
డిజిటల్ ఆవిష్కరణలతో ఆరోగ్య సంరక్షణలో సరికొత్త మార్పులు వచ్చాయని అపోలో హాస్పిటల్స్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సంగీతా రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్‌లో జరుగుతున్న బయోఏషియా 2025 సదస్సులో పాల్గొన్న ఆమె 'ఇంటిగ్రేటెడ్ హెల్త్కేర్ అండ్ పేషెంట్ అవుట్‌కమ్స్' అనే అంశంపై జరిగిన ప్యానెల్ చర్చలో మాట్లాడారు.
ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ (ABDM) ఈ-సంజీవని టెలిమెడిసిన్ వంటి కార్యక్రమాల ప్రభావాన్ని ఎత్తి చూపారు. ఈ కార్యక్రమాలు ఆసుపత్రులు, డిజిటల్ హెల్త్ వేదికలు, ఇంటి ఆధారిత ఆరోగ్య సంరక్షణ మధ్య అంతరాలను పూడ్చాయని, ఎక్కువ మందికి ఆరోగ్య సంరక్షణ అందేలా చేశాయని వివరించారు. కోవిడ్ మహమ్మారి తర్వాత డిజిటల్ స్వీకరణ 300 శాతానికి పైగా పెరిగిందని, ఈ నేపథ్యంలో ఇంటిగ్రేటెడ్ హెల్త్‌కేర్ మోడల్స్ మరిన్ని రావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
టెక్నాలజీ పాత్ర
వైద్యుల నైపుణ్యాన్ని భర్తీ చేయడం కంటే, సాంకేతిక పరిజ్ఞానం క్లినికల్ ఎక్సలెన్స్ కు తోడ్పడాలని డాక్టర్ సంగీతా రెడ్డి అభిప్రాయపడ్డారు. మెరుగైన రోగ నిర్ధారణ, చికిత్స ప్రణాళిక, రోగి పర్యవేక్షణ కోసం కృత్రిమ మేధ ఆధారిత సాధనాలను అభివృద్ధి చేయడంపై దృష్టి సారించామని, ఇందులో భాగంగా మైక్రోసాఫ్ట్ తో అపోలో హాస్పిటల్స్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఏర్పరచుకున్నట్లు వెల్లడించారు.
ఎక్కువ మందికి చేరువ
ఆయుష్మాన్ భారత్, మైక్రో ఇన్సూరెన్స్ మోడల్స్, హెల్త్ కేర్ లెండింగ్ వంటి కార్యక్రమాల ప్రాముఖ్యతను డాక్టర్ సంగీతా రెడ్డి నొక్కి చెప్పారు. ఆర్థిక అడ్డంకులను తగ్గించడానికి, టైర్ -2 నగరాలు, అణగారిన కమ్యూనిటీలకు నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను చేరువ చేసేందుకు ఈ చర్యలు అవసరమని ఉద్ఘాటించారు. అధునాతన చికిత్సలను అందుబాటులోకి తీసుకురావడం, నివారణ చేయడంలోనే ఆరోగ్య సంరక్షణ భవిష్యత్తు ఉందని ఆమె స్పష్టం చేశారు. అత్యాధునిక ఆవిష్కరణలను క్లినికల్ నైపుణ్యంతో మిళితం చేయడం ద్వారా ముదిరిపోక ముందే వ్యాధి భారాన్ని తగ్గించవచ్చని అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment