సాక్షి, హైదరాబాద్: ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన అనంతరం నిమ్స్‌లో రికార్డు స్థాయిలో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు జరుగుతున్నాయి. తెలంగాణ రాకముందు 25 ఏళ్లలో కేవలం 649 మాత్రమే కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు జరగ్గా, రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏడున్నరేళ్లలో ఏకంగా 742 ఆపరేషన్లు జరగడం గమనార్హం. ఇప్పటికే ప్రభుత్వాస్పత్రుల్లో అధునాతన వైద్య పరికరాలను, తగినంత వైద్య సిబ్బందిని అందుబాటులోకి తేవడంతో శస్త్రచికిత్సలు పెరిగాయ ని వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఒక్కో శస్త్రచికిత్సకు రూ. 10 లక్షల నుంచి రూ. 12 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ఈ ఏడాదిలో జరిగిన వంద కిడ్నీ మార్పిడి చికిత్సలో 97 ప్రభుత్వమే ఉచితంగా నిర్వహించగా, అందు లో 90 ఆరోగ్యశ్రీ ద్వారానే నిర్వహించడం గమనార్హం.
జీవితాంతం ఉచితంగా మందులు...
ప్రభుత్వం అవయవదానాన్ని ప్రోత్సహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం 7,800 మంది అవయవాల మార్పిడి కోసం జీవన్‌దాన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఎదురుచూస్తున్నారు. అవయవ మార్పిడి శస్త్ర చికిత్సలు చేయడంతోపాటు అనంతరం అవసరమయ్యే మందులను జీవితకాలానికి ప్రభుత్వమే ఉచితంగా అందిస్తోంది. ఇలా ఉచితం గా మందులు అందించే రాష్ట్రం దేశంలో తెలంగాణ ఒక్కటేనని వైద్య వర్గాలు వెల్లడించాయి. అవయవ మార్పిడి శస్త్ర చికిత్సలకు అవసరమైన మౌలిక సదుపాయాలను, యంత్రాలను గాంధీ, నిమ్స్, ఉస్మానియా ప్రభుత్వాస్పత్రుల్లో అందుబాటులో ఉంచింది.
కార్పొరేట్‌కు దీటుగా వైద్య సేవలు: హరీశ్‌రావు
ప్రజారోగ్యంపై రాష్ట్ర ప్రభుత్వం అత్యంత శ్రద్ధగా వ్యవహరిస్తోందని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ కలలుగన్న ఆరోగ్య తెలంగాణగా మన రాష్ట్రం మారుతోందన్నారు. కిడ్నీ మార్పిడి చికిత్సలు చేయడంలో రికార్డు సాధించామని, ఇదే స్ఫూర్తితో మరిన్ని శస్త్రచికిత్సలు నిర్వహించి రోగులకు ప్రాణదానం చేయాలని వైద్యులకు సూచించారు. ప్రభుత్వ రంగంలోని ఆస్పత్రులు కార్పొరేట్ ఆస్పత్రులతో పోటీ పడేలా వైద్య సేవలుండాలన్నారు. అందుకు ప్రభుత్వం అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు, అత్యాధునిక వైద్య పరికరాలు అందుబాటులోకి తెస్తుందన్నారు. ప్రభుత్వ వైద్యరంగంలో విప్లవాత్మకమైన మార్పులకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారని, ఆ ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment