నిజాం హయాంలో ఎక్కువ రాబడి వచ్చిన సంస్థానం
శిథిలావస్థకు చేరుతున్న శతాబ్దాల చరిత్ర
కోటలో పలు సినిమాలు, షార్ట్ ఫిలిమ్స్ చిత్రీకరణ
అమలుకాని పర్యాటక హబ్ ప్రతిపాదనలు
యాదగిరిగుట్ట: నిజాం ప్రభువులకు లక్షలాది రూపాయల కప్పం కట్టిన సంపన్న సంస్థానం.. ఒకప్పుడు అద్భుతమైన కట్టడంగా భాసిల్లిన కోట నిర్మాణం.. అదే.. తెలంగాణ రాష్ట్రంలో ఎంతో ప్రసిద్ధి చెందిన రాజకోట. 250 ఏళ్ల చరిత్ర కలిగిన రాతి కట్టడాల నిలయంగా.. రాచరికపు మహోన్నత వైభవానికి.. చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలిచింది రాజాపేటలోని (Rajapeta) రాజావారి కోట.
హైదరాబాద్‌కు (Hyderabad) 90 కిలోమీటర్లు.. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు (Aler) నియోజకవర్గంలోని యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. నిజాం రాజ్యంలోని అన్ని సంస్థానాల కన్నా ఎక్కువ రాబడి ఈ సంస్థానం నుంచే వచ్చేదని చరిత్రకారులు చెబుతారు. అంతేకాదు.. గొప్ప కట్టడాలున్న సంస్థానంగా కూడా పేరు ఉండేది. ఇక్కడ చిన్న చిన్న షూటింగ్‌లు, ఫొటో షూట్లు సైతం జరుగుతుంటాయి. కోటలోని అద్భుత శిల్ప కళా సంపద అప్పటి శిల్పుల గొప్పతనాన్ని చాటుతుంది.
కోట చరిత్ర
రాజాపేట గ్రామానికి పడమటి భాగంలో గోపాలపురం (Gopalapuram) అనే గ్రామం ఉండేది. గ్రామం పైభాగంలో చెరువు ఉండేది. ఆ చెరువు వరద ముంపునకు గురైన గోపాలపురం గ్రామం కాలగర్భంలో కలిసిపోయింది. అనంతరం రాజ రాయన్న అనే రాజు 1775లో కోటను నిర్మించి గ్రామాన్ని ఏర్పాటు చేశాడు. రాజ రాయన్న పాలన సాగించిన కోటనే నేడు రాజాపేటగా పిలుస్తున్నారు. రాజాపేట గ్రామం చుట్టూ కందకం తవ్వారు. కోట గోడ ప్రాకారం, ఎత్తయిన రాతి గోడలతో చుట్టూ శత్రు దుర్భేద్యంగా నిర్మించారు. గ్రామం మధ్యలో ఉండేలా.. మూడు ప్రధాన ద్వారాలు ఏర్పాటు చేశారు.
ఎగువ పడమటి వైపున్న గోపాల చెరువు నుంచి కందకంలో నీరు పారేలా ఏర్పాట్లు చేసి.. శత్రువులు చొరబడకుండా మొసళ్లను పెంచేవారు. గ్రామం లోపలి ప్రధాన ద్వారం దాటితే రాజ నివాసం, అంతఃపురం, అద్దాల మేడ, అతిథి గృహం, నీటి కొలను, గిరిగిరి మాల్, ఏనుగుల మోట, ఖైదీల కారాగారం, సైనికుల శిక్షణ స్థలం వంటివి కనిపిస్తాయి. శత్రువుల నుంచి కోటను రక్షించేందుకు చుట్టూ నిర్మించిన ఎత్తయిన బురుజులు పర్యాటకులను ఎంతో ఆకర్షిస్తాయి. వారి ప్రాణాలను రక్షించుకునేందుకు కోట నుంచి బయటికెళ్లేందుకు సొరంగ మార్గాలున్నాయి.
పర్యాటకుల తాకిడి.. సినిమా షూటింగ్‌లు..
రాజకోటలో బురుజులు, అంతఃపురం, నీటి కొలను, సైనిక ప్రాంగణం, ఏనుగుల మోట, గిరిగిరిమాల్ తదితర అద్భుత నిర్మాణాలు.. సినిమా షూటింగ్‌లు, ఫొటోషూట్‌కు అనుకూలంగా ఉన్నాయి. యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి క్షేత్రానికి 20 కిలోమీటర్ల దూరంలో, సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లన్న, కొండపోచమ్మ ఆలయాలకు వెళ్లే మార్గాల్లో ఈ కోట ఉండటంతో పర్యాటకులు సందర్శించేందుకు వీలుంది. ఇప్పటికే షార్ట్ ఫిలిమ్స్‌తో పాటు పలువురు ప్రీ వెడ్డింగ్ (Pre Wedding) షూట్లు ఇక్కడ తీస్తున్నారు.
అభివృద్ధికి నోచుకోని గడికోట
రాజకోట రాజవంశీకులు ఈ కోటను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని గతంలో నిర్ణయించారు. దీంతో పర్యాటక శాఖాధికారులు రాజకోటను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో 2019 అక్టోబర్ 29న పర్యాటక శాఖాధికారులు గడిని సందర్శించారు. అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు కేటాయించి యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రం, తుర్కపల్లి మండలం గంధమల్ల చెరువు, రాజాపేట గడికోట, కొలనుపాకలోని జైన్ మందిర్, సోమేశ్వర ఆలయాలను కలుపుతూ టూరిజం హబ్ ఏర్పాటు చేస్తామని ప్రకటించినా కార్యరూపం దాల్చలేదు.
భావితరాలకు అందించాలి
రాజకోటను తిలకించేందుకు పర్యాటకులు, సినీ నటులు తరచూ వస్తున్నారు. కోటలో ఇప్పటికే పలు సినిమాలు, షార్ట్ ఫిలిమ్స్, ప్రీ వెడ్డింగ్ షూట్లు జరిగాయి. 250 ఏళ్ల చరిత్ర కలిగిన రాజకోటను భావితరాలకు అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించి, టూరిజం స్పాట్‌గా తీర్చిదిద్దాలి.
– కొత్తకొండ భాస్కర్, రాజాపేట గ్రామస్తుడు
రాజకోటను పరిరక్షించాలి
మా కాలంలో ఈ కోట ఎంతో అద్భుతంగా ఉండేది. కానీ ఇప్పుడు నిరాదరణకు గురైంది. ఎంతో చరిత్ర కలిగిన రాజాపేటలోని రాజకోటను అభివృద్ధి చేయాలి. ఇందుకు ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించాలి. తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలైన యాదగిరిగుట్ట, కొమురవెల్లి ఆలయాలకు అతి సమీపంలోని ఈ కోటను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలి.
– పుల్లంగారి సిద్ధయ్య, రాజాపేట
Comments
Please login to add a commentAdd a comment