల్లడించింది. పదేళ్లలో ఈ చికిత్సలు దాదాపు మూడింతలు పెరిగినట్టు తెలిపింది. 2013లో 4,037 కిడ్నీ మార్పిడి చికిత్సలు జరిగాయి. ఆ తర్వాత ఏటా పెరుగుతూ 2019లో 9,751కు చేరాయి. కరోనా కారణంగా 2020లో 5,488, 2021లో 9,105 శస్త్రచికిత్సలు జరిగాయి. కిడ్నీ బాధితుల సంఖ్య పెరుగుతుండటంతోపాటు అవయవ దానానికి ముందుకొస్తున్నవారిలో పెరుగుదల కూడా కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు పెరగడానికి కారణమని వైద్య నిపుణులు చెప్తున్నారు. అయితే ఇప్పటికీ పెద్ద సంఖ్యలో కిడ్నీ బాధితులు దాతల కోసం ఎదురుచూస్తున్నారని అంటున్నారు. కిడ్నీ చికిత్సలే అధికం సాధారణంగా కిడ్నీ, పాంక్రియాస్, కాలేయం, గుండె, ఊపిరితిత్తులు దెబ్బతిన్నవారికి ఆయా అవయవాలను మార్పిడి చేస్తారు. దేశవ్యాప్తంగా అన్ని రకాల అవయవ మార్పిడి చికిత్సలు కలిపి 2013లో 4,990 జరగ్గా.. 2022 నాటికి 15,561కి పెరిగాయి. ఇందులో అధికంగా 11,423 కిడ్నీ మార్పిడి చికిత్సలే ఉన్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ నివేదికలో వెల్లడించింది. ఇక కాలేయ మార్పిడి చికిత్సలు 3,718, గుండె మార్పిడులు 250, ఊపిరితిత్తుల మార్పిడులు 138, పాంక్రియాస్ 24, కిడ్నీ–పాంక్రియాస్ 22 చికిత్సలు జరిగాయి. ‘బ్రెయిన్‌డెడ్’ దాతల నుంచి.. 2022లో దేశవ్యాప్తంగా బ్రెయిన్‌డెడ్ అయినవారి నుంచి సేకరించిన అవయవాల మార్పిడి శస్త్రచికిత్సలు తెలంగాణలో ఎక్కువగా ఉన్నాయని కేంద్రం తెలిపింది. తెలంగాణలో ఇలా 655 శస్త్రచికిత్సలు జరగగా.. తమిళనాడులో 553, కర్ణాటక 435, గుజరాత్ 399, మహారాష్ట్రలో 305 అవయవ మార్పిడులు జరిగినట్టు తెలిపింది. ఇక బతికున్నవారి దాతల (లివింగ్ డోనర్) నుంచి తీసుకున్న అవయవ మార్పిడిలో ఢిల్లీ టాప్‌లో ఉంది. ఆ రాష్ట్రంలో అత్యధికంగా 3,623 లివింగ్ డోనర్ అవయవ మార్పిడులు జరిగాయి. తర్వాత తమిళనాడు 1,691, మహారాష్ట్ర 1,211, కేరళ 979, పశ్చిమబెంగాల్ 928 అవయవ మార్పిడి చికిత్సలు జరిగాయి. పెద్ద సంఖ్యలో బాధితులు సాంకేతిక పరిజ్ఞానం ఎంత అభివృద్ధి చెందినా, శస్త్రచికిత్సలు చేసే సదుపాయాలు అంతటా అందుబాటులోకి వచ్చినా.. అవయవాలు దొరక్క చాలా మంది బాధితులు ఇబ్బందిపడుతున్నారు. దాతల కోసం ఎదురుచూస్తూనే.. పరిస్థితి విషమించి మరణిస్తున్నవారు పెద్ద సంఖ్యలో ఉన్నారు. 2019 నాటి లెక్కల ప్రకారం.. అంతకుముందు ఆరేళ్లలో తెలంగాణలో 4,728 మందికి అవయవ మార్పిడి అవసరమైతే, 2,402 అవయవాలు మాత్రమే అందించగలిగారు. జీవన్‌దాన్ నెట్‌వర్క్‌తో.. ప్రమాదాల్లో మరణించిన, బ్రెయిన్‌డెడ్ అయినవారి నుంచి అవయవాలను సేకరించి.. అవసరమైన వారికి అందించేందుకు జీవన్‌దాన్ నెట్‌వర్క్‌తో కీలకంగా పనిచేస్తోంది. ఈ నెట్‌వర్క్‌తో అనుసంధానమైన ఆస్పత్రుల్లోని రోగులకు రొటేషన్ పద్ధతిలో అవయవాలు అందేలా ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలో ఇలాంటి ఆస్పత్రులు 27 ఉన్నాయి. అవయవాలు కావాల్సిన రోగులు ప్రభుత్వ జీవన్‌దాన్ వెబ్సైట్లో పేరు, వివరాలు నమోదు చేయించుకోవాలి. వారికి సీరియల్ నంబర్ ఇస్తారు. అవయవ దాతలు దొరికినప్పుడు సీరియల్ నంబర్ ప్రకారం రోగులకు చికిత్సలు చేస్తారు. మృతుల కుటుంబ సభ్యులకు అవయవ మార్పిడిపై అవగాహన కల్పించి, ఒప్పించేదిశగా జీవన్‌దాన్ కృషి చేస్తోంది. మన రాష్ట్రంలో ప్రైవేటు ఆసుపత్రులతోపాటు నిమ్స్, గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల్లో అవయవ మార్పిడి చికిత్సలు చేస్తున్నాయి. -
ఏడున్నరేళ్లు..742 ఆపరేషన్లు
సాక్షి, హైదరాబాద్: ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన అనంతరం నిమ్స్‌లో రికార్డు స్థాయిలో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు జరుగుతున్నాయి. తెలంగాణ రాకముందు 25 ఏళ్లలో కేవలం 649 మాత్రమే కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు జరగ్గా, రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏడున్నరేళ్లలో ఏకంగా 742 ఆపరేషన్లు జరగడం గమనార్హం. ఇప్పటికే ప్రభుత్వాస్పత్రుల్లో అధునాతన వైద్య పరికరాలను, తగినంత వైద్య సిబ్బందిని అందుబాటులోకి తేవడంతో శస్త్రచికిత్సలు పెరిగాయ ని వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఒక్కో శస్త్రచికిత్సకు రూ. 10 లక్షల నుంచి రూ. 12 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ఈ ఏడాదిలో జరిగిన వంద కిడ్నీ మార్పిడి చికిత్సలో 97 ప్రభుత్వమే ఉచితంగా నిర్వహించగా, అందు లో 90 ఆరోగ్యశ్రీ ద్వారానే నిర్వహించడం గమనార్హం. జీవితాంతం ఉచితంగా మందులు... ప్రభుత్వం అవయవదానాన్ని ప్రోత్సహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం 7,800 మంది అవయవాల మార్పిడి కోసం జీవన్‌దాన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఎదురుచూస్తున్నారు. అవయవ మార్పిడి శస్త్ర చికిత్సలు చేయడంతోపాటు అనంతరం అవసరమయ్యే మందులను జీవితకాలానికి ప్రభుత్వమే ఉచితంగా అందిస్తోంది. ఇలా ఉచితం గా మందులు అందించే రాష్ట్రం దేశంలో తెలంగాణ ఒక్కటేనని వైద్య వర్గాలు వెల్లడించాయి. అవయవ మార్పిడి శస్త్ర చికిత్సలకు అవసరమైన మౌలిక సదుపాయాలను, యంత్రాలను గాంధీ, నిమ్స్, ఉస్మానియా ప్రభుత్వాస్పత్రుల్లో అందుబాటులో ఉంచింది. కార్పొరేట్‌కు దీటుగా వైద్య సేవలు: హరీశ్‌రావు ప్రజారోగ్యంపై రాష్ట్ర ప్రభుత్వం అత్యంత శ్రద్ధగా