ఏటా పేద విద్యార్థులకు పుస్తక సామగ్రి పంపిణీ
న్యాయవాదిగా పనిచేస్తూ దాతృత్వం చాటుతున్న బాబు
మారుమూల ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు చేయూత
సాక్షి, సిటీబ్యూరో: నిరుపేద కుటుంబం నుంచి వచ్చారు.. ఆయనకు చదువు విలువ తెలుసు.. చదువుకుంటే జీవితం ఎంత అందంగా ఉంటుందో.. ఎంత గౌరవం ఉంటుందో తెలియజేసే నిలువెత్తు నిదర్శనం. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థుల కష్టాలు స్వయంగా అనుభవించారు. అందుకే తనకు చేతనైనంత సాయం చేయాలని నిర్ణయించుకున్నారు. ఏటా విద్యార్థులకు అవసరమైన నోటు పుస్తకాలు, జామెట్రీ బాక్సులు, స్కూల్ బ్యాగ్స్, వాటర్ బాటిల్స్ అందిస్తూ సమాజ సేవకు నడుం బిగించారు. చేతనైనంత సాయం చేస్తే ప్రకృతి కూడా మనకు సాయపడుతుందని చెబుతారు న్యాయవాది సంగిశెట్టి బాబు. ఆయన గురించిన మరిన్ని విషయాలు..
ఇబ్రహీంపట్నం సమీపంలోని రాయ్‌పూర్‌లో ఓ నిరుపేద కుటుంబంలో యాదమ్మ, శంకరయ్య దంపతులకు జన్మించారు సంగిశెట్టి బాబు. చిన్నప్పటి నుంచి కడుపేదరికం అనుభవించారు. అయితే తమ జీవితాలను చదువు మాత్రమే మారుస్తుందన్న మాటను తు.చ. తప్పకుండా పాటించారు. అందుకే ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ కాలేజీల్లో విద్యాభ్యాసం కొనసాగించారు. అనంతరం ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశారు. ఎల్‌ఎల్‌ఎంలో గోల్డ్ మెడల్ సాధించారు. లా ప్రాక్టీస్ చేసుకుంటూనే పీహెచ్‌డీ కూడా పూర్తి చేశారు. చిన్నప్పుడు తాను పడ్డ కష్టాలు ప్రభుత్వ పాఠశాలల్లోని పిల్లలు పడొద్దనే తలంపుతో తన వంతు సాయంగా ముందడుగు వేస్తున్నారు.
ఒక్క రూపాయి లేనిస్థితి నుంచి..
తన తల్లిదండ్రుల పేరుతో 2016లో యాదశంకర మెమోరియల్ ఫౌండేషన్ పేరుతో ఓ ట్రస్ట్ ఏర్పాటు చేశారు. అయితే ఆ సమయంలో తన చేతిలో ఒక్క రూపాయి కూడా లేదట. కానీ సంకల్ప బలం తోడైతే ఏదైనా సాధించవచ్చని నమ్మే బాబుకు.. విద్యా సామగ్రి పిల్లలకు అందజేసే ముందురోజు కేసులకు సంబంధించిన డబ్బులు వచ్చాయట. అందుకే తాను నమ్మిన సిద్ధాంతంతోనే ముందుకు వెళ్తున్నాన్నంటారు బాబు.
ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లో..
హైదరాబాద్ చుట్టుపక్కల చాలామంది ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే ఆదిలాబాద్ వంటి జిల్లాల్లోని మారుమూల ప్రాంతాల్లోని పిల్లలు చదువుకోవడమే కష్టం అవుతుందన్న విషయం గుర్తు చేసుకున్నారు. అంతే ఏటా ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లోని పలు మండలాల్లోని పిల్లలకు సామగ్రి అందజేస్తున్నారు. మౌలిక సదుపాయాలు లేక ఎవరూ చదువు మధ్యలో ఆపేయొద్దనేదే తన ఉద్దేశమని బాబు అంటున్నారు. భవిష్యత్తులో పిల్లల కోసం ఎంత కష్టమైనా తాను ముందుంటానని చెబుతున్నారు. బాబు నేపథ్యం స్ఫూర్తిదాయకం అయితే.. ఆయన సేవాగుణం ఆదర్శప్రాయం అనడంలో అతిశయోక్తి లేదు.
ఇవి చదవండి: సాయపు చేతులు..!
Comments
Please login to add a commentAdd a comment