నలుదిశలా వేదనాదం!
సనాతన భారతీయ సంప్రదాయాన్ని దశదిశలా చాటి చెప్పే ఉద్దేశంతో కీసర మండలంలో నెలకొల్పిన వేద పాఠశాల దేదీప్యమానంగా విరాజిల్లుతోంది. విద్యార్థులను వేదాల్లో నిష్ణాతులుగా మలచి పురాతన హిందూ సంస్కతీ సంప్రదాయాలను భవిష్యత్తు తరాలకు కానుకగా అందజేస్తోంది. ముగ్గురు విద్యార్థులతో ప్రారంభమైన ఈ పాఠశాల ప్రస్తుతం వేదాల బోధనకు దేశంలోనే ప్రసిద్ధిగాంచింది. టీటీడీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ పాఠశాల శనివారంతో 34వ పడిలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ప్రత్యేక కథనం..
కీసర:
దక్షిణ భారతదేశంలో ఉన్నత ప్రమాణాలతో కూడిన వేదవిద్యను అందిస్తున్న కీసరగుట్ట టీటీడీ వేదపాఠశాల నేటితో 33 వసంతాలు పూర్తిచేసుకుంటోంది. 1981లో ముగ్గురు విద్యార్థులతో ప్రారంభమైన ఈ విద్యాలయం దినదిన ప్రవర్థమానం చెందుతూ దక్షణ భారతవనిలోనే వేదాల బోధనకు పేరుగాంచింది. ప్రాచీన గురుకుల సంప్రదాయన్ని అనుసరిస్తూ క్రమశిక్షణతో కూడిన వేద విద్యను ఇక్కడ నిష్ణాతులైన ఆచార్యులు బోధిస్తున్నారు.
వేద పండితులైన ఆచార్యుల సంరక్షణలో విద్యార్థులు వేదాన్ని, శైవాగమాన్ని, స్మార్తాన్ని నేర్చుకుంటున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ విద్యాలయంలో ఇటీవలే పెద్ద ఎత్తున మౌలిక వసతులు కల్పించారు.
విశాలమైన స్థలంలో ప్రార్థనా మందిరం, విశ్రాంతి గదులు, తరగతి గదులు తదితర సౌకర్యాలతో ఈ పాఠశాల కొనసాగుతోంది. వేద విద్యాలయాలను ఉన్నతంగా తీర్చిదిద్దాలన్న టీటీడీ ఆశయాలకు అనుగుణంగా కీసరగుట్ట వేదపాఠశాల ఇప్పటి వరకు ఎందరినో ఉన్నతులుగా తీర్చిదిద్దింది. ఇక్కడ విద్యను అభ్యసించిన వారు దేశంలోని వివిధప్రాంతాల్లో ఆచార్యులుగా, ఆలయ పూజారులుగా, పురోహితులుగా పని చేస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ కృష్ణ యజుర్వేదం (12 సంవత్సరాలు), శైవాగమం, స్మార్తం (8 సంవత్సరాలు) కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం ఈ పాఠశాల్లో 125 విద్యార్థులు వేద విద్యను అభ్యసిస్తున్నారు.
నేడు స్నాతకోత్సవం
కీసర గుట్ట వేదపాఠశాల స్నాతకోత్సవం శనివారం ఉదయం 9 గంటలకు జరగనుంది. టీటీడీ ఈఓ జి. గోపాల్ ముఖ్యఅతిథిగా హాజరవుతున్న ఈ కార్యక్రమంలో వేదవిద్యను పూర్తిచేసుకున్న 16 మంది విద్యార్థులకు (కృష్ణయజుర్వేదం-1, శైవాగమం-6 , స్మార్తం-9 ) పట్టాలతోపాటు, నగదు పురస్కారాన్ని అందజేయనున్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులను సత్కరిస్తారు.
పెద్దమొత్తంలో విద్యార్థులకు గౌరవభృతి
కీసరగుట్ట వేదపాఠశాలలో వివిధ కోర్సులు పూర్తి చేసుకున్న విద్యార్థులకు టీటీడీ ఇచ్చే గౌరవభృతి పెద్ద మొత్తంలో ఉంటుంది. విద్యార్థులు ఈ పాఠశాలలో చేరిన రోజే ఈ మొత్తాన్ని వారి బ్యాంకు అకౌంట్లో జమ చేస్తుండటం విశేషం. వేదవిద్య కోర్సు పూర్తిచేసుకున్న విద్యార్థికి రూ 4.64 లక్షలు, శైవాగమం పూర్తి చేసుకున్న విద్యార్థులకు 1.91 లక్షల నగదుపాటు సర్టిఫికెట్లు కూడా అందజేస్తారు.