
కిడ్నీల కోసం బాలుడి కిడ్నాప్!
చాకచక్యంగా తప్పించుకున్న రాహుల్
వికారాబాద్ రూరల్: కిడ్నీలు తీసి అమ్ముకొనేందుకు ఓ 11 ఏళ్ల బాలుడ్ని గుర్తు తెలియని దుండగులు కిడ్నాప్ చేశారు. బలవంతంగా కారులో ఎక్కించుకుని వెళుతుండగా.. ఆ బాలుడు చాకచక్యంగా తప్పించుకున్నాడు. రంగారెడ్డి జిల్లా వికారాబాద్ పట్టణంలో శుక్రవారం పట్టణంలో ఈ ఘటన జరిగింది. రంగారెడ్డి జిల్లా దోమ మండలం బ్రహ్మణపల్లి తండాకు చెందిన నేనావత్ తార్యా కుమారుడు రాహుల్ (11) ముజాహిద్‌పూర్‌లోని ఎస్టీ హాస్టల్‌లో 6వ తరగతి చదువుతున్నాడు. రెండు రోజుల కింద గణేశ్ నిమజ్జనం కోసం తండాకు వచ్చిన రాహుల్... శుక్రవారం తిరిగి హాస్టల్‌కు బయలుదేరాడు. పరిగికి చేరుకున్నాక గుర్తు తెలియని దుండగులు బిస్కెట్లు ఇస్తామని, రూ.1,000 ఇస్తామని ఆశ చూపి రాహుల్‌ను కారు ఎక్కించుకునే ప్రయత్నం చేశారు.
వారికి లొంగని రాహుల్ కొద్దిదూరం ముందుకు వెళ్లాడు. ఇంతలోనే దుండగులు కారులో వచ్చి బలవంతంగా ఎక్కించుకున్నారు. రాహుల్‌ను కొడుతూ.. మీ దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నారుు, మీ నాన్న ఏం చేస్తాడంటూ ప్రశ్నించారు. తన తండి వ్యవసాయం చేస్తాడని చెప్పడంతో... ‘నీ నుంచి డబ్బులు రావు.. నీ కిడ్నీలు తీసి అమ్ముకుంటా’మన్నారు. అలా వారు మధ్యాహ్నం 3 గంటల సమయంలో వికారాబాద్‌కు చేరుకున్నారు. వికారాబాద్ నుంచి తాండూరుకు వెళ్లే మార్గంలో కాలకృత్యాల కోసం కారు ఆపగా.. రాహుల్ ఒక్కసారిగా బయటకు దూకి తప్పించుకున్నాడు. అదే సమయంలో ఓ పోలీస్ వాహనం రావడంతో దుండగులు పరారయ్యాడు. రాహుల్ వికారాబాద్ పట్టణంలోకి వెళ్లి.. స్థానికుల సహాయంతో తండ్రికి సమాచారమిచ్చాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని బాలుడి వద్ద వివరాలు తెలుసుకున్నారు. దుండగుల కోసం గాలిస్తున్నారు.