Ancient well
-
చారిత్రక దారి.. 300 ఏళ్ల మెట్లబావి
నాటి చారిత్రక కట్టడాలు నేటి తరానికి గొప్ప సంపద. గతాన్ని చూడని ఇప్పటి జనానికి అలనాటి నిర్మాణాలే సజీవ సాక్ష్యాలు. దశాబ్దాల కాలం నాటి నిర్మాణాలు చెక్కుచెదరకుండా ఇప్పటికీ పటిష్టంగానే ఉండటం అప్పటి సాంకేతికతకు నిదర్శనం. యంత్రాలు, ఇతర నిర్మాణ పనిముట్ల గురించి తెలియని సమయంలో కేవలం మానవుల తెలివితో చేపట్టిన నిర్మాణాలు నేటి సాంకేతికత కంటే చాలా పటిష్టంగా ఉన్నా యి. అలాంటి వారసత్వ సంపద ఎక్కడ ఉన్నా గుర్తించి రక్షించుకోవాల్సిన అవసరం ఉంది.రాజధానికి 52 కి.మీ. దూరంలో..హైదరాబాద్‌కు (Hyderabad) సరిగ్గా 52 కి.మీ. దూరంలో 65వ నెంబరు జాతీయ రహదారిపై విజయవాడ (Vijayawda) మార్గంలో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ (Choutuppal) మున్సిపాలిటీ పరిధిలోని లింగోజిగూడెం (Lingojigudem) గ్రామం ఉంది. ఈ గ్రామంలో జాతీయ రహదారి వెంట ప్రస్తుతం ఉన్న సాయిబాబా దేవాలయాన్ని గతంలో గోసాయిమఠంగా పిలిచేవారు. దశాబ్దాల కిందట ఈ మఠాన్ని అక్కడ ఏర్పాటు చేశారు. దేవాలయం వెనుక భాగాన దిగుడుబావి (మెట్లబావి) ఉంది. ఆ దిగుడు బావిని 300 ఏళ్ల కిందట అప్పటి రాజులు నిర్మించారు. ఎంతో గొప్ప సాంకేతికతతో నిర్మించిన ఈ బావి ఇప్పటికీ చెక్కు చెదరలేదు. దశాబ్దాలుగా నిరుపయోగంగా ఉండటంతో కొంత మేరకు నిర్మాణాలు దెబ్బతిన్నాయే తప్పిస్తే మిగతా కట్టడాలన్నీ యథావిధిగా ఉన్నాయి. రాజుల కాలంలో దిగుడుబావి నిర్మాణందిగుడుబావి (మెట్లబావి) గొప్ప చరిత్ర కలిగి ఉంది. అప్పట్లో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన రాజులు ఇక్కడ విశ్రాంత మందిరాన్ని నిర్మించుకున్నారని, ఆ విశ్రాంత మందిరానికి అనుసంధానంగా అన్ని రకాల సౌకర్యాలతో ఈ దిగుడుబావిని నిర్మించి ఉంటారని స్థానికులు చెబుతున్నారు. దిగుడుబావి పరిసరాల్లోని రాజు భూములు కాలక్రమేణా స్థానికులకు వచ్చాయి. పూర్తిగా రాళ్లతోనే..ఈ దిగుడుబావిని పూర్తిగా రాళ్లతోనే నిర్మించారు. తూర్పున 6 అడుగుల వెడల్పు, దిగువకు 20 అడుగులు, ఉత్తరంలో 10 అడుగుల వెడల్పు ప్రకారం మొత్తంగా దిగువకు 60 అడుగుల మేర మెట్లు ఏర్పాటు చేశారు. మెట్ల మార్గాన్ని గ్రానైట్ రాళ్లతో అందంగా తీర్చిదిద్దారు. 30 అడుగుల వెడల్పు, 60 అడుగుల పొడవు, 80 అడుగుల లోతుతో ఈ బావిని నిర్మించారు. భూమి నుంచి 25 అడుగుల దిగువన బావిలో ప్రత్యేకంగా ఆర్చీలతో మూడు గదులు ఏర్పాటు చేశారు. బావిలో స్నానాలు చేశాక దుస్తులు మార్చుకునేందుకు ఈ గదులను నిర్మించారు. ఆ గదులు ప్రత్యేకంగా మహిళలు (నాటి రాణులు) వినియోగించేవిగా తెలుస్తోంది. పొలాలకు సాగునీరు, స్థానిక ప్రజానీకానికి తాగు నీరు అందించడంతో పాటు ప్రజలు స్నానాలు చేసేందుకు అనువుగా బావిని నిర్మించారు. గోసాయి