వలస కార్మికులకు ఉపాధి కేంద్రంగా యాదాద్రి భువనగిరి జిల్లా
ఇతర రాష్ట్రాల నుంచి నిత్యం వలస కార్మికుల రాక
పలు రకాల పనులు చేస్తూ ఉపాధి పొందుతున్న వైనం
జిల్లాలో 30 వేల మందికి పైగా వలస కార్మికులు
సాక్షి, యాదాద్రి: ఒకప్పుడు వలసలకు కేంద్రమైన యాదాద్రి భువనగిరి జిల్లా ఇప్పుడు వలస కార్మికులకు ఉపాధి అడ్డాగా మారింది. ఉపాధి లేక ముంబై, భివండీ, సోలాపూర్, బెంగళూరు, ఆంధ్ర, సూరత్ వంటి పట్టణాలకు జిల్లాలోని అన్ని గ్రామాల నుంచి నిరంతరం వలసలు సాగేవి. కానీ ఇప్పుడు వ్యవసాయం, పరిశ్రమలు, గృహనిర్మాణ రంగాలు పుంజుకోవడంతో వివిధ రకాల పనులు ఊపందుకున్నాయి. దీంతో కూలీల కొరత నెలకొనడంతో జిల్లాకు దేశంలోని పలు రాష్ట్రాల నుంచి కార్మికులు వలసవచ్చి ఉపాధి పొందుతున్నారు.
30 వేల మందికి పైగా..
ఉత్తరప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, పశ్చిమబెంగాల్, అసోం, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలకు చెందిన వేలమంది జిల్లాలో ఉపాధి పొందుతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి యాదాద్రి జిల్లాకు రైళ్లు, బస్సులు అందుబాటులో ఉండటంతో కార్మికులు నేరుగా చేరుకుంటున్నారు. జిల్లాలోని 17 మండలాలు, 6 మున్సిపాలిటీల్లో 30 వేలకు పైగా ఇతర రాష్ట్రాల కార్మికులు పలు రకాల పనులు చేస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ రైస్ మిల్లులు, హోటళ్లు, భవన నిర్మాణం, ఇటుక బట్టీలు, టైల్స్, పీవోపీ, పౌల్ట్రీ, ఎయిమ్స్, కంపెనీలు, వ్యవసాయ కార్మికులుగా పనిచేస్తున్నారు. చౌటుప్పల్, బీబీనగర్ పారిశ్రామిక వాడల్లో వీరు ఎక్కువగా ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా రైస్‌మిల్లులు, భవన నిర్మాణ పనులు, వ్యవసాయంలో నాట్లువేయడం, పత్తి ఏరడం తదితర పనులు చేస్తున్నారు. బార్బర్ పని, హోటళ్లలో మాస్టర్‌లు, వెయిటర్‌లు, ఇలా ఒకటేమిటి అన్ని రకాల పనులు చేస్తున్నారు.
ఒక్కో రాష్ట్రం కార్మికులది ఒక్కో ప్రత్యేకత
బిహార్, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు వలస వచ్చిన వారు జిల్లాలోని రైస్ మిల్లులు, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో హమాలీ పనులు చేస్తుండగా.. ఛత్తీస్‌గఢ్ నుంచి వచ్చిన వారు భవన నిర్మాణంలో తాపీ మేస్త్రీలుగా, పార కూలీలుగా.. రాజస్తాన్ నుంచి వచ్చిన వారు హోటళ్లు, పీవోపీ, హార్డ్‌వేర్ దుకాణాల్లో పనిచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన వారు పత్తి ఏరడం, పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చిన వారు పొలంలో నాట్లు వేయడం లాంటి పనులు చేసి జీవనోపాధి పొందుతున్నారు.
అధికంగా రైస్ మిల్లుల్లో..
ఒక్కో రైస్ మిల్లులో 20 నుంచి 30 మంది కార్మికులు పనిచేస్తారు. ఒక గుంపునకు ఒక ముఠామేస్త్రి కార్మికులను సూపర్‌వైజ్ చేస్తారు. అందరికంటే ముఠామేస్త్రికి కాస్త కూలి ఎక్కువగా ఉంటుంది .రైస్ మిల్లుల్లో మిల్లు డ్రైవర్, ప్లాంటు డ్రైవర్, హమాలీలుగా పని చేస్తారు. మిల్లు ప్లాంటు, డ్రైవర్లకు రోజుకు సుమారు రూ.800 కూలి పడుతుంది. మిల్లుకు వచ్చే లారీల ధాన్యం లోడింగ్, అన్‌లోడింగ్, హమాలీ కార్మికులు చేస్తారు. వీరికి రోజుకు సుమారు రూ.500 కూలి పడుతుంది. మిల్లు యజమానులు వీరికి భోజనం, వసతి కల్పిస్తారు.
అడ్వాన్స్‌లు చెల్లించి మరీ..
