
పునరుద్ధరణకు ముందు.. పొదలతో నిండిన బారం బావి
నారాయణపేట: ఒకప్పుడు ఎంతో మంది దాహార్తి తీర్చిన ఆ బావి.. కాలక్రమంలో నిరాదరణకు గురైంది. ఉనికినే కోల్పోయి కంపచెట్లకు నెలవుగా మారింది. చెత్తాచెదారం పేరుకుపోయి దుర్గంధభరితంగా తయారైంది. అలాంటి బావి.. కలెక్టర్ చొరవ, స్వచ్ఛంద సంస్థ సహకారంతో పూర్వవైభవం సంతరించుకొంది. బతుకమ్మ వేడుకలకు వేదికవడమే కాకుండా.. మన్‌కీబాత్‌లో ప్రధానమంత్రి మోదీ నోట కీర్తించేవరకూ వెళ్లింది. నారాయణపేట జిల్లా కేంద్రంలోని బారం బావి ఖ్యాతిపై కథనం..
జిల్లా కేంద్రంలోని పురాతనమైన బారంబావి గురించి తెలుసుకున్న కలెక్టర్ దాసరి హరిచందన బావిని పునరుద్ధరించి భావితరాలకు అందించాలని సంకల్పించారు. ఈ మేరకు గతేడాది ఓ స్వచ్ఛంద సంస్థ సహకారంతో పరిశుభ్రత చర్యలు చేపట్టారు. బావి మెట్లకు మరమ్మతు చేయించి చుట్టూ పెరిగిన కంపచెట్లు, పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగించారు. బావిలో పూడికను తీయించడంతో ఊటనీరు చేరి జలకళ సంతరించుకుంది.
పునరుద్ధరణ తర్వాత బారం బావి..
గతేడాది నుంచి బతుకమ్మను అక్కడే కనులపండువగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో బారం బావి పునరుద్ధరణపై గతేడాది మార్చి 28న మన్‌కీబాత్‌లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాట్లాడారు. మళ్లీ బతుకమ్మ పండుగ నేపథ్యంలో.. చారిత్రక మెట్లబావి పునరుద్ధరణ విషయమై పట్టణంలో పలువురు చర్చించుకుంటున్నారు. కలెక్టర్ దాసరి హరిచందన చూపిన చొరవను గుర్తు చేసుకుని, హర్షం వ్యక్తం చేస్తున్నారు.
విద్యుద్దీపాల కాంతుల్లో బారం బావిలో బతుకమ్మ సంబరాలు
విద్యుత్ కాంతులతో జిగేల్..
గతంలో బతుకమ్మ వేడుకలను స్థానిక చిట్టెం నర్సిరెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో నిర్వహించేవారు. బారంబావి పునరుద్ధరించడంతో గతేడాది నుంచి అక్కడే బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. బావి చుట్టూ విద్యుత్ దీపాలతో అలంకరించడంతో.. ఆ కాంతుల్లో సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. తొమ్మిది రోజుల పాటు జిల్లాలోని ఒక్కొక్క శాఖ ఒక్కోరోజు ప్రత్యేకంగా తయారు చేసిన బతుకమ్మలతో సంబరాలు జరుపుకొంటారు. తొమ్మిదిరోజుల పాటు నిర్వహించే బతుకమ్మలను బారం బావిలో నిమజ్జనం చేస్తున్నారు. ఈ సందర్భంగా దేవతల వేషధారణలతో విద్యార్థినుల ప్రదర్శనలు ఆకట్టుకుంటున్నాయి. బతుకమ్మలను పుట్టిలో ఉంచి బారంబావిలో ప్రదర్శించడం ఇక్కడి ప్రత్యేక ఆకర్షణ.
Comments
Please login to add a commentAdd a comment