మఠంగా ప్రత్యేక గుర్తింపుచౌటుప్పల్ పట్టణ కేంద్రానికి తూర్పున 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న లింగోజిగూడెం గ్రామం ఒకప్పుడు గోసాయిమఠంగానే గుర్తింపు పొందింది. కొన్నేళ్ల కిందట గోసాయిదొర అనే వ్యక్తి హైదరాబాద్–విజయవాడ 65వ నంబర్ జాతీయ రహదారికి ఆనుకొని ప్రస్తుతం సాయిబాబా దేవాలయం ప్రాంతంలో మఠాన్ని ఏర్పాటు చేశాడు. పలు ప్రాంతాలకు ప్రయాణాలు చేసే బాటసారులు అలసిపోయిన సందర్భాల్లో విశ్రాంతి తీసుకోవడంతోపాటు అక్కడే విడిది చేసేందుకు అనువుగా అందులో వసతులు ఉండేవని స్థానికులు గుర్తుచేస్తున్నారు. అప్పట్లో ఆర్టీసీ బస్సులు కూడా గోసాయిమఠం స్టేజీ అంటేనే ఆగేవంటే ఎంత ప్రాముఖ్యత ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆలయానికి ప్రస్తుతం రెండు ఎకరాలకుపైగా స్థలం అందుబాటులో ఉంది.మెట్లబావి పరిరక్షణకు ముందుకొచ్చిన హెచ్ఎండీఏశతాబ్దాల కాలంనాటి మెట్లబావి గురించి సాక్షి దినపత్రిక వెలుగులోకి తెచ్చింది. అందుకు సంబంధించి 2022, ఫిబ్రవరి 14న ప్రత్యేకమైన కథనాన్ని ప్రచురించింది. ఆ కథనానికి అప్పటి మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్‌కుమార్ స్పందించారు. వెంటనే మెట్లబావి విషయాన్ని తెలుసుకుని మరమ్మతులు చేయాలని హెచ్ఎండీఏ (HMDA) అధికారులను ఆదేశించారు. అందుకోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించారు. అలా ఈ మెట్లబావిని సుందరీకరించారు. అనంతరం ఏప్రిల్ 14న దీన్ని ప్రారంభించారు. అప్పటి నుంచి ఆ మెట్లబావి బాధ్యతలు హెచ్ఎండీఏ చూసుకుంటోంది. అయితే ఆ ప్రాంతాన్ని మరింతగా అభివృద్ధి చేయడం ద్వారా పర్యాటక ప్రాంతంగా మార్చాలని ప్రజలు కోరుతున్నారు.ఇదీ చదవండి: రాజాబావి.. రాజసం ఏదీ?కేంద్రమంత్రుల దృష్టికి తీసుకెళ్తాం పురాతన మెట్లబావి అభివృద్ధి అంశాన్ని కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌కుమార్ దృష్టికి తీసుకెళ్తాం. పర్యాటక ప్రాంతంగా మారితే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. పురాతన కట్టడాలను సంరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. మూడొందల ఏళ్ల కిందట నిర్మించిన మెట్లబావి మా గ్రామంలో ఉండటం మాకెంతో గర్వకారణం. ప్రభుత్వం, మున్సిపల్ శాఖ నిరంతరం పర్యవేక్షించాలి. – రమనగోని శంకర్, మాజీ సర్పంచ్, లింగోజిగూడెం -
చారిత్రక బావి.. అభివృద్ధి చర్యలేవి
అయిదంతస్తులు.. వంద అడుగుల లోతు.. కాకతీయుల కాలం నాటి కళాత్మక నిర్మాణమిది. శిథిలమైపోతున్న ఒక పురాతన బావి నేపథ్యమిది. పాలకుల ఆదరణకు నోచక..శిథిలమైపోతున్న ఈ బావి కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండల కేంద్ర శివారులో ఉంది. సుమారు 18వ శతాబ్దంలో నిర్మితమైన ఈ బావి అడుగు నుంచిపైభాగంవరకునాలుగు వైపులా ఒకే రకమైన మెట్లు ఉన్నాయి. ఉపరితలం నుంచి 20 అడుగుల వరకు ఒక్కొక్క అంతస్తు చొప్పున అయిదు అంతస్తుల మెట్లు ఉన్నాయి. మెట్ల బావి చుట్టూ పిచ్చిమొక్కలు మొలిచాయి. పునరుద్ధరణ కోసం పురావస్తు శాఖ ముందుకొచ్ఛినా.. నిధుల కొరత వల్ల ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. సికింద్రాబాద్‌లోని బన్సీలాల్ మెట్ల బావి తరహాలోనే.. లింగంపేటలోని పురాతన మెట్ల బావిని బాగు చేయాలని.. పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, నిజామాబాద్ -
దట్టమైన అడవిలో 350 ఏళ్లనాటి దిగుడు బావి.. చూస్తే షాక్ అవ్వాల్సిందే
సాక్షి, తెనాలి(గుంటూరు జిల్లా): అది బావి మాత్రమే కాదు.. ఓ ఇంజనీరింగ్ అద్భుతం.. మన వాళ్ల ప్రతిభకు తార్కాణం.. ప్రకాశం జిల్లాలోని మైలచర్ల అటవీ ప్రాంతంలో ఉన్న ఆ దిగుడు బావిని చూస్తే.. ఎవరైనా ఔరా అనాల్సిందే. అంత అత్యద్భుతంగా ఉంటుంది దాని నిర్మాణ కౌశలం. లేత గోధుమ రంగు గ్రానైట్ రాళ్లను అందంగా చెక్కి ఆ బావిని నిర్మించారు. తెనాలికి చెందిన ఔత్సాహిక పురావస్తు పరిశోధక బృందం చిట్టడవిలో ప్రయాణించి మరీ ఈ అందమైన దిగుడు బావిని వెలుగులోకి తెచ్చింది. ఆ విశేషాలను ‘సాక్షి’కి వెల్లడించింది. ఆ బావి మెట్లు.. కనికట్టు! ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలు నుంచి 109 కిలోమీటర్ల దూరంలో ఉన్న మైలచర్ల అటవీగ్రామం వెలుపల ఉందీ దిగుడు బావి. తెనాలికి చెందిన ఔత్సాహిక పురావస్తు పరిశోధకులైన మొవ్వ మల్లికార్జునరావు, చిట్టినేని సాంబశివరావు, బోడపాటి రాఘవయ్య, ముత్తేవి రవీంద్రనాథ్‌లు ఈ బావి గురించి సూచాయిగా విన్నారు. దీంతో ఆ బావిని సందర్శించాలన్న కోరిక వారికి కలిగింది. గత నెలాఖరులో అక్కడకు ప్రయాణం కట్టారు. చంద్రశేఖరపురం మండలంలోని వేట్ల బయలు(వి.బైలు) అనే గ్రామ పంచాయతీ శివారు గ్రామమైన మైలచర్లకు చేరుకున్నారు. అక్కడి నుంచి చిట్టడవిలో కొంత దూరం ప్రయాణించాక వెలుగుచూసింది.. ఆ అద్భుతమైన బావి. ఆ మెట్ల బావి డిజైన్, అనితర సాధ్యమైన నైపుణ్యంతో రూపొందించిన తీరు అద్భుతమని రవీంద్రనాథ్ బృందం చెప్పింది. ఊటబావి చుట్టూ పటిష్టంగా నిర్మించిన రాతి కూర్పు కారణంగా గట్టు నుంచి మట్టి పెళ్లలు విరిగిపడి నీరు కలుషితమయ్యే అవకాశమే లేదు. పటిష్టంగా నిర్మించిన రాతి మెట్ల కారణంగా చివరివరకు కిందికి దిగి శుభ్రమైన మంచినీటిని తీసుకెళ్లే వీలు గ్రామీణులకు లభించింది. ప్రస్తుతం నీరు కొద్దిగా మురికిగా ఉన్నా.. తీయదనాన్ని కోల్పోకపోవడం విశేషం. ఇప్పుడు పరిస్థితి కొంతమేర ఆశాజనకంగానే ఉన్నా.. గతంలో తరచూ దుర్భిక్షం తాండవించే ప్రాంతం అది. బిందెడు మంచినీటి కోసం సుదూర గ్రామాల ప్రజలు మైలచర్ల అటవీ ప్రాంతంలోని సహజసిద్ధమైన మంచినీటి ఊట దగ్గరకు వచ్చేవారట. ‘గండి సోదరుల’ అద్భుత సృష్టి భైరవకోన గుహాలయాల్లో క్రీ.శ 1675 ప్రాంతంలో నివసించిన ఒక సాధువు.. ఆ ప్రాంత ప్రజల తాగునీటి ఇక్కట్లను గమనించి పరిష్కారాన్ని ఆలోచించారు. మైలచర్ల నీటి ఊట దగ్గర ఒక సౌకర్యవంతమైన దిగుడు బావిని నిర్మించాలని తన శిష్యులైన ‘గండి సోదరులు’గా ప్రసిద్ధులైన పశువుల పెంపకందార్లను ఆదేశించడంతో ఈ బావిని వారు నిర్మించినట్టు స్థానికులు చెబుతున్నారు. చదవండి: కుప్పం టీడీపీ కోట కూలడానికి కారణం ఇదేనా?.. విశ్లేషకులు ఏం చెబుతున్నారు? -
ప్రధాని మోదీ ప్రశంసించిన బారం బావికి జీవం..
నారాయణపేట: ఒకప్పుడు ఎంతో మంది దాహార్తి తీర్చిన ఆ బావి.. కాలక్రమంలో నిరాదరణకు గురైంది. ఉనికినే కోల్పోయి కంపచెట్లకు నెలవుగా మారింది. చెత్తాచెదారం పేరుకుపోయి దుర్గంధభరితంగా తయారైంది. అలాంటి బావి.. కలెక్టర్ చొరవ, స్వచ్ఛంద సంస్థ సహకారంతో పూర్వవైభవం సంతరించుకొంది. బతుకమ్మ వేడుకలకు వేదికవడమే కాకుండా.. మన్‌కీబాత్‌లో ప్రధానమంత్రి మోదీ నోట కీర్తించేవరకూ వెళ్లింది. నారాయణపేట జిల్లా కేంద్రంలోని బారం బావి ఖ్యాతిపై కథనం.. జిల్లా కేంద్రంలోని పురాతనమైన బారంబావి గురించి తెలుసుకున్న కలెక్టర్ దాసరి హరిచందన బావిని పునరుద్ధరించి భావితరాలకు అందించాలని సంకల్పించారు. ఈ మేరకు గతేడాది ఓ స్వచ్ఛంద సంస్థ సహకారంతో పరిశుభ్రత చర్యలు చేపట్టారు. బావి మెట్లకు మరమ్మతు చేయించి చుట్టూ పెరిగిన కంపచెట్లు, పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగించారు. బావిలో పూడికను తీయించడంతో ఊటనీరు చేరి జలకళ సంతరించుకుంది. పునరుద్ధరణ తర్వాత బారం బావి.. గతేడాది నుంచి బతుకమ్మను అక్కడే కనులపండువగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో బారం బావి పునరుద్ధరణపై గతేడాది మార్చి 28న మన్‌కీబాత్‌లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాట్లాడారు. మళ్లీ బతుకమ్మ పండుగ నేపథ్యంలో.. చారిత్రక మెట్లబావి పునరుద్ధరణ విషయమై పట్టణంలో పలువురు చర్చించుకుంటున్నారు. కలెక్టర్ దాసరి హరిచందన చూపిన చొరవను గుర్తు చేసుకుని, హర్షం వ్యక్తం చేస్తున్నారు. విద్యుద్దీపాల కాంతుల్లో బారం బావిలో బతుకమ్మ సంబరాలు విద్యుత్ కాంతులతో జిగేల్.. గతంలో బతుకమ్మ వేడుకలను స్థానిక చిట్టెం నర్సిరెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో నిర్వహించేవారు. బారంబావి పునరుద్ధరించడంతో గతేడాది నుంచి అక్కడే బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. బావి చుట్టూ విద్యుత్ దీపాలతో అలంకరించడంతో.. ఆ కాంతుల్లో సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. తొమ్మిది రోజుల పాటు జిల్లాలోని ఒక్కొక్క శాఖ ఒక్కోరోజు ప్రత్యేకంగా తయారు చేసిన బతుకమ్మలతో సంబరాలు జరుపుకొంటారు. తొమ్మిదిరోజుల పాటు నిర్వహించే బతుకమ్మలను బారం బావిలో నిమజ్జనం చేస్తున్నారు. ఈ సందర్భంగా దేవతల వేషధారణలతో విద్యార్థినుల ప్రదర్శనలు ఆకట్టుకుంటున్నాయి. బతుకమ్మలను పుట్టిలో ఉంచి బారంబావిలో ప్రదర్శించడం ఇక్కడి ప్రత్యేక ఆకర్షణ. -