వ్యవహరిస్తోందని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ కలలుగన్న ఆరోగ్య తెలంగాణగా మన రాష్ట్రం మారుతోందన్నారు. కిడ్నీ మార్పిడి చికిత్సలు చేయడంలో రికార్డు సాధించామని, ఇదే స్ఫూర్తితో మరిన్ని శస్త్రచికిత్సలు నిర్వహించి రోగులకు ప్రాణదానం చేయాలని వైద్యులకు సూచించారు. ప్రభుత్వ రంగంలోని ఆస్పత్రులు కార్పొరేట్ ఆస్పత్రులతో పోటీ పడేలా వైద్య సేవలుండాలన్నారు. అందుకు ప్రభుత్వం అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు, అత్యాధునిక వైద్య పరికరాలు అందుబాటులోకి తెస్తుందన్నారు. ప్రభుత్వ వైద్యరంగంలో విప్లవాత్మకమైన మార్పులకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారని, ఆ ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. -
కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ జీవితానికి కొత్త పాదు
రమేశ్‌కి ఇరవై నాలుగేళ్లు. ఇన్ఫెక్షన్ కారణంగా రెండు కిడ్నీలూ పూర్తిగా పాడయ్యాయి. ప్రస్తుతం అతడు ఉన్న పరిస్థితుల్లో కిడ్నీ మార్పిడి ఒక్కటే పరిష్కారం. ఎలాగైనా సరే కొడుకుని బతికించుకోవాలి. కొడుకు ఆరోగ్యంగా జీవించాలని తల్లిదండ్రులు తపించి పోయారు. లైవ్ డోనర్ నుంచి సేకరించిన కిడ్నీ అయితే రమేశ్‌కు నాణ్యమైన జీవితాన్ని ఇవ్వవచ్చని డాక్టర్లు సూచించారు. దాంతో రమేశ్ తండ్రి తన కిడ్నీని కొడుక్కి ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. అసలు మూత్రపిండాల మార్పిడి అవసరం ఎందుకు వస్తుంది? ఎలాంటి కిడ్నీతో మార్పిడి చేయాలి? ఆపరేషన్ తర్వాత దాత, స్వీకర్త ఇద్దరూ ఆరోగ్యంగా ఉంటారా? మూత్రపిండాలు మన శరీరంలోని రక్తాన్ని శుద్ధి చేసి, మలినాలను మూత్రం ద్వారా బయటకు పంపిస్తాయి. పరోక్షంగా రక్తపోటును కూడా నియంత్రిస్తాయి. ఎముకల పటిష్టతను కాపాడతాయి. ఎర్ర రక్తకణాల తయారీలో కిడ్నీల పాత్ర కీలకం. దేహక్రియలలో అత్యంత క్లిష్టమైన పనులను చేసే మూత్రపిండాలు నిర్వీర్యమైతే రక్తం శుద్ధికాదు. దాంతో మలినాలు పేరుకుపోయి రక్తం కలుషితమవుతుంది. దేహం మొత్తం రోగగ్రస్థమవుతుంది. కారణాలు మూత్రపిండాల పనితీరు లోపించడానికి కారణాలు అనేకం. మధుమేహం, హైబీపీ దీర్ఘకాలం కొనసాగడం, మూత్రనాళాల్లో ఇన్ఫెక్షన్, కిడ్నీలో రాళ్లు ఏర్పడడం... వంటి అనేక కారణాలు కిడ్నీలు ఫెయిల్ కావడానికి దారి తీస్తాయి. వీటితోపాటు 2–5 శాతం మందిలో జన్యుపరమైన కారణాలు కూడా ఉంటాయి. మూత్రపిండాలు పని చేయడం మానేస్తే... మూత్రంలో ప్రొటీన్ ఎక్కువగా పోతుంది. లక్షణాలు మూత్రపిండాలు ఫెయిలయితే... కాళ్లకు నీరుపట్టి వాపు, ముఖం ఉబ్బినట్లు ఉండడం, ఆకలి తగ్గడం, వాంతులు, నీరసం, చిన్నపాటి శ్రమకే ఆయాసపడడం, రాత్రిపూట