ఏ గుర్తు.. ఎంతిస్తరు..? కండువా వేసుకుని సిద్ధం.. | - | Sakshi
Sakshi News home page

ఏ గుర్తు.. ఎంతిస్తరు..? కండువా వేసుకుని సిద్ధం..

Published Sun, Nov 19 2023 1:26 AM | Last Updated on Sun, Nov 19 2023 12:55 PM

- - Sakshi

పెద్దపల్లి సభకు ట్రాలీ ఆటోలో వస్తున్న గ్రామీణ మహిళలు

సాక్షి, కరీంనగర్‌/పెద్దపల్లి: శాసనసభ సాధారణ ఎన్నికల్లో పోటీపడుతున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు ఏర్పాటు చేసే ఎన్నికల ప్రచారసభ, ఇంటింటిప్రచారం.. ఏదైనా కార్యకర్తలు మాత్రం వాళ్లేనని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. పెద్దపల్లి సెగ్మెంట్‌లో ఇటీవల నిర్వహించిన సభలకు నేతలు మినహా హాజరైన వారిలో అధికశాతం పెయిడ్‌ కార్యకర్తలే అనడంలో అతిశయోక్తి లేదు.

ఊళ్లలోనే ప్రచారం..
► గ్రామాల్లో స్థానికంగానే ఇంటింటి ప్రచారం నిర్వహించే రాజకీయపార్టీల తరఫున ప్రచారం చేసేందుకు ముందుకొస్తున్న వారు ఏ గుర్తుకు ప్రచారం చేయాలి, ఇలా చేస్తే తమకు ఎంత ఇస్తారని అడిగి మరీ వసూలు చేసుకుంటున్నట్లు ప్రచారం సాగుతోంది.
► అయితే ఆయా ఊళ్లలో ఉండే కొందరు చోటామోటా నాయకులు, గ్రామ పెద్దలు జనసమూహాన్ని తరలించేందుకు కొంతమొత్తాన్ని మాట్లాడుకుని అందులో కొంత నొక్కేస్తున్నారనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి.
► ఇంటింటి ప్రచారాన్ని స్థానికంగా ఉండేవాళ్లతో గంట, గంటన్నర సమయం పాటు నిర్వహిస్తూ రూ.100నుంచి రూ.150 దాకా చెల్లిస్తున్నట్లు సమాచారం. అలాగే మండల, జిల్లా కేంద్రాల్లో నిర్వహించే అగ్రనేతల సభలకు వాహనాల్లో తరలించిన సమయాల్లో రూ.300 నుంచి రూ.500దాకా చెల్లిస్తే సదరు పార్టీ కండువా వేసుకుని సిద్ధంగా ఉంటున్నారని అంటున్నారు.
► కొద్దిసేపటికోసమే కావడంతో మహిళలు, వృద్ధులు సభలకు వచ్చేందుకు పోటీపడుతున్నారు. మగ వారినికి తీసుకొస్తే వారిని తీసుకొచ్చిన నాయకుడు తిరుగు ప్రయాణంలో మందుతో విందు ఏర్పాటు చేయాల్సి వస్తోందని ఎక్కువ మంది నేతలు మహిళలనే పిలి పించేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.
► ఇటీవల పెద్దపల్లిలో జరిగిన ఓ సభకు 30వేల మందికిపైగా మహిళలు హాజరుకావడం గమనార్హం.

ఊపందుకోనున్న ప్రచారం..
నామినేషన్ల దాఖలు, ఉపసంహరణ ప్రక్రియ ముగియడంతో గుర్తులు పొందిన అభ్యర్థులు ప్రచా రంలో మునిగి తేలుతున్నారు. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు అగ్రనేతలతో బహిరంగ సభలు ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుని జనసమీకరణలో తలమునకలయ్యారు. దీంతో పెయిడ్‌ కార్యకర్తలకు డిమాండ్‌ పెరుగుతోంది.

వరి కోతలు కూడా ఇప్పుడే..
వరి కోతలు ఇప్పుడే రావడం.. ఎన్నికల ప్రచారసభలు జరగనుండడంతో వ్యవసాయ పనులకు కూలీ ల కొరత ఏర్పడుతోంది. వలసకూలీలతో కొన్ని ప్రాంతాల్లో కోతలు కోస్తుండగా.. యంత్రాలతో ఇంకొన్ని ఏరియాల్లో వరికోతలు ముమ్మరం చేస్తున్నా రు. ఏదైతేనేం.. సాధారణ ఎన్నికల ప్రచారపర్వం గడువు చివరి దవలో వస్తుండడంతో జోరు పెంచేందుకు రాజకీయ పార్టీలు సన్నద్ధమవుతున్నాయి.
ఇవి కూడా చదవండి: చేరి.. చేజారి..! ‘హస్తం’లో తారుమారు రాజకీయం..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement