స్ఫూర్తిని మరిచారు
రియో డి జనీరో : స్నేహం.. సౌభ్రాతృత్వానికి మారుపేరుగా ఒలింపిక్స్‌ను పేర్కొంటారు. రెండు వారాలపాటు అంతా ఒక్కటై కలివిడిగా ఉంటూ క్రీడా స్ఫూర్తితో పోటీల్లో పాల్గొనేందుకు ఇదో చక్కటి వేదిక. కానీ ఇక్కడ కూడా తమ జాతి ‘ప్రయోజనా’లే ముఖ్యమని లెబనాన్ అథ్లెట్లు భావించినట్టున్నారు. ప్రారంభ వేడుకల్లో పాల్గొనేందుకు ఏర్పాటు చేసిన బస్‌లో లెబనాన్, ఇజ్రాయెల్ అథ్లెట్లు కలిసి వెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ విషయం తెలియని లెబనాన్ ఆటగాళ్లు ముందుగా ఎక్కి కూర్చున్నారు. అనంతరం ఇజ్రాయెల్ ఆటగాళ్లు లోనికి రావడంతో అగ్గిమీద గుగ్గిలమయ్యారు. వారిని డోర్ దగ్గరే అడ్డుకోవడంతో తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. చివరికి ఇజ్రాయెల్ వారిని వేరే బస్‌లో పంపడంతో పరిస్థితి సద్దుమణిగింది. ఇలా ప్రవర్తించడం ఒలింపిక్ చార్టర్‌ను అవమానించినట్టే అని ఇజ్రాయిల్ అధికారులు విమర్శిస్తున్నారు.
వాండర్లీకి అనుకోని అదృష్టం
ఏ దేశంలో ఒలింపిక్స్ జరిగినా జ్యోతి ప్రజ్వలన చేసేది ఎవరనే ఆసక్తి అందరికీ ఉంటుంది. దానికున్న ప్రాముఖ్యత అలాంటిది. రియో ఒలింపిక్స్‌లో ఇలాంటి అరుదైన అవకాశం మాజీ అథ్లెట్ వాండర్లీ డి లిమాకు చివరి నిమిషంలో దక్కింది. నిజానికి ఒలింపిక్స్ జ్యోతిని ఫుట్‌బాల్ దిగ్గజం పీలే వెలిగించాల్సి ఉంది. కానీ అనారోగ్య కారణాలతో తాను తప్పుకుంటున్నట్టు నిర్వాహకులకు తెలపడంతో కేవలం కార్యక్రమానికి ఓ గంట ముందే 46 ఏళ్ల వాండర్లీని ఇందుకోసం ఆహ్వానించారు. జ్యోతిని వెలిగిస్తానని తాను కలలో కూడా అనుకోలేదని ఆయన తెలిపారు.