ఎక్కువసార్లు మూత్రవిసర్జన చేయాల్సి రావడం, మూత్ర విసర్జన మోతాదు తక్కువగా ఉండడం, మూత్రంలో రక్తం, ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బందులు, అపస్మారక స్థితికి చేరడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ప్రత్యామ్నాయంగా...! మూత్రపిండాలు పనిచేయడం మానేసినప్పుడు ఆ పనిని బయటి నుంచి చేయించే ప్రక్రియ డయాలసిస్. సీరమ్ క్రియాటినైన్ 8 ఎంజి, యూరియా 150కి పైగా ఉంటే డయాలసిస్ ద్వారా రక్తాన్ని శుభ్రం చేయాలి. హీమో డయాలసిస్ ప్రక్రియలో రక్తాన్ని శుద్ధి చేయడానికి కృత్రిమ మూత్రపిండం సహాయం తీసుకుంటారు. ఒక దఫా డయాలసిస్‌కి మూడు గంటలు పడుతుంది. వారంలో మూడుసార్లు చేయాల్సి ఉంటుంది. దీనిని హాస్పిటల్లోనే చేయించుకోవాలి. మరో పద్ధతి పెరిటోనియల్ డయాలసిస్. దీనిని ఇంట్లో చేసుకోవచ్చు. సన్నటి జల్లెడ వంటి పొరకు మెత్తని ట్యూబ్‌ను చిన్న కోత ద్వారా అమర్చి ప్రత్యేకంగా తయారు చేసిన బ్యాగ్‌లోని ఫ్లూయిడ్స్‌ని కడుపులోకి పంపిస్తారు. ఫిల్టర్ ప్రక్రియకు అరగంట సమయం పడుతుంది. ఈ ప్రక్రియను రోజుకు మూడు– నాలుగు సార్లు చేయాలి. వీటితోపోల్చినప్పుడు కిడ్నీ ఫెయిలయిన పేషెంటుకి కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ మాత్రమే శాశ్వతమైన ప్రత్యామ్నాయం. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు వయసు పరిమితి లేదు. కానీ 70 ఏళ్లు దాటితే దేహం శస్త్రచికిత్సకు సహకరించడం కొంత కష్టమే. మార్పిడికి కిడ్నీలు ఎలా! కిడ్నీ ఫెయిలయిన వారికి మరొకరి కిడ్నీని అమర్చే ప్రక్రియనే కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ అంటారు. ఇందుకు బతికి ఉన్న వారి నుంచి కిడ్నీ స్వీకరించడం ఒక పద్ధతి, బ్రెయిన్ డెడ్ అయిన వారి నుంచి సేకరించిన కిడ్నీని అమర్చడం మరొక పద్ధతి. లైవ్ డోనార్ రక్తసంబంధీకులైతే మంచిది. కిడ్నీ దాత బ్లడ్ గ్రూప్, స్వీకర్త బ్లడ్‌గ్రూప్ కలవాలి. కిడ్నీ దాతకు హైబీపీ, డయాబెటిస్, గుండె జబ్బులు, మెదడు జబ్బులు, హెపటైటిస్ బి,సి వంటి కాలేయవ్యాధులు, ఎయిడ్స్ ఉండకూడదు. రక్త సంబంధీకుల్లో బ్లడ్ గ్రూప్ కలవకపోతే స్వాప్ పద్ధతిలో ఇన్కంపాటబుల్ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ ప్రక్రియలు ఉన్నాయి. అంటే... కిడ్నీ ఫెయిలైన ‘ఎ’ అనే వ్యక్తి కోసం అతడి బంధువుల నుంచి సేకరించిన కిడ్నీని, ‘బి’ అనే మరో పేషెంట్ కోసం అతడి బంధువులు ఇచ్చిన కిడ్నీని పరస్పరం మార్చుకోవడం. దీనిని స్వాప్ రీనల్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అంటారు. అయితే అత్యాధునిక వైద్యవిధానంలో బ్లడ్ గ్రూపు కలవకపోయినా సరే విజయవంతంగా కిడ్నీ మార్పిడి