Hyderabad: పురాతన కట్టడాల పరిరక్షణకు చర్యలు
భాగ్యనగర చరిత్రలోనే ప్రఖ్యాతి గాంచింది బన్సీలాల్‌పేటలోని పురాతన కోనేరు బావి. పదిహేడో శతాబ్దంలో తాగునీటి అవసరాల నిమిత్తం నిర్మించారు. కాలగమనంలో శిథిలావస్థకు చేరుకోవడంతో దీని పునరుద్ధరణకు ప్రభుత్వం నడుం కట్టింది. చారిత్రక సంపదను భావితరాలకు అందించేందుకు చర్యలు చేపట్టింది. కోనేరు బావిని గురువారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మున్సిపల్ పరిపాలన శాఖ ప్రత్యేక కార్యదర్శి అర్వింద్ కుమార్, సహిత స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి కల్పనా రమేష్ సందర్శించారు. బన్సీలాల్‌పేట్: హైదరాబాద్ నగరంలోని పురాతన కట్టడాలను పరిరక్షించి వాటిని పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దటానికి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. సనత్‌నగర్ నియోజకవర్గంలోని బన్సీలాల్‌పేట్ కోనేరు బావి పునరుద్ధరణ పనులను గురువారం ఆయన మున్సిపల్ పరిపాలన శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, సహిత స్వచ్ఛంద సంస్ధ ప్రతినిధి కల్పనా రమేష్‌తో పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. చరిత్రకు సాక్ష్యాలుగా నిలిచే పురాతన కట్టడాలకు పూర్వవైభవం తీసుకురావాలని సీఎం కేసీఆర్ ఆదేశించారన్నారు. (చదవండి: సిగ్నల్ ఫ్రీ చౌరస్తాగా జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు) బన్సీలాల్‌పేట్‌లో ఈ ప్రాంత ప్రజల నీటి అవసరాలను తీర్చడానికి 17వ దశాబ్దంలో కోనేరు బావిని నిర్మించారని, చెత్తాచెదారంతో నిండిన ఈ బావిని పునరుద్ధరించడానికి పనులు ప్రారంభించామన్నా రు. ఆగస్టు 15 నాటికి కోనేరు బావి పూర్తిస్ధాయిలో అభివృద్ధి చేసి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామన్నారు. అరవింద్‌కుమార్ మాట్లాడుతూ.. కోనేరు బావి సమగ్రాభివృద్ధి కోసం ఇప్పటి వరకు 50 లక్షలు ఖర్చు చేశామని, మరో రూ. కోటి ఖర్చు చేసిన ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ హేమలత, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి, సికింద్రాబాద్ ఆర్డీఓ వసంత, జలమండలి జీఎం రమణారెడ్డి, విద్యుత్తు శాఖ డీఈ శ్రీధర్ పాల్గొన్నారు. (చదవండి: ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారికి షాకింగ్ న్యూస్) -
పాడుబడ్డ బావి నుంచి బయటికొస్తున్న గ్యాస్
-
తవ్వకాల్లో బయటపడ్డ పురాతన బావి
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండలం బాటసింగారం -మజీద్‌పూర్ గ్రామాల సరిహద్దుల్లో జరిగిన తవ్వకాల్లో నిజాంకాలం నాటి బావి బయటపడింది. అయితే, గుప్తనిధి కూడా దొరికి ఉంటుందన్న అనుమానాలను స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. వివరాలివీ.. బాటసింగారం -మజీద్‌పూర్ గ్రామాల సరిహద్దుల్లో సత్రామహల్ (విడిది గృహం)గా పిలిచే స్థలం ఉంది. సత్రామహల్ నిజాం కాలంలో బాటసారులకు విడిది గృహంగా ఉపయోగించుకునే వారని తెలుస్తోంది. అయితే, అనాజ్‌పూర్ రెవెన్యూ పరిధిలో ఈ భూమి ప్రస్తుతం బాటసింగారం గ్రామానికి చెందిన ఓ రైతుకు చెందిన పట్టా. మూడెకరాల ఈ స్థలంలో సుమారు వెయ్యి గజాల స్థలం ఎత్తుగా ఉంటుంది. దాని చుట్టూ చింతచెట్లు ఉంటాయి. కాగా, ఈ స్థలంలో గుప్త నిధులు ఉంటాయన్న అనుమానంతో గుర్తు తెలియని వ్యక్తులు వేట ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. ఈ స్థలంలో మూడో కంటికి తెలియకుండా మంగళవారం రాత్రి యంత్రాలతో తవ్వకాలు చేపట్టారు. ఈ తవ్వకాల్లో స్థలం మధ్యలో ఓ బావి బయట పడింది. అయితే తవ్వకాల్లో నిధి బయట పడిందా అన్న విషయంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
పుష్కరిణిలో పురాతన బావి ఆనవాళ్లు
♦ బావిలోంచి సన్నటి ఊటగా నీటి ధార ♦ మిషన్‌కాకతీయలో భాగంగా సుందరీకరణ ♦ జేసీబీతో పని చేస్తుండగా బయటపడ్డ వైనం చేవెళ్ల: మండల కేంద్రంలోని శ్రీ వేంకటేశ్వర దేవాలయ ప్రాంగణంలో ఉన్న ఆం జనేయస్వామి దేవాలయ ఆవరణలో శనివారం పుష్కరిణి (గుండం) సుందరీ కరణ పనులు చేపడుతుండగా పురాతనమైన బావి ఆనవాళ్లు కనిపించాయి. ఈ పుష్కరిణి అభివృద్ధి, సుందరీకరణ పనులకు ప్రభుత్వం మిషన్ కాకతీయ రెండో విడతలో భాగంగా రూ.32లక్షలు మం జూరుచేసింది. ఈ పనులను ఇటీవల మంత్రి మహేందర్‌రెడ్డి ప్రారంభిం చారు. అప్పటి నుంచి కాంట్రాక్టర్ పనులను కొనసాగిస్తున్నాడు. ఇందులో భాగంగా జేసీబీతో లోతు తీసే పని చేస్తుండగా పక్కనే ఉంచిన టిప్పర్ మట్టిలో కుంగడం కనిపించింది. వెంటనే అప్రమత్తమై టిప్పర్‌ను పక్కకు తొలగిం చారు. జేసీబీతో అదే స్థలంలో లోతుగా తవ్వగా బావి ఆనవాళ్లు కనిపించాయి. సన్నగా నీటిధార వస్తుండడం ఈ వాదనకు బలాన్ని చేకూర్చింది. చాలా ఏళ్ల క్రితం ఇక్కడ బావి ఉండేదని, కాలక్రమంలో వర్షాలకు మట్టి కూరుకుపోయి మూసుకుపోయి ఉంటుందని స్థానికులు పేర్కొంటున్నారు. సుమారుగా 400 ఏళ్ల చరిత్ర కలిగిన ఆలయం కావడం, పుష్కరిణి అతి పురాతనమైనది కావడంతో బావి ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంపై ఆలయ పూజారి పి.రాఘవేంద్రాచారిని అడగ్గా అప్పట్లో బావి ఉన్నట్లు పెద్దలు చెబుతుండేవార న్నారు. ఎమ్మెల్యే కాలె యాదయ్య తదితరులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. పురావస్తు శాఖకు ఈ విషయాన్ని విన్నవించాలని ఆలోచిస్తున్నట్లు చెప్పారు.