
సాక్షి, హైదరాబాద్: బొగ్గు ఉత్పత్తి, రవాణా లక్ష్యాలను సాధించాలంటే ఈ ఏడాదికి ప్రతిపాదించిన కొత్త ఓసీ గనులను సత్వరమే ప్రారంభించాలని సింగరేణి బొగ్గు గనుల సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్ ఆదేశించారు. సింగరేణి భవన్‌లో మంగళవారం డెరైక్టర్లు, అన్ని ఏరియాల జనరల్ మేనేజర్లతో ఆయన సమీక్ష నిర్వహించారు. భారీ వర్షాలతో వెనకబడిన బొగ్గు ఉత్పత్తి, రవాణాలను సెప్టెంబర్ నెల లక్ష్యాలతోపాటు సాధించాలన్నారు. ఓబీ తొలగింపుపై మరింత శ్రద్ధ చూపాలని, లక్ష్యాల మేర ఓబీ తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
సింగరేణి సంస్థ ఆగస్ట్ నెల వరకూ గడచిన 5 నెలల్లో నిర్దేశించుకున్న లక్ష్యాలను దాటి బొగ్గు ఉత్పత్తి, రవాణా సాధించింది. ఆగస్టు ముగిసేనాటికి బొగ్గు ఉత్పత్తి లక్ష్యం 254లక్షల టన్నులు కాగా, 262 లక్షల టన్నుల బొగ్గును (103 శాతం) ఉత్పత్తి చేసింది. 262 లక్షల టన్నుల బొగ్గు రవాణా లక్ష్యాన్ని 261.5 లక్షల టన్నుల రవాణా చేయడం ద్వారా నూరు శాతం ఫలితాన్ని సాధించింది. 2018–19తో పోలిస్తే బొగ్గు ఉత్పత్తిలో 12.4 శాతం వృద్ధిని సాధించింది. 2018 ఆగస్టు చివరికి 233లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయగా, ఈ ఏడాది ఆగస్టు చివరికి 262లక్షల టన్నులు ఉత్పత్తి చేసింది.
Comments
Please login to add a commentAdd a comment