చేయగలుగుతున్నారు. వైద్యుని పర్యవేక్షణలోనే! మూత్రపిండం మార్పిడి తర్వాత పేషెంటు చాలా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. దేహంలో ఇమ్యూన్ సిస్టమ్ వేరే అవయవాన్ని అంత త్వరగా స్వీకరించదు. ఇందుకోసం సర్జరీకి ముందు నుంచే ఇమ్యునోసప్రెసంట్ మందులు ఇస్తారు. ఈ మందుల వల్ల పేషెంటు దేహంలోని ఇమ్యూన్‌సిస్టమ్ కొత్త అవయవాన్ని వ్యతిరేకించే గుణాన్ని కోల్పోతుంది. ఈ మందులను జీవితకాలం వాడాల్సి ఉంటుంది. అలాగే కొత్త కిడ్నీ పనితీరును నిపుణులైన కిడ్నీ మార్పిడి బృందం పర్యవేక్షిస్తుంటుంది. కిడ్నీ మార్పిడి తరవాత 85–90 శాతం మందిలో రిజెక్షన్ కనిపించదు. 10– 15 శాతం మందిలో మాత్రం ఎర్లీ రిజెక్షన్ కనిపిస్తుంది. ఎర్లీ రిజెక్షన్ ఎదురైన ఆ సమస్యను క్రమంగా నియంత్రించవచ్చు. పేషెంటు డిశ్చార్జ్ అయిన తర్వాత మూడు నెలల వరకు కూడా తరచుగా వైద్యుని సంప్రదిస్తూ సూచనలను పాటించాలి. ఆ తర్వాత కూడా దీర్ఘకాల నిడివితో రొటీన్ హెల్త్ విజిట్లను కొనసాగించాల్సి ఉంటుంది. ఆపరేషన్‌కు ముందు... తర్వాత? ఆపరేషన్‌కు ఒకరోజు ముందు దాత, స్వీకర్త ఇద్దరూ ఇన్పేషెంట్లుగా చేరాలి. ఆపరేషన్ తర్వాత దాతను నాలుగైదు రోజుల్లో డిశ్చార్జ్ చేస్తారు. స్వీకర్తను డిశ్చార్జ్ చేయడానికి వారం నుంచి పది రోజులు పడుతుంది. ఆపరేషన్ తర్వాత పేషెంటు మామూలు స్థితికి వచ్చినట్లు నిర్ధారణ అయిన తర్వాత మాత్రమే డిశ్చార్జ్ చేస్తారు. ఆహారం తీసుకోవడం, కొత్త మూత్రపిండం పని మొదలుకావడం వంటివి పరిక్షించిన తర్వాత నిర్ణయం తీసుకుంటారు. ఆపరేషన్ తర్వాత పేషెంటు ధూమపానం, మద్యపానం, దేహానికి విపరీతమైన శ్రమనిచ్చే ఆటలకు దూరంగా ఉండాలి. కిడ్నీ దానం సురక్షితమే! కిడ్నీ దానం చేయడం వల్ల దాతకు ఎటువంటి హాని కలగదు. దేహంలో ఉంటే రెండు కిడ్నీలలో ఒకటి సమర్థంగా పని చేస్తున్నా మనిషి హాయిగా జీవించవచ్చు. కాబట్టి దాత దైనందిన జీవితాన్ని యథాతథంగా కొనసాగించవచ్చు. డ్రైవింగ్, వ్యాయామం, ఆటలతోపాటు మిలటరీ ఉద్యోగం కూడా చేయవచ్చు. అలాగే దాత పూర్తిస్థాయి ఆరోగ్యంగా ఉన్నారని, కిడ్నీ తీసుకోవడం వల్ల దాతకు ఇతర ఆరోగ్యసమస్యలేవీ తలెత్తవని నిర్ధారించుకున్న తర్వాతనే కిడ్నీ స్వీకరణకు అనుమతిస్తారు. ఇటీవల కిడ్నీ తీసుకోవడానికి లాప్రోస్కోపిక్ విధానాన్ని అవలంబిస్తున్నారు. దాంతో చిన్న గాయంతో, తక్కువ నొప్పితో ఆపరేషన్ పూర్తవుతుంది. తర్వాత నాలుగు వారాలపాటు వైద్యులు సూచించిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. డాక్టర్ బి. సూర్యప్రకాశ్ సీనియర్ యూరాలజిస్ట్ అండ్ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్ యశోద హాస్పిటల్స్, హైదరాబాద్ -
రమణన్న.. ఇకలేరు!
పేద కుటుంబంలో జన్మించి ఉన్నత స్థాయికి ఎదిగిన ఎమ్మెల్యే వెంకటరమణ అనారోగ్యం బారినపడి కోలుకున్న నెల రోజులకే కబళించిన మృత్యువు శోకసంద్రంలో కుటుంబ సభ్యులు, అభిమానులు.. దిగ్భ్రాంతికిలోనైన ప్రజానీకం ‘ఏమియా.. బాగుండావా.. దా కూచో..’, ‘ఏమ్మా తల్లి ఎట్టున్నావ్..’ అంటూ ఆప్యాయం గా పలకరించే తిరుపతి ఎమ్మెల్యే, తుడా(తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ) చైర్మన్ మన్నేరు వెంకటరమణ ఇక లేరు. అకాల మృత్యువు అనారోగ్య రూపంలో ఆయనను కబళించింది. వెంకటరమణ కుటుంబ సభ్యులను, అభిమానులను శోకసంద్రంలో ముంచింది. నిరుపేదల మనిషి మృతి ప్రజానీకాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. అనారోగ్యంబారిన పడి కోలుకున్నాడనుకున్న వెంకటరమణ నెల రోజుల్లోనే కన్నుమూయడం కలచివేసింది. తిరుపతి: కొన్నాళ్లుగా మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న తిరుపతి ఎమ్మెల్యే వెంకటరమణ(67), నవంబర్ 15న తన ఇంట్లోనే స్పృహతప్పి కింద పడిపోవడంతో కుటుంబ సభ్యులు ఆయనను తిరుపతిలోని స్విమ్స్‌కు తరలించిన విషయం విదితమే. వారం రోజుల చికిత్స పొందిన తర్వాత ఆయన కోలుకుని ఇంటికి చేరుకున్నారు. అనారోగ్యం నుంచి కోలుకున్న వెంకటరమణను వివిధ రాజకీయపార్టీలకు చెందిన నేతలు పరామర్శించారు. స్విమ్స్ వైద్య నిపుణుల సూచనల మేరకు కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ కోసం సింగపూర్ వెళ్లడానికి ఏర్పాట్లు చేసుకున్న వెంకటరమణకు ఈనెల 8న గుండె సంబంధిత వ్యాధి తిరగబెట్టింది. దాంతో కుటుంబసభ్యులు హుటాహుటిన వెంకటరమణను చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. బుధవారం ఆయనకు గుండెపోటు రావడంతో అపోలో వైద్యులు ఓపెన్ హార్ట్ సర్జరీ చేశారు. ఊపిరితిత్తుల్లో చేరిన ఇన్ఫెక్షన్, వయోభారం వల్ల చికిత్సకు శరీరం సహకరించకపోవడంతో సోమవారం ఉదయం 10 గంటలకు వెంకటరమణ కన్నుమూశారు. వెంకటరమణ మరణ వార్త విన్న కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. నిరుపేదల మనిషి ఇకలేరన్న వార్త విన్న ప్రజానీకం.. వెంకటరమణ ఇంటికి భారీ ఎత్తున చేరుకుంది. వెంకటరమణ భౌతికకాయాన్ని చెన్నై నుంచి సోమవారం మధ్యాహ్నం 3.45 గంటలకు తిరుపతికి తెచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డెప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప, మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి తదితరులు వెంకటరమణ భౌతికకాయాన్ని సందర్శించి.. నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఎమ్మెల్యే వెంకటరమణ భౌతిక కాయానికి ప్రభుత్వ లాంఛనాలతో మంగళవారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఆయన భౌతిక కాయాన్ని ప్రజల సందర్శన కోసం మంగళవారం మున్సిపల్ గ్రౌండ్స్‌లో ఉంచనున్నారు. మాస్ లీడర్‌గా ఎదిగి.. నిరుపేద కుటుంబంలో జన్మించిన వెంకటరమణ పేద ప్రజలకు అండగా ఎన్నో ప్రజా ఉద్యమాలు చేశారు. ఇది ఆయనను మాస్ లీడర్‌ను చేసింది. మాజీ ఎమ్మెల్యే మబ్బు రామిరెడ్డితో ఏర్పడిన సాన్నిహిత్యం 1974 ఆయనను కాంగ్రెస్‌పార్టీలో చేరడానికి దారితీసింది. మబ్బు రామిరెడ్డి దన్నుతో 1981లో తిరుపతి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఒకటో వార్డు కౌన్సిలర్‌గా పోటీచేసి గెలుపొందారు. 