సింగరేణి యాజమాన్యంపై కార్మికులు ఆగ్రహం | Singareni Workers Unhappy With Lay Off In Mines | Sakshi
Sakshi News home page

యాజమాన్యం ఏకపక్ష నిర్ణయంపై కార్మికులు ఆగ్రహం

Published Thu, Apr 2 2020 1:57 PM | Last Updated on Thu, Apr 2 2020 2:00 PM

Singareni Workers Unhappy With Lay Off In Mines - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : సింగరేణి యాజమాన్యంపై కార్మికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. యాజమాన్యం ఏకపక్ష నిర్ణయంపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికుల అనుమతి లేకుండా రాష్ట్ర ప్రభుత్వానికి ఒకరోజు వేతనాన్ని విరాళంగా ప్రకటించాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో వేతనంలో 50శాతం కోత విధించాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని సింగరేణి కార్మికులు డిమాండ్‌ చేశారు. అలాగే లే ఆఫ్‌ కాకుండా బొగ్గు గనుల్లో లాక్‌డౌన్‌ ప్రకటించాలని కోరారు. తమ డిమాండ్లు పరిష్కరించకుంటే ఈనెల 15 నుంచి సమ్మె చేపడతామని సింగరేణి కార్మికులు హెచ్చరించారు. ఈ మేరకు సింగరేణి సీఎండీకి గురువారం నోటీస్‌ ఇచ్చారు.

నోటీస్‌లోని ముఖ్యాంశాలు ‘కరోనా వైరస్ వలన కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగులు-కార్మికులు అందరికీ పూర్తి జీతంతో కూడిన లాక్‌డౌన్‌ ప్రకటిస్తే, డీజీఎమ్‌ఎస్‌ నోటీసు ఇచ్చిన తర్వాత సింగరేణి యాజమాన్యం అండర్ గ్రౌండ్ మైన్స్‌ కార్మికులకు సగం జీతంతో కూడిన లే ఆఫ్ ప్రకటించింది. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వం ఆదేశం ప్రకారం లాక్ డౌన్ చేయాలి తప్ప లే ఆఫ్ చేయకూడదు. రాష్ట్ర బడ్జెట్‌లో డబ్బు లేనందువలన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు 50శాతం జీతంలో కోత విధించాలని నిర్ణయించారు. దీనికి సింగరేణికి సంబంధం లేదు. ఎందుకంటే సింగరేణి కార్మికుల జీతాలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వదు. సింగరేణి బొగ్గు అమ్మిన డబ్బుల నుండే చెల్లిస్తుంది.

పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్ ప్రకారం కూడా కార్మికుల జీతం కట్ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. కోల్ ఇండియాలో అనుమతి ఇచ్చిన కార్మికుడు జీతం నుండి ఒక్క రోజు జీతం ప్రధానమంత్రి సహాయ నిధికి ఇవ్వాలని నిర్ణయించారు. కానీ సింగరేణి యాజమాన్యం మాత్రం కార్మికులను సంప్రదించకుండానే ఒక్క రోజు జీతం ఏడు కోట్ల 50 లక్షల ముఖ్యమంత్రి సహాయనిధికి ఇచ్చారు. ఇది చట్టవిరుద్ధం. గత 15 రోజులుగా సింగరేణి కార్మికులు అయోమయానికి గురై దిక్కుతోచక ప్రాణాలకు తెగించి పోలీసులు కొట్టినా డ్యూటీ చేశారు. సమస్యలు పరిష్కరించకుంటే 15-4-2019 నుంచి సమ్మె చేస్తామని హెచ్చరిస్తున్నాం’ అని లేఖలో పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement