Sangita reddy
-
సీఎం సహాయనిధికి విరాళాల వెల్లువ
సాక్షి, హైదరాబాద్: వరద సహాయక చర్యల నిమిత్తం పలు సంస్థల నుంచి ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు వెల్లువలా వస్తున్నా యి. జీఎంఆర్ గ్రూప్ సంస్థల నుంచి రూ.2.5 కోట్లు విరాళంగా ప్రకటించారు. కెమిలాయిడ్స్ కంపెనీ చైర్మన్ రంగరాజు రూ.కోటి విరాళం ఇవ్వగా, శ్రీచైతన్య విద్యాసంస్థలు రూ.కోటి, విర్కో ఫార్మా రూ.కోటి, అపోలో హాస్పిటల్స్ జేఎండీ సంగీతారెడ్డి రూ.కోటి విరాళంగా అందజేసినట్లు శుక్రవారం సీఎం కార్యాలయ వర్గాలు వెల్లడించాయి.అలాగే భువనగిరి ఎంపీ చామల కిరణ్‌రెడ్డి వరద బాధితులకు తన వంతుగా నెల వేతనాన్ని విరాళంగా ప్రకటించారు. ఈ మేరకు శుక్రవారం సచివాలయంలో ము ఖ్యమంత్రి ప్రత్యేక అధికారి (ఓఎస్డీ) వేముల శ్రీనివాసులును కలిసి రూ.1.85 లక్షల చెక్కు ను అందజేశారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, వాణిజ్య సంఘాలు, కార్పొరేట్ సంస్థలు తమ వంతు విరాళాలు ఇచ్చి వరద బాధితుల పక్షాన నిలవాలని కోరారు. -
ముందస్తు గుర్తింపుతో గుండె ముప్పునకు చెక్.. వారిలో 63% మందికి 3 నాళాలు బ్లాక్?
సాక్షి, హైదరాబాద్: బయో ఆసియా సదస్సు–2023 రెండోరోజు కార్య క్రమాల్లో భాగంగా శనివారం జరిగిన ముఖా ముఖి సంభాషణలో దిగ్గజ సంస్థ యాపిల్ వైస్ ప్రెసిడెంట్ (హెల్త్) డాక్టర్ సుంబుల్ దేశాయ్, అపోలో హాస్పిటల్స్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సంగీతరెడ్డి పాల్గొన్నారు. ప్రజారోగ్యం, సాంకేతిక పరిజ్ఞాన ప్రభావం అనే అంశాలపై చర్చించారు. ఆరోగ్య సమాజం కోసం యాపిల్ చేస్తున్న కృషిని డాక్టర్ సుంబుల్ దేశాయ్ వివరించగా అపోలో హాస్పిటల్స్ ద్వారా వైద్య సేవలందిస్తున్న తీరు ను, భవిష్యత్ కార్యాచరణను డాక్టర్ సంగీతారెడ్డి ప్రస్తావించారు. అవి వారి మాటల్లోనే.. సంగీత: లింగ సమానత్వం, సాంకేతిక పరిజ్ఞానంలో భారత్ ప్రపంచంలో మేటిగా ఉంది. కానీ ప్రస్తుత సవాళ్లలో ప్రజారోగ్య పరిరక్షణ అతిపెద్దది. దీనికి పరిష్కారాలను చూపుతున్నప్పటికీ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. మీ ప్రస్థానాన్ని ఒక ప్రాంతంలో ప్రారంభించి మరో చోటకు మారారు. మిమ్మల్ని ఉత్తేజపర్చిందేమిటి? సుంబుల్: ఏ పని చేసినా అర్థవంతంగా ఉండాలి. ప్రతి వ్యక్తి ఆరోగ్యకరంగా జీవించాలనే అంశానికి యాపిల్ అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మా ణాన్ని కాంక్షిస్తున్న యాపిల్ లక్ష్యం ఆ సంస్థ ఉద్యోగిగా నన్ను ఎంతో ఉత్తేజపరుస్తోంది. సంగీత: విజ్ఞానాన్ని పంచుకోవడానికి సాంకేతికత ఇప్పుడు కేంద్రంగా ఉందంటారా? సుంబుల్: అవును. నేను దాని గురించి మిమ్మల్ని అడగబోతున్నాను. అపోలో ద్వారా వైద్యసేవలందిస్తున్న మీరు ఆరోగ్యకర జీవన అంశాన్ని ఎలా ఎదుర్కొంటున్నారు? సంగీత: గుండెపోటు అనేది ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద కిల్లర్‌గా మారుతోంది. దీని ముందస్తు హెచ్చరిక లక్షణాల గురించిన విశ్లేషణలను ప్రజల చేతుల్లో ఉంచేలా చర్యలు తీసుకోవాలి. రెండు వారాల క్రితం మేము క్లినికల్ ఇంటెలిజెన్స్ ఇంజిన్‌ను ప్రారంభించాం. ఇది దేశంలోని వైద్యులకు ఉచితంగా విడుదల చేయాలని భావిస్తున్నాం. మీరు మహిళల ఆరోగ్యం కోసం ఏం చేస్తున్నారు? సుంబుల్: మా ప్రాధాన్యతలో కీలకమైన అంశం మహిళల ఆరోగ్యం. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక చాప్టర్‌ను తెరిచాం. మహిళల కోసం సైకిల్ ట్రాకింగ్‌ను ప్రవేశపెట్టాం. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆరోగ్య సంరక్షణ కార్మికుల కొరతను అధిగమించేందుకు మీరు ఏం ఆలోచిస్తున్నారు? సంగీత: కృత్రిమ మేధను మరింత విస్తృతం చేస్తున్నాం. దీంతో ఆరోగ్య సంరక్షణ రంగానికి కొంత వెసులుబాటు కలుగుతోంది. కానీ నిపుణుల కొరతను అధిగమించేందుకు యుద్ధప్రాతిపదిక చర్యలు అవసరం. సుంబుల్: జీ–20 స్టాండ్ పాయింట్... మహిళలు ఎలాంటి పాత్ర పోషిస్తున్నారు? సంగీత: ఆరోగ్య సంరక్షణలో, స్త్రీ పురుషుల మధ్య వ్యత్యాసం నిజంగా తగ్గింది. ప్రస్తుతం ఆరోగ్య సంరక్షణలో మహిళలు 60 శాతం ఉన్నారు. మహిళలకు అవకాశాలు అపారమవుతున్నాయి. నాయకత్వం శారీరక బలంతో కాదు.. మానసిక పరాక్రమంతో సాధ్యమవుతుంది. సంగీత: అపోలోను 40 ఏళ్ల క్రితం ప్రారంభించాం. అత్యాధునిక ఆరోగ్య సేవలను ప్రజలకు వేగంగా అందించాలనే లక్ష్యంతో అడుగులు వేశాం. కానీ ఇప్పటికీ ముందస్తు వ్యాధి నిర్ధారణ సవాలుగానే ఉంది. సాంకేతికత ఎంతలా అభివృద్ధి చెందినప్పటికీ క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. దేశంలోని కార్డియాక్ పేషంట్లలో 63 శాతం మందిలో గుండెలో మూడు నాళాలు మూసుకుపోయాయి. మొదటి నాళం మూసుకున్నప్పుడే విషయాన్ని గుర్తిస్తే పరిస్థితి ఇంకోలా ఉంటుంది. అలాగే కేన్సర్ రోగుల్లో 73 శాతం మంది మూడో దశ, నాలుగో దశలోనే వ్యాధి బయటపడుతోంది. వారిని మొదటి దశలోనే గుర్తించగలిగితే చరిత్రను తిరగరాయొచ్చు. వాటి గుర్తింపునకు కృత్రిమ మేధ (ఏఐ) మరింత విస్తృతంగా అందుబాటులోకి రావాలి. దీనిపై యాపిల్ ఏవిధంగా ఆలోచిస్తోంది? సుంబుల్: ప్రజారోగ్యానికి యాపిల్ అత్యంత ప్రాధాన్యం ఇస్తుంది. ఇందులో భాగంగా ఆరోగ్య అంశాల కోసం యాప్‌లు తీసుకొచ్చాం. గుండె స్పందన, నడక తదితరాల కోసం ప్రత్యేక ఫీచర్లు అందించాం. ఇంకా ఎన్నో రకాలను ఆవిష్కరిస్తున్నాం. దీంతోపాటు మహిళల ఆరోగ్యంపై కూడా దృష్టి సారించాం. -
సంగీతారెడ్డికి గౌరవ డాక్టరేట్
మక్వారీ యూనివర్సిటీ ప్రదానం సాక్షి, హైదరాబాద్: ఆస్ట్రేలియాకు చెందిన మక్వారీ యూనివర్సిటీ గురువారం అపోలో హాస్పిటల్స్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సంగీతారెడ్డికి గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. భారత్‌లో ఆరోగ్య సంరక్షణ కోసం చేపడుతున్న అనేక మార్పులకు, ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్య సమాచార సాంకేతికతలో చేస్తున్న కృషికి, నిబద్ధతకు గుర్తింపుగా ఆమెకు ఈ డాక్టరేట్ దక్కింది. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో మాక్క్యూరీ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ ఎస్ బ్రూస్ డౌటన్ డాక్టరేట్‌ను ప్రదానం చేశారు. రెండు సంస్థల మధ్య ఒప్పందం...: మక్వారీ వర్సిటీ, అపోలో హాస్పిటల్స్... పరస్పర ప్రయోజనాలు కలిగించే దీర్ఘకాలిక విద్యా మార్పిడిని చేపట్టాయి. ఈ ఒప్పందంలో భాగంగా... మక్వారీ పరిధిలోని నాలుగేళ్ల డాక్టర్ ఆఫ్ మెడిసిన్ ప్రోగ్రామ్‌లో భాగంగా విద్యార్థులు.. ఇకపై హైదరాబాద్‌లోని అపోలోలో 5 నెలలపాటు నిర్వహించే క్లినికల్ లెర్నింగ్‌ను పూర్తి చేస్తారు. కాగా, మక్వారీ విశ్వవిద్యాలయం అందిస్తున్న ఎండీ ప్రోగ్రామ్‌తో కలిసి పని చేయడం ఆనందంగా ఉందని అపోలో హాస్పిటల్స్ గ్రూప్ చైర్మన్ ప్రతాప్.సి.రెడ్డి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.