రమణన్న.. ఇకలేరు! | chitoor mla venkata ramana died | Sakshi
Sakshi News home page

రమణన్న.. ఇకలేరు!

Published Tue, Dec 16 2014 2:09 AM | Last Updated on Mon, Aug 20 2018 2:31 PM

రమణన్న.. ఇకలేరు! - Sakshi

రమణన్న.. ఇకలేరు!

పేద కుటుంబంలో జన్మించి ఉన్నత స్థాయికి ఎదిగిన ఎమ్మెల్యే వెంకటరమణ
అనారోగ్యం బారినపడి కోలుకున్న నెల రోజులకే కబళించిన మృత్యువు
శోకసంద్రంలో కుటుంబ సభ్యులు, అభిమానులు.. దిగ్భ్రాంతికిలోనైన ప్రజానీకం

 
‘ఏమియా.. బాగుండావా.. దా కూచో..’, ‘ఏమ్మా తల్లి ఎట్టున్నావ్..’ అంటూ ఆప్యాయం గా పలకరించే తిరుపతి ఎమ్మెల్యే, తుడా(తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ) చైర్మన్ మన్నేరు వెంకటరమణ ఇక లేరు. అకాల మృత్యువు అనారోగ్య రూపంలో ఆయనను కబళించింది. వెంకటరమణ కుటుంబ సభ్యులను, అభిమానులను శోకసంద్రంలో ముంచింది. నిరుపేదల మనిషి మృతి ప్రజానీకాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. అనారోగ్యంబారిన పడి కోలుకున్నాడనుకున్న వెంకటరమణ నెల రోజుల్లోనే కన్నుమూయడం కలచివేసింది.
 
తిరుపతి: కొన్నాళ్లుగా మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న తిరుపతి ఎమ్మెల్యే వెంకటరమణ(67), నవంబర్ 15న తన ఇంట్లోనే స్పృహతప్పి కింద పడిపోవడంతో కుటుంబ సభ్యులు ఆయనను తిరుపతిలోని స్విమ్స్‌కు తరలించిన విషయం విదితమే. వారం రోజుల చికిత్స పొందిన తర్వాత ఆయన కోలుకుని ఇంటికి చేరుకున్నారు. అనారోగ్యం నుంచి కోలుకున్న వెంకటరమణను వివిధ రాజకీయపార్టీలకు చెందిన నేతలు పరామర్శించారు. స్విమ్స్ వైద్య నిపుణుల సూచనల మేరకు కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ కోసం సింగపూర్ వెళ్లడానికి ఏర్పాట్లు చేసుకున్న వెంకటరమణకు ఈనెల 8న గుండె సంబంధిత వ్యాధి తిరగబెట్టింది. దాంతో కుటుంబసభ్యులు హుటాహుటిన వెంకటరమణను చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. బుధవారం ఆయనకు గుండెపోటు రావడంతో అపోలో వైద్యులు ఓపెన్ హార్ట్ సర్జరీ చేశారు. ఊపిరితిత్తుల్లో చేరిన ఇన్‌ఫెక్షన్, వయోభారం వల్ల చికిత్సకు శరీరం సహకరించకపోవడంతో సోమవారం ఉదయం 10 గంటలకు వెంకటరమణ కన్నుమూశారు.

వెంకటరమణ మరణ వార్త విన్న కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. నిరుపేదల మనిషి ఇకలేరన్న వార్త విన్న ప్రజానీకం.. వెంకటరమణ ఇంటికి భారీ ఎత్తున చేరుకుంది. వెంకటరమణ భౌతికకాయాన్ని చెన్నై నుంచి సోమవారం మధ్యాహ్నం 3.45 గంటలకు తిరుపతికి తెచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డెప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప, మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి  తదితరులు వెంకటరమణ భౌతికకాయాన్ని సందర్శించి.. నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఎమ్మెల్యే వెంకటరమణ భౌతిక కాయానికి ప్రభుత్వ లాంఛనాలతో మంగళవారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఆయన భౌతిక కాయాన్ని ప్రజల సందర్శన కోసం మంగళవారం మున్సిపల్ గ్రౌండ్స్‌లో ఉంచనున్నారు.
 
మాస్ లీడర్‌గా ఎదిగి..


నిరుపేద కుటుంబంలో జన్మించిన వెంకటరమణ పేద ప్రజలకు అండగా ఎన్నో ప్రజా ఉద్యమాలు చేశారు. ఇది ఆయనను మాస్ లీడర్‌ను చేసింది. మాజీ ఎమ్మెల్యే మబ్బు రామిరెడ్డితో ఏర్పడిన సాన్నిహిత్యం 1974 ఆయనను కాంగ్రెస్‌పార్టీలో చేరడానికి దారితీసింది. మబ్బు రామిరెడ్డి దన్నుతో 1981లో తిరుపతి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఒకటో వార్డు కౌన్సిలర్‌గా పోటీచేసి గెలుపొందారు. 1987 ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికల్లో మరోసారి పోటీచేసి గెలుపొందిన వెంకటరమణ.. తిరుపతి మున్సిపల్ వైస్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. 1988లో టీటీడీ కో-ఆపరేటివ్ స్టోర్స్ ఎన్నికల్లో డెరైక్టర్‌గా గెలుపొందారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి మద్దతుతో 1999 ఎన్నికల్లో తిరుపతి శాసనసభ స్థానం కాంగ్రెస్ అభ్యర్థిత్వాన్ని దక్కించుకున్నారు. కానీ.. ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి చదవాలడ కృష్ణమూర్తి చేతిలో ఓడిపోయారు. 2004 ఎన్నికల్లో దివంగత సీఎం వైఎస్.రాజశేఖరరెడ్డి దన్నుతో తిరుపతి శాసనసభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిత్వాన్ని దక్కించుకున్న వెంకటరమణ.. టీడీపీ అభ్యర్థి చదలవాడ కృష్ణమూర్తిపై 47 వేల ఓట్లతో ఘనవిజయం సాధించారు. సినీ నటుడు చిరంజీవి ప్రజారాజ్యంపార్టీ స్థాపించి 2009 ఎన్నికల్లో తిరుపతి నుంచి శాసనసభకు పోటీ చేశారు. ఈ నేపథ్యంలో 2009 ఎన్నికల్లో వెంకటరమణకు కాంగ్రెస్ టికెట్ దక్కలేదు.

చిరంజీవి రాజీనామాతో 2012లో తిరుపతి శాసనసభ స్థానానికి నిర్వహించిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి.. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి భూమన కరుణాకర్‌రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డితో సాన్నిహిత్యం పెంచుకున్న వెంకటరమణ ఫిబ్రవరి, 2014లో తుడా చైర్మన్ పదవిని దక్కించుకున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటానికి నెల ముందు టీడీపీలో చేరిన వెంకటరమణ.. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా తిరుపతి నుంచి పోటీ చేసి 41,539 ఓట్లతో ఘన విజయం సాధించారు.
 
నాటక సినీరంగంలోనూ తనదైన ముద్ర

రాజకీయరంగంలోనే కాదు.. నాటక, సినీరంగాల్లోనూ వెంకటరమణ తనదైన ముద్ర వేశారు. తిరుపతిలో మా ర్చి 1, 1947లో హనుమంతయ్య, వెంకటమ్మ దంపతులకు జన్మించిన వెంకటరమణ ఎస్‌ఎస్‌ఎల్‌సీ వరకూ చదివారు. ఆ తర్వాత వ్యాపారంలోకి అడుగుపెట్టారు. ఓ వైపు వ్యాపారం చేస్తూనే మరో వైపు నాటకరంగంపై మక్కువ పెంచుకున్నారు. తిరుపతిలో వెంకటేశ్వర నా ట్య కళా పరిషత్‌లో సభ్యుడిగా చేరి.. పలు నాటకాల్లో కీలక పాత్రలు పోషించారు. దాసరి నారాయణరావు, చిత్తూరు ఎంపీ, దర్శకుడు ఎం.శివప్రసాద్, వంశీ, రే లంగి నర్సింహరావుల దర్శకత్వంలో పలు సినిమాల్లో నటించారు. తిరుపతిలో దాసరి నారాయణరావు, రేలం గి నరసింహారావులు చిత్రీకరించిన ప్రతి సినిమాలోనూ వెంకరమణ హాస్య పాత్రలు పోషించి మెప్పించారు.

రాజేంద్రప్రసాద్ హీరోగా నటించిన బ్రహ్మచారి మొగుడులో వెంకటరమణ పోషించిన పోస్టుమేన్ పాత్రకు విమర్శకుల నుంచి ప్రశంసలు లభించాయి. ‘అడవిలో అన్న’, ‘ఓరేయ్ రిక్షా’ సినిమాల్లో వెంకటరమణ చేసిన పాత్రలకు మంచి స్పందన గుర్తింపు లభించింది. వ్యాపారం, నాటక, సినిమా రంగాల్లో కొనసాగుతూనే రాజకీయాల్లోనూ రాణించిన వెంకటరమణ మరణాన్ని తిరుపతి ప్రజానీకం జీర్ణించుకోలేకపోతోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement