కుప్పం ఉపకాలువ కోసం భూమిలో అమర్చిన సైఫన్ పైప్‌లైన్ (ఫైల్)
సాక్షి, బి.కొత్తకోట: మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గానికి కృష్ణా జలాలను తీసుకెళ్లే కుప్పం ఉపకాలువ పనుల అంచనాకు అదనపు చెల్లింపుల వ్యవహారంపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ లెక్కతేల్చే పనిలో పడింది. రూ.430.26 కోట్ల పనులకు నిబంధనలకు విరుద్ధంగా రూ.144.7 కోట్లు అదనంగా చెల్లించడంపై ఆగస్టు 13న ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ పరిశీలనలు నిర్వహించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ పనులను విజిలెన్స్ విచారణ చేపట్టింది. ప్రధానంగా కుప్పం కాలువ పనులను క్షేత్రస్థాయిలో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ జనరల్ రాజేంద్రనాథరెడ్డి స్వయంగా పరిశీలించేందుకు నిర్ణయించారు. ఈ మేరకు ఆయన సోమవారం కుప్పం ఉపకాలువ పనులను స్వయంగా పరిశీలించనున్నారు. ఈ పరిశీలన వ్యవహరం అధికారుల్లో ఆందోళనకు గురిచేస్తోంది.
ఇష్టారాజ్యంగా దోచుకున్నారు
కుప్పం కాలువలో అవినీతి వరద పారింది. పను ల అంచనా నుంచి అదనపు చెల్లింపు వ్యవహారం అంతా గత ప్రభుత్వ కనుసన్నల్లోనే సాగింది. ఈపీసీ ద్వారా 4 శాతం ఎక్సెస్‌తో రూ.430.26 కోట్లకు పనులు దక్కించుకున్న జాయింట్ వెంచర్ సంస్థలు ఒప్పందం మేరకు 123.641 కిలోమీటర్ల కాలువ తవ్వకం, 324 స్ట్రక్చర్స్, 5 చోట్ల ఎన్‌హెచ్ క్రాసింగ్ పనులు, 3 చోట్ల ఎత్తిపోతల పథకాల నిర్మాణం, 110 చెరువులకు నీరు అందించే పనులు పూర్తి చేయాలి. ఈ మేరకు పనులు చేపట్టకపోగా, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్ ప్రాజెక్టŠస్ సంస్థకు భాగస్వామ్యం కల్పించడమేకాక ఒప్పందం మేరకు 9 నెలల్లో పూర్తి చేయాల్సిన పనులను ఇప్పటికీ పూర్తి చేయలేదు.
దీనికితోడు ఈసీపీ ద్వారా పనులు దక్కించుకున్న కాంట్రాక్టు సంస్థలకు అదనపు చెల్లింపులు సాధ్యం కాదని... వెసులుబాటు కోసం 626, 68 జీవోలు జారీ చేసిన గత ప్రభుత్వం రెండు విడతల్లో అదనంగా రూ.144.7 కోట్లు చెల్లించింది. పనులు చేపట్టడంలోనూ కాంట్రాక్టు సంస్థలు ఇష్టారీతిన వ్యవహరించాయి. వారికి అనుకూలంగా పనులు చేసుకున్న అధికారులు ప్రభుత్వ నిర్ణయం మేరకు చర్యలు తీసుకోలేని పరిస్థితుల్లో ఉండిపోయారు. ఈ పనులపై గత ఆగస్టు 13వ తేదీ నిపుణుల కమిటీ పరిశీలనలు నిర్వహించగా.. కమిటీ ప్రభుత్వానికి ఇంకా నివేదిక సమర్పించలేదని సమాచారం. ఈ పరిస్థితుల్లో విజిలెన్స్ ఉన్నత స్థాయి అధికారుల విచారణ చేపట్టి అక్రమాల నిగ్గు తేల్చనున్నారని తెలుస్తోంది.
రెండు రోజులుగా రికార్డుల పరిశీలన
కుప్పం ఉపకాలువ పనులకు సంబంధించిన రికార్డులను రెండు రోజులుగా విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంటుకు చెందిన డెప్యూటీ ఇంజినీర్, ముగ్గురు జేఈలు పరిశీలిస్తున్నారు. మదనపల్లెలోని ఎస్‌ఈ కార్యాలయంలో శని, ఆదివారాలు వీరు ముమ్మరంగా రికార్డులు పరిశీలిస్తున్నారు. ఏఏ పనులు రికార్డు చేశారు, నిబంధనల మేరకు పనులు జరిగాయా లేదా అనే వివరాలను ముందుగానే పరిశీలించారు. సోమవారం డైరెక్టర్ జనరల్ కాలువను పరిశీలించనుండటంతో ఆ శాఖ అధికారులు ముందస్తుగా నివేదికలు సిద్ధం చేసుకున్నారు.
నేడు డీజీ, సీఈ రాక
కుప్పం ఉపకాలువ పనులకు సంబంధించి విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ రాజేంద్రనాథరెడ్డి, చీఫ్ ఇంజినీర్ గోపాల్‌రెడ్డి పరిశీలనలు నిర్వహించనున్నారు. పలమనేరు, కుప్పం నియోజకవర్గాల పరిధిలో జరిగిన పనుల్లో ఏఏ పనులు పరిశీలిస్తారో ముందుగా సమాచారం లేనందున ప్రాజెక్టు అధికారులు అప్రమత్తమయ్యారు. ఎత్తిపోతలు, కాలువ, కాంక్రీటు నిర్మాణాలను పరిశీలించే అవకాశం ఉంది. పనులు డీపీఆర్ మేరకు చేశారా లేదా, అంచనాలు ఎలా పెంచుకున్నారు, తదితర వాటిపై పరిశీలనలు చేసే వీలుంది.
Comments
Please login to add a commentAdd a comment