పలు గ్రామాల్లో గల ఇటుక బట్టీల్లో సుమారు 6,000కుపైగా ఒడిశా కార్మికులు పనిచేస్తున్నారు. నాలుగు నెలల పనుల నిమిత్తం ఒక్కొక్కరికి రూ.50 వేల అడ్వాన్స్ చెల్లించి ఇటుక బట్టీ యజమానులు పనులకు తీసుకువస్తారు. ఒక్కో వ్యక్తికి వారానికి రూ.వెయ్యి చొప్పున కిరాణా సరుకుల కోసం ఖర్చులు ఇవ్వడంతో పాటు వారు చేసిన పనులను బట్టి రూ.2 వేల నుంచి రూ.2,500 వరకు అడ్వాన్స్‌లో కటింగ్ చేస్తారు. ఒడిశా కూలీలు తాము తీసుకున్న అడ్వాన్స్‌కు సరిపోను ఈ నాలుగు నెలల కాలంలో పనులు చేస్తారు.
చదవండి: రియల్‌ఎస్టేట్ పడిపోతే పోయేదేం లేదు.. ఎమ్మెల్యే కాటిపల్లి
బెంగాల్ నుంచి వచ్చాను
మాది పశ్చిమబెంగాల్‌లోని దక్షిణ 24 పరగణాల జిల్లా గొసాబా. మా రాష్ట్రంలో పనులు లేవు. ఉపాధికోసం భువనగిరికి వచ్చాం. తిండి, వసతి ఖర్చులు లేకుండా పనిచేసే గ్రామాల్లోనే షెల్టర్ వెతుక్కుంటున్నాం. ఒక్కొక్కరం రోజుకు రూ.1,000 దాకా సంపాదిస్తాం. దాదాపుగా రెండు నెలల పాటు పనులు చేసి తిరిగివెళ్తాం. కుటుంబ పోషణ చూసుకుని మరో సారి వస్తాం. ఇలా సంవత్సరానికి రెండు మూడుసార్లు వస్తాం. ఇక్కడ పనులకు కొరతలేదు.
– దాలీమ్‌షేక్, పశ్చిమబెంగాల్
మూడు నెలలు ఇక్కడే
మా రాష్ట్రం ఛత్తీస్‌గఢ్‌లో సరైన ఉపాధి అవకాశాలు లేవు. ఏడాదిలో ఒక సీజన్‌లో కూడా పని దొరకదు. సాగు అంతంత మాత్రమే. అందుకే మేమంతా తెలంగాణకు వస్తున్నాం. ఇక్కడ మాకు కూలి గిట్టుబాటు అవుతుంది. ఏడాదిలో మూడు నెలలు ఇక్కడే ఉంటాం ధాన్యం ఎత్తడం, దించడం వంటి హమాలీ కూలి పని చేస్తాం. ఉప్పరి మేస్త్రీ పనికి వెళ్తాం.
– మహబూబ్ ఆలమ్, ఛత్తీస్‌గఢ్
ఇక్కడ ఉపాధికి కొదవలేదు
ఇక్కడ ఉపాధికి కొదవ లేదు. మహారాష్ట్ర నుంచి వచ్చాం. రెండు నెలలు ఇక్కడ పని చేసుకుంటాం. రోజుకు ఖర్చులు పోను రూ.500 సంపాదిస్తాం. హమాలీ, మేస్త్రీ, ఇతర పనులు చేస్తాం. పనులు పూర్తి అయిన తర్వాత వెళ్లిపోతాం. మాకు భోజనానికి బియ్యం, ఉండటానికి ఇళ్లు, తాగునీరు, వైద్య సౌకర్యం, వసతులు పని ఇచ్చే వారే చూసుకుంటారు. ఉమ్మడి స్నేహితులతో కలిసి వస్తాం పనిచేసి డబ్బు సంపాదించుకుంటాం.
– అన్వర్, మహారాష్ట్ర
రోజుకు రూ.1,000 సంపాదిస్తున్న
జీవనోపాధి కోసం ఒడిశా నుంచి యాదగిరిగుట్టకు వచ్చాం. దాదాపు సంవత్సరం అవుతోంది. ఇక్కడ బిర్యానీ హోటల్‌లో పనిచేస్తూ బతుకుతున్నాను. రోజుకి రూ.1,000 సంపాదిస్తున్నాను. ప్రస్తుతం అయితే డబ్బుల కోసం కష్టపడుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాను.
– జాకీర్, ఒడిశా
ఇక్కడే ఆరు నెలలు ఉపాధి
మా రాష్ట్రంలో పనులు దొరకవు. తెలంగాణలో పంటలు బాగా పండుతున్నాయి. జిల్లాకు ఏటా వచ్చి రైసు మిల్లులో పనిచేస్తా. ఆరేడు నెలలపాటు ఇక్కడే ఉంటా. వారానికోసారి సేటు పైసలు ఇస్తరు. నా ఖర్చులకు ఉంచుకొని మిగిలినవి ఇంటికి పంపిస్తాను. ఇక్కడా బాగా వుంది.
– బాబులాల్, బిహార్
Comments
Please login to add a commentAdd a comment