1987 ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికల్లో మరోసారి పోటీచేసి గెలుపొందిన వెంకటరమణ.. తిరుపతి మున్సిపల్ వైస్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. 1988లో టీటీడీ కో-ఆపరేటివ్ స్టోర్స్ ఎన్నికల్లో డెరైక్టర్‌గా గెలుపొందారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి మద్దతుతో 1999 ఎన్నికల్లో తిరుపతి శాసనసభ స్థానం కాంగ్రెస్ అభ్యర్థిత్వాన్ని దక్కించుకున్నారు. కానీ.. ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి చదవాలడ కృష్ణమూర్తి చేతిలో ఓడిపోయారు. 2004 ఎన్నికల్లో దివంగత సీఎం వైఎస్.రాజశేఖరరెడ్డి దన్నుతో తిరుపతి శాసనసభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిత్వాన్ని దక్కించుకున్న వెంకటరమణ.. టీడీపీ అభ్యర్థి చదలవాడ కృష్ణమూర్తిపై 47 వేల ఓట్లతో ఘనవిజయం సాధించారు. సినీ నటుడు చిరంజీవి ప్రజారాజ్యంపార్టీ స్థాపించి 2009 ఎన్నికల్లో తిరుపతి నుంచి శాసనసభకు పోటీ చేశారు. ఈ నేపథ్యంలో 2009 ఎన్నికల్లో వెంకటరమణకు కాంగ్రెస్ టికెట్ దక్కలేదు. చిరంజీవి రాజీనామాతో 2012లో తిరుపతి శాసనసభ స్థానానికి నిర్వహించిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి.. వైఎస్సార్సీపీ అభ్యర్థి భూమన కరుణాకర్‌రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డితో సాన్నిహిత్యం పెంచుకున్న వెంకటరమణ ఫిబ్రవరి, 2014లో తుడా చైర్మన్ పదవిని దక్కించుకున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటానికి నెల ముందు టీడీపీలో చేరిన వెంకటరమణ.. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా తిరుపతి నుంచి పోటీ చేసి 41,539 ఓట్లతో ఘన విజయం సాధించారు. నాటక సినీరంగంలోనూ తనదైన ముద్ర రాజకీయరంగంలోనే కాదు.. నాటక, సినీరంగాల్లోనూ వెంకటరమణ తనదైన ముద్ర వేశారు. తిరుపతిలో మా ర్చి 1, 1947లో హనుమంతయ్య, వెంకటమ్మ దంపతులకు జన్మించిన వెంకటరమణ ఎస్ఎస్ఎల్సీ వరకూ చదివారు. ఆ తర్వాత వ్యాపారంలోకి అడుగుపెట్టారు. ఓ వైపు వ్యాపారం చేస్తూనే మరో వైపు నాటకరంగంపై మక్కువ పెంచుకున్నారు. తిరుపతిలో వెంకటేశ్వర నా ట్య కళా పరిషత్‌లో సభ్యుడిగా చేరి.. పలు నాటకాల్లో కీలక పాత్రలు పోషించారు. దాసరి నారాయణరావు, చిత్తూరు ఎంపీ, దర్శకుడు ఎం.శివప్రసాద్, వంశీ, రే లంగి నర్సింహరావుల దర్శకత్వంలో పలు సినిమాల్లో నటించారు. తిరుపతిలో దాసరి నారాయణరావు, రేలం గి నరసింహారావులు చిత్రీకరించిన ప్రతి సినిమాలోనూ వెంకరమణ హాస్య పాత్రలు పోషించి మెప్పించారు. రాజేంద్రప్రసాద్ హీరోగా నటించిన బ్రహ్మచారి మొగుడులో వెంకటరమణ పోషించిన పోస్టుమేన్ పాత్రకు విమర్శకుల నుంచి ప్రశంసలు లభించాయి. ‘అడవిలో అన్న’, ‘ఓరేయ్ రిక్షా’ సినిమాల్లో వెంకటరమణ చేసిన పాత్రలకు మంచి స్పందన గుర్తింపు లభించింది. వ్యాపారం, నాటక, సినిమా రంగాల్లో కొనసాగుతూనే రాజకీయాల్లోనూ రాణించిన వెంకటరమణ మరణాన్ని తిరుపతి ప్రజానీకం జీర్ణించుకోలేకపోతోంది.