సాక్షి, హైదరాబాద్: సింగరేణి బొగ్గు గనుల సంస్థలో ఉన్న ఖాళీలన్నీ మరో ఆరు నెలల్లో భర్తీ చేస్తామని సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్ తెలిపారు. గత ఐదేళ్లలో ప్రత్యక్ష, కారుణ్య, అంతర్గత నియామకాల పద్ధతుల్లో 16 వేలకు పైగా ఖాళీ పోస్టులను భర్తీ చేశామన్నారు. చాలా గనుల్లో ఖాళీగా ఉన్న టెక్నికల్ స్టాఫ్, సూపర్ వైజర్లు, మెడికల్ సిబ్బంది, స్పెషలిస్టు డాక్టర్లు తదితర పోస్టులను వెంటనే భర్తీ చేసి రక్షణతో కూడిన ఉత్పత్తి పెంచాలని ఉద్యోగ సంఘాలు చేసిన సూచనలపై ఆయన స్పందించారు. సింగరేణి యాజమాన్యం, మైన్స్ సేఫ్టీ డీజీ, గుర్తింపు, ప్రాతినిధ్య కార్మిక సంఘాలు/అధికారుల సంఘం ప్రతినిధులతో మంగళవారం హైదరాబాద్ సింగరేణి భవన్‌లో జరిగిన 46వ రక్షణ త్రైపాక్షిక సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ సూచనల మేరకు కొత్తగా భర్తీ చేయనున్న పోస్టుల్లో ఇంటర్నల్ కోటా పెంచి అర్హులందరికీ అవకాశం కల్పిస్తామన్నారు. ఖర్చుకు వెనుకాడకుండా కార్మికుల రక్షణ విషయంలో పరికరాల కొనుగోలుకు సింగరేణి అత్యధిక ప్రాధాన్యతనిస్తుందని తెలిపారు.
సాక్షి, హైదరాబాద్: నిరుద్యోగంపై ప్రభుత్వం వెంటనే దృష్టి సారించాలని, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసి, ఉద్యోగ క్యాలెండర్‌ను ప్రకటించాలని ప్రభుత్వాన్ని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ డిమాండ్ చేశారు. ‘తెలంగాణ ప్రజల బతుకు దెరువు నిలబెట్టాలి, రాష్ట్రాన్ని కాపాడాలి’అన్న నినాదంతో జనవరి 3, 4 తేదీల్లో 48 గంటలపాటు నాంపల్లిలోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో నిరాహార దీక్ష చేస్తామని ప్రకటించారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. 2018 నుంచి ఉద్యోగాల భర్తీ చేయకపోవడంతో యువత గ్రామాల్లో ఉంటూ ఉపాధి హామీ పనులకు వెళ్తున్నారని వాపోయారు. నిరుద్యోగ భృతి చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించి రెండేళ్లు కావస్తున్నా ఇప్పటివరకు దాని ఊసెత్తలేదని విమర్శించారు. కరోనా అనంతరం అన్ని వ్యాపార సంస్థలను ప్రోత్సహించిన ప్రభుత్వం బడ్జెట్ స్కూళ్ల విషయంలో ఎందుకు నిర్ణయం తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఎల్‌ఆర్‌ఎస్ పేరుతో రియల్ ఎస్టేట్ రంగాన్ని ప్రభుత్వం పూర్తిగా ముంచేసిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment