సాక్షి,పెద్దపల్లి: అసెంబ్లీ ఎన్నికల ప్రచారం గడువు మరోవారం రోజుల్లో ముగియనుంది. అయినా జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల బరిలో నిలిచిన వారిలో చాలామంది తమ ప్రచారం ఇంకా మొదలుపెట్టని పరిస్థితి నెలకొంది. ఎన్నికల షెడ్యూల్ విడుదల నాటినుంచే బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీల అభ్యర్థులు మండలాల వారీగా ప్రచార సభలు, సమావేశాలతో దూసుకపోతున్నారు. ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థుల ప్రచార వాహనాలు గ్రామాల్లో పర్యటిస్తూ ఓటర్లును ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నాయి. కానీ స్వతంత్రులుగా, ఇతర చిన్న పార్టీల నుంచి ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల్లో కొంతమంది ప్రచారంలో ఎక్కడా కానరావటం లేదు. దీంతో ప్రధాన పార్టీల అభ్యర్థుల మధ్య పోరు నెలకొంది.
బరిలో 61 మంది
► పెద్దపల్లి అసెంబ్లీ బరిలో 17మంది అభ్యర్థులు పోటీపడుతుండగా, అందులో ప్రధాన పార్టీలతోపాటు న్యూ ఇండియా, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా, భారతీయ స్వదేశీ కాంగ్రెస్ చిన్నపార్టీలతోపాటు, 9మంది స్వతంత్ర అభ్యర్ధులు ఉన్నారు.
► రామగుండంలో 23మంది బరిలో ఉండగా వీరిలో తెలంగాణ లేబర్, విద్యార్థుల రాజకీయ, జనశంఖారావం, పిరమిడ్, ధర్మసమాజ్, న్యూండియా, భారతీయ స్వదేశ్ కాంగ్రెస్, ఆలిండియా డెమొక్రటిక్ రిఫారమ్స్ పార్టీలతో పాటు 11మంది స్వతంత్ర అభ్యర్థులు పోటీపడుతున్నారు.
► మంథని అసెంబ్లీ బరిలో 21మంది పోటీలో ఉండగా చిన్నపార్టీలను కలుపుకుని 17మంది స్వంత్రులు పోటీచేస్తున్నారు.
సైలెంట్ చేశారా!
ఈవీఎంలో నోటాతో కలుపుకుని 16మంది అభ్యర్థులు దాటితే మరో ఈవీఎం అమర్చాల్సి ఉంటుంది. మూడు నియోజకవర్గాల్లో రెండు ఈవీఎంలూ వాడాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో స్వంతంత్రులకు పొలయ్యే ఓట్లు ఎవరికి నష్టం చేకూరుస్తాయోనన్న భయం అభ్యర్థులకు ఆందోళన కలిగిస్తోంది. స్వతంత్ర అభ్యర్థులు గెలవకపోయినా, గెలుపోటములను ప్రభావితం చేసిన సందర్భాలు గతంలో అనేకం ఉన్నాయి.
దీంతో ఎన్నికల బరిలో నిలిచిన ప్రధాన పార్టీల అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా అన్నిరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఓట్లలో చీలిక రాకుండా స్వతంత్రులు, ఇతర చిన్నపార్టీల అభ్యర్థులను ప్రచారం చేయకుండా తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. మరో పక్క.. ఎన్నికల ఖర్చుకు భయపడి ఆయా పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు ప్రచారంలో దూకుడు పెంచడం లేదని తెలుస్తోంది.
గుర్తులతో ఇబ్బందే..
► స్వతంత్రులు ఎన్నికల ప్రచారం చేయకున్నా వారికి పోలైన ఓట్లు ఏ పార్టీ అభ్యర్థికి నష్టం చేకూరుస్తాయనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది.
► ఎందుకుంటే ఇండిపెండెంట్ అభ్యర్థులకు కేటాయించిన గుర్తులు, ప్రధాన పార్టీల అభ్యర్థులకు కేటాయించిన గుర్తులను పోలిఉన్న సందర్భంలో క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశం ఉంటుంది.
► దీంతో ఈసారి ఎన్నికల్లో వీరి ప్రభావం ఎంత అనేది ఫలితాలు వస్తే కానీ తెలియని పరిస్థితి నెలకొంది.
ఇవి చదవండి: ఏ గుర్తు.. ఎంతిస్తరు..? కండువా వేసుకుని సిద్ధం..
Comments
Please login to add a commentAdd a comment